ఆడిటర్లు నమ్మక ద్రోహానికి పాల్పడ్డారు
సాక్షి, హైదరాబాద్: సత్యం కంప్యూటర్స్‌కు ఆడిటింగ్ నిర్వహించిన ఆడిటర్లు నమ్మకద్రోహానికి పాల్పడ్డారని, తప్పుడు ఆడిటింగ్ నివేదికలు ఇచ్చి లక్షలాది మంది మదుపరులను మోసం చేశారని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ) ఆరోపించింది. సత్యం కంప్యూటర్స్ యాజమాన్యం ప్రభుత్వానికి, పర్యవేక్షణ సంస్థలకు తప్పుడు నివేదికలు సమర్పించి దేశప్రతిష్టను దెబ్బతీసిందని పేర్కొంది. సెబీ నిబంధనలను ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొంది.
అక్రమాలకు పాల్పడిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ సెబీ రెండు వేర్వేరు ఫిర్యాదులు దాఖలు చేసింది. సత్యం కంప్యూటర్స్ మాజీ అధినేత బైర్రాజు రామలింగరాజు, ఆయన సోదరుడు రామరాజుతోపాటు ఆయన కుటుంబ సభ్యులు, సత్యం కంప్యూటర్స్ సీఎఫ్‌వో వడ్లమాని శ్రీనివాస్, ఆడిటింగ్ నిర్వహించిన పీడబ్ల్యుసీ ఆడిటింగ్ సంస్థతోపాటు ఆడిటర్లు తళ్లూరి శ్రీనివాస్, గోపాలకృష్ణన్‌తోపాటు దాదాపు 15 మందిని నిందితులుగా పేర్కొన్నారు. నేర విచారణ చట్టంలోని సెక్షన్ 200తోపాటు సెబీ చట్టంలోని సెక్షన్లు 12(ఎ), 24(1), 26, 27ల కింద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.
సెబీ స్పెషల్ పీపీ బీఎస్ శివప్రసాద్ ఈ ఫిర్యాదు దాఖలు చేశారు. ఫిర్యాదుతోపాటు 18 కీలక డాక్యుమెంట్లను ఆధారాలుగా సమర్పించారు. సెబీ దర్యాప్తు అధికారిగా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఏజీఎం) ప్రదీప్ రామకృష్ణన్ ఉండగా, సాక్షులుగా సెబీ సీజీఎం ఎ.సునీల్‌కుమార్, జీఎం బి.ముఖర్జీలను పేర్కొన్నారు. ఒకటి రెండు రోజుల్లో ఆర్థిక నేరాల విచారణ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి లక్ష్మణ్...ఈ ఫిర్యాదులను విచారించే అవకాశం ఉంది.