ముంబై: వాట్సాప్ లీక్‌ల విషయాన్ని మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్చంజ్ బోర్డ్(సెబీ) తీవ్రంగానే పరిగణిస్తోంది. ఈ విషయమై తీవ్రంగానే దర్యాప్తు జరుగుతోందని సెబీ చైర్మన్ అజయ్ త్యాగి చెప్పారు. మరోవైపు ఐపీఓకు వచ్చిన కంపెనీల స్టాక్ మార్కెట్ లిస్టింగ్ సమయాన్ని ప్రస్తుతమున్న ఆరు రోజుల నుంచి నాలుగు రోజులకు తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు. ఇలా లిస్టింగ్ సమయాన్ని తగ్గించడం వల్ల ప్రైమరీ మార్కెట్ మరింత సమర్థవంతంగా ఉంటుందని వివరించారు. మ్యూచువల్ ఫండ్స్‌పై ఇన్వెస్టర్ల అవగాహన పెరుగుతోందని, ఫండ్స్‌లో మదుపు చేసే రిటైల్ ఇన్వెస్టర్ల సంఖ్య పెరుగుతోందని పేర్కొన్నారు. ఇక్కడ జరిగిన ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ సదస్సులో ఆయన వివిధ అంశాలపై మాట్లాడారు. వివరాలు..
వాట్సాప్ లీక్‌లు..
లిస్టెడ్ కంపెనీల కీలకమైన ఆర్థిక సమాచారం అధికారికంగా వెల్లడికాక ముందే సోషల్ మీడియా(వాట్సాప్) ద్వారా అందరికీ అందుబాటులోకి వచ్చిన ఉదంతాన్ని తీవ్రంగానే పరిగణిస్తున్నామని అజయ్ త్యాగి చెప్పారు. కొన్ని కంపెనీల క్యూ2 ఆర్థిక ఫలితాల వివరాలు అధికారికంగా వెలువడకముందే వాట్సాప్‌లో కొందరు వ్యక్తులు సర్క్యులేట్ చేశారని త్యాగి నిర్ధారించారు. దీనిని తాము చాలా తీవ్రంగా పరిగణిస్తున్నామని పేర్కొన్నారు. స్టాక్ మార్కెట్లో ఆయా కంపెనీల షేర్ల ధరలను ప్రభావితం చేసే ఆర్థిక ఫలితాలు ముందుగానే వాట్సాప్‌లో లీక్ కావడం పట్ల తాము చూస్తూ ఊరుకోబోమని వివరించారు.
కాల్ రికార్డ్‌ల పరిశీలన...
వాట్సాప్ ద్వారా దాదాపు 24 కంపెనీల క్యూ2 ఫలితాలు ముందుగానే వెల్లడైన విషయమై సెబీ, స్టాక్ ఎక్సే్చంజ్‌లు దర్యాప్తు చేస్తున్నాయని తెలిపారు. ఈ దర్యాప్తులో భాగంగానే ఈ 24 కంపెనీల షేర్ల లావాదేవీల వివరాలను సెబీ, స్టాక్ ఎక్స్ఛేంజ్‌లు పరిశీలిస్తున్నాయని వివరించారు. ఈ వాట్సాప్ లీక్‌లతో ప్రమేయం ఉన్న, ఈ లీక్‌లను సర్క్యులేట్ చేసిన వ్యక్తుల కాల్ డేటా రికార్డ్‌లను కూడా పరిశీలించాలని యోచిస్తున్నామని పేర్కొన్నారు. ఈ వ్యక్తులతో సంబంధమున్నట్లు తేలితే బ్రోకరేజ్ సంస్థలు, కంపెనీలను కూడా స్పష్టత కోరతామని త్యాగి పేర్కొన్నారు. వాట్సాప్ లీక్‌ల దర్యాప్తు విషయమై సెబీతో కలిసి పనిచేస్తున్నామని ఇదే ఈవెంట్‌లో పాల్గొన్న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(ఎన్‌ఎస్‌ఈ) ఎండీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ విక్రమ్ లిమాయే చెప్పారు.
వాట్సాప్ లీక్‌ల వ్యవహారం గత నెల 17న వెలుగులోకి వచ్చింది. కొన్ని కంపెనీల క్యూ2 ఫలితాలు ఆయా కంపెనీలు స్టాక్ ఎక్స్ఛేంజ్‌లకు వెల్లడించకముందే కొన్ని వాట్సాప్ గ్రూప్‌లో సర్క్యులేట్ అయ్యాయి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, సిప్లా, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టాటా స్టీల్, విప్రో, బజాజ్ ఫైనాన్స్, తదితర కంపెనీల డేటా ఇలా వాట్సాప్ ద్వారా లీకయింది. కాగా ఈ ఏడాది ఐపీఓ మార్కెట్ సంతృప్తికరంగా ఉందని చెప్పారు. గత ఆరేళ్లలో ఐపీఓల ద్వారా ఎన్ని నిధులు వచ్చాయో, అంతకు మించి ఈ ఏడాది ఐపీఓ ద్వారా నిధుల సమీకరణ జరిగిందని వివరించారు.
వాట్సాప్ లీక్‌లపై ‘సెబీ’ సీరియస్
Published Wed, Dec 13 2017 12:59 AM | Last Updated on Wed, Dec 13 2017 12:59 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment