వాడిన కారు.. మహా జోరు! | Second hand business of cars becoming high | Sakshi
Sakshi News home page

వాడిన కారు.. మహా జోరు!

Published Mon, May 25 2015 12:43 AM | Last Updated on Tue, Aug 14 2018 3:25 PM

వాడిన కారు.. మహా జోరు! - Sakshi

వాడిన కారు.. మహా జోరు!

- పెరుగుతున్న సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్
- ప్రీ ఓన్డ్ డీలర్లుగా మారుతున్న కార్ల కంపెనీలు
- రెండేళ్లలోపే కార్లు మార్చేస్తున్న యువత
- ఏటా కొత్త కార్లతో సమానంగా అమ్మకాలు

దేశీ కార్ల మార్కెట్లో వేగంగా మారుతున్న ట్రెండ్ ఇది. తొలిసారి కారు కొనే యువతలో మొదట సెకండ్ హ్యాండ్ కారును కొనడానికే మొగు ్గచూపుతున్న వారి సంఖ్య చాలా వేగంగా పెరుగుతోంది. జేడీ పవర్ నివేదిక ప్రకారం మొదటిసారి కారు కొనేవారిలో సెకండ్ హ్యాండ్ కారు కొనేవారి సంఖ్య 2011లో 4 శాతంగా ఉంటే ఇప్పుడది 17 శాతానికి చేరింది. అంతేకాదు! రెండు మూడేళ్ళకు కార్లను మార్చేస్తున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది.

గడిచిన ఏడాది కాలంగా కొత్త కార్ల అమ్మకాలు కొంత తగ్గుతున్నా... సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాలు గణనీయంగా పెరుగుతుండటమే దీనికి నిదర్శనం. ఒక అంచనా ప్రకారం గతేడాది దేశంలో 25 లక్షల కొత్త కార్ల అమ్మకాలు జరిగితే అదే స్థాయిలో పాత కార్లు కూడా చేతులు మారాయట. ఇలా సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్ వేగంగా విస్తరిస్తుండటంతో పెద్ద పెద్ద కార్ల తయారీ కంపెనీలన్నీ పాత కార్ల వ్యాపారంలోకి కూడా అడుగుపెడుతున్నాయి. ఇక స్థానికంగా కూడా సెకండ్ హ్యాండ్ కార్లను విక్రయించే డీలర్ల సంఖ్య బాగా పెరుగుతోంది. కార్ల కంపెనీలు దీనికోసం పలు షోరూమ్‌లను ప్రత్యేకంగా తెరుస్తుండగా... పలుచోట్ల కొత్త కార్లు అమ్ముతున్న డీలర్లు పాత కార్లను కూడా సొంతంగా విక్రయిస్తుండటం గమనార్హం.

ఆన్‌లైన్లో ఎన్నెన్నో...
ఆన్‌లైన్‌లో సెకండ్ హ్యాండ్ వస్తువుల విక్రయానికి చిరునామాలుగా మారిన క్వికర్, ఓఎల్‌ఎక్స్‌లతో పాటు పలు వెబ్‌సైట్లు కూడా సెకండ్ హ్యాండ్ కార్ల అగ్రిగేటింగ్ సేవల్ని అందిస్తున్నాయి. అమ్మేవారిని, కొనేవారిని కలపటమే వీటి పని. పెపైచ్చు వీటిలో పలు కార్లను ఎంపిక చేసుకుని వాటిని పోల్చుకోవటంతో పాటు ఫైనాన్స్ ఆప్షన్లు కూడా లభిస్తున్నాయి. బ్యాంకులు సైతం వాడేసిన కార్ల మార్కెట్ ప్రాధాన్యాన్ని గుర్తించి దాదాపు 80 నుంచి 90 శాతం వరకూ ఫైనాన్స్ ఇస్తుండటంతో ఈ కార్ల విక్రయాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. కొనేటపుడు ఏం చూడాలి?

సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్ అత్యధికంగా అసంఘటిత రంగంలోనే ఉంది. అంటే ఎక్కడికక్కడ డీలర్లు సొంత గ్యారేజ్‌లు పెట్టుకుని, వాటిద్వారా క్రయవిక్రయాలు చేస్తుండటమే అధికంగా ఉంది. మెల్లమెల్లగా ఈ రంగంలోకి వస్తున్న కార్ల తయారీ కంపెనీలు, ఆన్‌లైన్ సంస్థల సంఖ్య కూడా పెరుగుతూనే వస్తోంది. అయితే కారు కొనటానికి వీటిలో ఏదో ఒకదాన్ని ఎంచుకుంటాం కనక... తగిన బడ్జెట్లో ఉండే కారును ఎంచుకున్నాక... ఆ కారు వివరాలు, ఫొటోగ్రాఫ్స్‌తో అమ్మేవాళ్లు ఇచ్చిన రివ్యూలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మిగిలిన వాటితో పోలిస్తే ఇలా డీలర్లు, వ్యవస్థీకృత సంస్థల ద్వారా కార్లను ఎంచుకోవటమనేది పారదర్శకంగా ఉంటుంది. ఆ వాహనం మంచిదేనా? ఓనర్ నిజమైన వ్యక్తేనా? ఇలాంటివన్నీ డీలర్లు చూసుకుంటారు కనక ఇబ్బంది ఉండదు.

టెస్ట్ డ్రైవ్ చేయాల్సిందే...
ఒక కారును ఎంచుకున్నాక ఆ కారు మోడల్, రానున్న కాలంలో ఆ మోడల్ విలువ తగ్గే అవకాశం ఉందా? మైలేజ్ ఎంత ఇస్తోంది? వంటి అంశాలన్నీ పరిశీలించాలి. కేవలం ఆన్‌లైన్‌లో చూడటం కాకుండా టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలి. ఆ కారు ఇప్పటి దాకా ఎన్ని కిలోమీటర్లు తిరిగింది? ఎన్ని సంవత్సరాలయింది? వంటి విషయాలు కూడా ముఖ్యమైనవే. కారు రిజిస్ట్రేషన్, కారుపై ఏమైనా రుణం ఉందా? ఉంటే దాన్ని తీర్చేశారా, హైపొతికేషన్ ఎవరు పేరిట ఉంది? చెల్లించిన పన్నుల కాగితాలున్నాయా? వంటివన్నీ చూడాలి. కారు టెస్ట్ డ్రైవింగ్ చేసేటప్పుడు సాధ్యమైనంత వరకు కారు మెకానిక్ మీ పక్కన ఉండేలా చూసుకోండి. దీనివల్ల గేర్లు, క్లచ్, బ్రేక్ యాక్సిలేటర్, స్టీరింగ్, టైర్లు, హెడ్‌ల్యాంప్స్, విండోస్, హారన్లు, వైపర్లు ఇలా అన్నీ సరిగా పనిచేస్తున్నాయా లేదా అన్న విషయాన్ని మెకానిక్ పసిగట్ట గలడు.

లోన్ కావాలా?
మీరు ఎంపిక చేసుకున్న కారు కాగితాలన్నీ సక్రమంగా ఉండి, కారు కండీషన్ సరిగా ఉంటే రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు ముందుకొస్తున్నాయి. సాధారణంగా కారు ధరలో 80 శాతం వరకు రుణం లభిస్తుంది. గరిష్టంగా 5 ఏళ్ల వరకు రుణాన్ని ఇస్తాయి. ఫ్లోటింగ్, ఫిక్స్‌డ్ రేట్లలో ఒకదాన్ని ఎంపిక చేసుకోవచ్చు. ప్రాసెసింగ్ ఫీజు, ప్రీ-పేమెంట్ చార్జీలు వంటి విషయాలన్నీ కొత్త కార్లను తీసుకునేటప్పుడు పాటించే వాటినే పాటిస్తున్నాయి.
 
సునీల్‌కి మొదటి నుంచీ కార్లంటే మహాపిచ్చి. పెద్ద ఉద్యోగం సంపాదించుకొని లగ్జరీ కార్లలో తిరగాలన్నది కోరిక. దానికి తగ్గట్టుగానే మంచి మల్టీ నేషనల్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. నెలకు లక్షల్లో జీతం. ఇక తన కార్ల కలను నెరవేర్చుకోవాలనుకున్నాడు. ‘లగ్జరీ కార్ల రేటు తక్కువేమీ ఉండదు!! మరి ఒక కారు కొంటే దాంతోనే సరిపెట్టుకోవాలి. ఎలా? ఒకవేళ ఏ ఆరు నెలలకో, ఏడాదికో మార్చాలంటే కష్టం కదా! అందుకే బాగా ఆలోచించి ఓ నిర్ణయం తీసుకున్నాడు. సెకండ్ హ్యాండ్ కార్లమ్మే డీలర్ దగ్గరకు వెళ్లాడు. మంచి బీఎండబ్ల్యూ కారు ఎంచుకున్నాడు. కొత్త కారుతో పోలిస్తే సగం ధరకే వస్తోంది.

పెపైచ్చు ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఉంది. ఇంకేమీ ఆలోచించకుండా తీసుకున్నాడు. ఆరు నెలలు గడిచేసరికి కారు మార్చాలనిపించింది. అదే డీలర్ దగ్గరకు వెళ్లి మరో కారు ఎంచుకున్నాడు. తన కారు అమ్మితే ఎంత వస్తుందో అడిగాడు. డీలర్ చెప్పిన ధర విని... కొత్త కారుకు, పాత కారుకు మధ్య తేడా ధరను చెల్లించి కొత్త కారు తీసుకొచ్చేశాడు. అలా... సునీల్ కార్లు మారుస్తూనే ఉన్నాడు. గడిచిన నాలుగేళ్లలో తను మొత్తం నష్టపోయింది ఒక కొత్త కారు ధరలో 60 శాతమంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఒకవేళ సునీల్ కొత్త కారు కొని ఉన్నా... ఈ నాలుగేళ్లలో దాని ధర 60 శాతం ఈజీగా తగ్గిపోతుంది. దానికి బదులు తను ఇప్పటికే ఐదారు కార్లు వాడాడు. అదీ సునీల్ లెక్క. అందుకే ఇపుడు ఆ డీలర్ దగ్గరకు కొత్త లగ్జరీ కారు వచ్చిందంటే మొదట ఫోన్ చేసేది సునీల్‌కే.
 
మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన గోపాల్‌కి సొంత కారు కొనుక్కోవాలన్నది కోరిక. బ్యాంకులో ఉద్యోగం రావడంతో కారు కొనే ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అయితే డ్రైవింగ్‌లో పూర్తిస్థాయి అనుభవం లేకపోవటంతో ముందు సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కుని... ఆ తర్వాత కొత్త కారుకు మారదామనుకున్నాడు. ఆలస్యం చేయకుండా మారుతీ ట్రూ వాల్యూకి వెళ్ళి ఆల్టో సెకండ్ హ్యాండ్ కారు కొన్నాడు. ఏడాది గడిచిన తరవాత పాత కారు ఇచ్చేసి కొత్త వేగనార్ కొనుకున్నాడు. ఈ మొత్తం మీద తను నష్టపోయింది కేవలం రూ.40వేలు. కానీ ఆ 40వేలకు తను ఏడాదిపాటు కారును వాడుకున్నాడన్న సంగతి గుర్తుంచుకోవాలి.
 
సెకండ్ హ్యాండ్ కారే ఎందుకంటే?
పది లక్షలు పెట్టి కొత్త కారు కొంటే షోరూం దాటి బయటకు వచ్చిన వెంటనే దాని విలువ సుమారు లక్ష    రూపాయలు తగ్గిపోతుంది. అదే రూ. 5 లక్షల లోపు కారైతే రూ. 50,000 వరకు తగ్గిపోతుంది. ఆ పైన కారు తిరుగుతున్న కొద్దీ విలువ వేగంగా తగ్గిపోతుంటుంది. అదే సెకండ్ హ్యాండ్ కారు విషయానికొస్తే తక్కువ ధరలో రావడమే కాకుండా కారు ధర వెంటనే తగ్గిపోదు. రెండేళ్ళలో కారు ధర సగటున 15 నుంచి 20 శాతం మాత్రమే తగ్గుతుందట. అంతేకాదు! మిగిలిన కార్లతో పోలిస్తే సిల్వర్, వైట్ కలర్ కార్లకు రీ-సేల్ వాల్యూ అధికంగా ఉంటుంది. ఇప్పుడు డీలర్లు సెకండ్ హ్యాండ్ కార్లకు కూడా వారంటీ, ఉచిత సర్వీసులు అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement