Car market
-
దేశీ మార్కెట్లో మరింత వృద్ధిపై లంబోర్గిని దృష్టి
న్యూఢిల్లీ: భారత మార్కెట్లో వ్యాపార వృద్ధిపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు సూపర్‌స్పోర్ట్స్ కార్ల తయారీ దిగ్గజం లంబోర్గిని చైర్మన్ స్టెఫాన్ వింకెల్మాన్ తెలిపారు. ముందుగా హైబ్రిడ్ వాహనాలు.. ఆ తర్వాత పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ వాహనాలు ఇందుకు దోహదపడగలవని ఆయన చెప్పారు. భౌగోళికరాజకీయ పరిస్థితులతో అంతర్జాతీయంగా సరఫరా వ్యవస్థల్లో పెను మార్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో తమకు అవసరమయ్యే విడిభాగాలు మొదలైన వాటిని ఇతరత్రా మరిన్ని దేశాల నుంచి కొనుగోలు చేస్తున్నామని వింకెల్మాన్ చెప్పారు. దీనితో భారతీయ విడిభాగాల సరఫరా సంస్థలకు కూడా వ్యాపార అవకాశాలు లభించగలవని ఆయన తెలిపారు. భారత్‌లో భారీగా పన్నులు, మౌలికసదుపాయాలపరమైన సవాళ్లు ఉన్నప్పటికీ.. వృద్ధికి కూడా అవకాశాలు బాగానే ఉన్నాయని వింకెల్మన్ చెప్పారు. అయితే, వృద్ధి ఎంత స్థాయిలో ఉండొచ్చనేది చెప్పలేనని పేర్కొన్నారు. హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టబోతున్నట్లు 2021లో కంపెనీ ప్రకటించింది. దీని ప్రకారం 2023లో తొలి హైబ్రిడ్ మోడల్‌ను (విద్యుత్, ఇంధనంతో నడిచేది) ప్రవేశపెట్టనుంది. 2024 ఆఖరు నాటికి ప్రస్తుతం తమకున్న మోడల్స్ శ్రేణి మొత్తాన్ని ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చనుంది. లంబోర్గిని గత ఏడా ది భారత్‌లో 92 వాహనాలు విక్రయించింది. అంతక్రితం ఏడాది 2021లో నమోదైన 69 యూనిట్లతో పోలిస్తే ఇది 33 శాతం అధికం. -
పెట్రోల్ కార్లదే హవా
సాక్షి, అమరావతి: దేశంలో కార్ల కొనుగోలుదారుల అభిరుచుల్లో ఆసక్తికరమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రధానంగా ఐదేళ్లలో కార్ల మార్కెట్‌పై దీని ప్రభావం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. దేశంలో కార్ల మార్కెట్‌ను పెట్రోల్ వెర్షన్ కార్లు శాసిస్తున్నాయనే చెప్పొచ్చు. మార్కెట్లో 70 శాతం అమ్మకాలతో పెట్రోల్ వెర్షన్ కార్లు అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. డీజిల్ కార్లపై వినియోగదారుల ఆసక్తి క్రమంగా తగ్గుతోంది. దీంతో వీటి అమ్మకాలు 18.50 శాతానికే పరిమితమయ్యాయి. విద్యుత్ కార్ల అమ్మకాలు అనూహ్యంగా పుంజుకుంటున్నాయి. మొత్తం కార్ల అమ్మకాల్లో ఎస్యూవీ మోడల్ వాహనాల వాటా 42 శాతంగా ఉంది. 2018–19 నుంచి 2022–23లో దేశంలో కార్ల అమ్మకాల నివేదికను ప్రముఖ మార్కెటింగ్ రీసెర్చ్ సంస్థ ‘జేటో డైనమిక్స్’ వెల్లడించింది. నివేదిక ఏం చెబుతోందంటే.. ఐదేళ్లలో దేశంలో పెట్రోల్ కార్ల అమ్మకాలు 10 శాతం పెరిగాయి. 2018–19లో దేశీయ కార్ల మార్కెట్లో పెట్రోల్ వెర్షన్ కార్ల అమ్మకాలు 60 శాతంగా ఉండేవి. ఇవి 2022–23లో 70 శాతం మార్కెట్‌ను సాధించాయి. కాలుష్య నియంత్రణ కోసం ప్రభుత్వం తీసుకున్న మార్గదర్శకాలు కూడా పెట్రోల్ వాహనాల అమ్మకాలు పెరగడానికి కారణమయ్యాయి. డీజిల్ వాహనాలను 10 ఏళ్లకు తుక్కుగా మార్చాలని కేంద్రం నిర్ణయించింది. అదే పెట్రోల్ వాహనాలకు 15 ఏళ్ల వరకూ అవకాశం కల్పించింది. దాంతో డీజిల్ వాహనాల కంటే పెట్రోల్ వాహనాల కొనుగోలుకు వినియోగదారులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఐదేళ్ల క్రితం పెట్రోల్, డీజిల్ ధరల మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉండేది. కానీ డీజిల్ ధరలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. ప్రస్తుతం రెండింటి ధరల మధ్య ప్రస్తుతం పెద్ద వ్యత్యాసం లేదు. కొత్త మోడల్స్ లాంచింగ్‌లోనూ.. కార్ల కొనుగోలుదారుల ఆసక్తి కొత్త మోడళ్ల లాంచింగ్‌ను ప్రభావితం చేస్తోంది. కార్ల తయారీ కంపెనీలు కూడా మార్కెట్లోకి కొత్తగా పెట్రోల్, విద్యుత్ వాహనాలను ప్రవేశపెట్టేందుకే ఆసక్తి చూపిస్తున్నాయి. 2022–23 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో భారత్ మార్కెట్లోకి 28 కొత్త మోడల్ కార్లను ప్రవేశపెట్టారు. వాటిలో పెట్రోల్ వెర్షన్ కార్లు 13 ఉండగా.. విద్యుత్ కార్లు 8 ఉన్నాయి. డీజిల్ వెర్షన్ కార్లు ఆరు, సీఎన్జీ వెర్షన్ కారు ఒక మోడల్ భారత్ మార్కెట్లోకి ప్రవేశించాయి. సగానికి తగ్గిన డీజిల్ కార్ల అమ్మకాలు ఐదేళ్లలో దేశంలో డీజిల్ కార్ల అమ్మకాలు దాదాపు సగానికి తగ్గిపోయాయి. పర్యావరణ నియంత్రణ చర్యలు, డీజిల్ ధరలు అమాంతంగా పెరుగుతుండటమే దీనికి కారణం. ఎస్యూవీ వాహనాల్లోనే డీజిల్ వెర్షన్‌కు డిమాండ్ ఉంది. సాధారణ కార్ల అమ్మకాల్లో డీజిల్ వాహనాలకు డిమాండ్ తగ్గుతూ వస్తోంది. 2018–19లో దేశంలో డీజిల్ వెర్షన్ కార్ల వాటా 36 శాతం ఉండేది. కాగా 2022–23లో అది 18.50 శాతానికి తగ్గిపోయింది. 2018–19తో పోలిస్తే 2022–23నాటికి దేశంలో కార్ల కొనుగోలుదారుల అభిరుచుల్లో గణనీయమైన మార్పులు వచ్చాయి. -
ప్యుగోట్ చేతికి అంబాసిడర్ బ్రాండ్
కోల్‌కతా: దేశీయంగా కార్ల విపణిలో ఓ వెలుగు వెలిగిన అంబాసిడర్ బ్రాండ్.. తాజాగా ఫ్రాన్స్ కి చెందిన ఆటోమొబైల్ దిగ్గజం ప్యుగోట్ చేతికి చేరింది. దాదాపు రూ. 80 కోట్లకు దీన్ని విక్రయించేందుకు సీకే బిర్లా గ్రూప్ సారథ్యంలోని హిందుస్తాన్ మోటార్స్ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, తమకు చెల్లించాల్సిన బకాయిల వివాదం ఇంకా పరిష్కారం కాకుండానే.. యాజమాన్యం అంబాసిడర్ బ్రాండ్ విక్రయించడం సరికాదని కంపెనీ కార్మిక నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. 1957లో అంబాసిడర్ కార్ల తయారీ ప్రారంభం కాగా... కాలక్రమంలో ప్రాభవం కోల్పోయిన నేపథ్యంలో 2014 మేలో హిందుస్తాన్ మోటార్స్ వీటి తయారీ నిలిపివేసింది. అంబాసిడర్ బ్రాండ్‌ను వినియోగించుకుని దేశీయంగా కార్ల ఉత్పత్తి పెంచుకోవాలని ప్యుగోట్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇరు కంపెనీలు స్పష్టత ఇవ్వలేదు. పరిశ్రమ వర్గాల అంచనాల ప్రకారం త్వరలోనే ప్యుగోట్ దేశీయంగా ఏడాదికి లక్ష కార్లను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే ఈ డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. -
చైనా కార్ల కంపెనీల ‘మేక్ ఇన్ ఇండియా’!
• భారత్‌లో ప్లాంట్ల ఏర్పాటుకు రెడీ • ‘క్యూ’లో ఎస్ఏఐసీ, చాంగన్ • ఆటోమొబైల్స్ గ్రేట్ వాల్ మోటార్ బీజింగ్: భారత కార్ల మార్కెట్... ఇప్పుడు చైనా కంపెనీలను కుదురుగా ఉండనీయడం లేదు. అమెరికా, జపాన్, చైనా మార్కెట్లలో అమ్మకాలు నీరసించిన పరిస్థితుల్లోనూ... గతేడాది భారత కార్ల మార్కెట్లో అమ్మకాలు సుమారు 8 శాతం వృద్ధి నమోదు చేశాయి. దీంతో ఇక్కడి మార్కెట్ అవకాశాలు చైనా కార్ల ఆటోమొబైల్ కంపెనీలను తెగ ఊరించేస్తున్నాయి. దీంతో ప్లాంట్ల ఏర్పాటుకు ‘డ్రాగన్’ కంపెనీలు ప్రణాళికలు వేసుకుంటున్నాయి. పరుగులు తీస్తున్న దేశీయ కార్ల మార్కెట్లో వృద్ధి అవకాశాలను సొంతం చేసుకునేందుకు చైనా కార్ల తయారీదారులు ఆసక్తిగా ఉన్నారు. చాంగన్ ఆటోమొబైల్స్ భారత్‌లో కార్ల ప్లాంటు ఏర్పాటు అవకాశాలను పరిశీలిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో ఏదో ఒక చోట ప్లాంట్ స్థాపనకు ఉన్న అవకాశాలపై ఆరా తీస్తోంది. అలాగే, ఎస్ఏఐసీ మోటార్ సైతం ఇక్కడి మార్కెట్లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటోంది. కొత్త తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. గుజరాత్‌లోని హలోల్‌లో జనరల్ మోటార్స్ ప్లాంట్ కొనుగోలు ప్రయత్నాల నుంచి తప్పుకున్న ఈ సంస్థ... తాజాగా తయారీ కేంద్రం ఏర్పాటును పరిశీలిస్తోంది. ఎస్ఏఐసీతో కలసి కొత్త శ్రేణి షెవెర్లే వాహనాలు తయారీకి గాను 5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు జీఎం మోటార్స్ ఏడాది క్రితం ప్రకటించిన విషయం గమనార్హం. తద్వారా భారత్‌తోపాటు బ్రెజిల్, మెక్సికోల్లో అవకాశాలను సొంతం చేసుకోవాలన్నది ఈ కంపెనీల ఆశ. గ్రేట్‌వాల్ మోటార్ కంపెనీ సైతం దేశీ వాహన మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్టు సమాచారం. ఆసక్తికి కారణాలేంటి..? ప్రపంచంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్ చైనా కాగా, అక్కడి కంపెనీలు ఇక్కడ తయారీ కేంద్రాల స్థాపనకు ఆసక్తి చూపడానికి పలు కారణాలు కనిపిస్తున్నాయి. ఇన్నాళ్లూ ఒక ఊపు ఊపిన చైనా కార్ల మార్కెట్లో అమ్మకాల వృద్ధి తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుత ఏడాది అక్కడ 5 శాతం అమ్మకాల వృద్ధి ఉంటుందని అంచనా వేస్తున్నారు. 2.5కోట్ల అమ్మకాలు జరుగుతాయని ఆశిస్తున్నారు. అయితే, పరిమిత అవకాశాల పరిధిలోనే ఉండిపోకుండా విదేశీ మార్కెట్లలోకి దూసుకుపోవడం ద్వారా అమ్మకాలు పెంచుకోవాలని చైనా కార్ల తయారీదారులు భావిస్తున్నారు. అలాగే, తమ బ్రాండ్లను మరిన్ని దేశాల్లో విస్తరించాలన్న కాంక్ష కూడా భారత మార్కెట్ అవకాశాల పరిశీలనకు ఓ కారణంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఈ దశాబ్దం చివరికి ప్రపంచంలో భారత్ మూడో అతిపెద్ద కార్ల తయారీ మార్కెట్‌గా అవతరించనుండడమే. ఇక్కడ పాదం మోపడం ద్వారా ఇండో నేసియా, మలేసియా, థాయ్‌లాండ్, తైవాన్ మార్కెట్ అవకాశాలను సైతం అందుకుకోవాలన్న ఆకాంక్ష వాటిని క్యూ కట్టిస్తోంది. ఇదే మొదటి సారి కాదు... భారతీయ ఆటోమొబైల్ మార్కెట్ పట్ల చైనా కంపెనీల ఆసక్తి కొత్తేమీ కాదు. కార్లు, పికప్ వాహనాల తయారీకి వీలుగా ఎస్ఏఐసీ 2009లో జీఎం మోటార్స్‌తో 50:50 జాయింట్ వెంచర్ కంపెనీ ఏర్పాటుకు ఒప్పందం చేసుకుంది. కానీ, ఆ తర్వాత ఎస్ఏఐసీ వాటాల్లో అధిక శాతం జీఎం మోటార్స్ కొనుగోలు చేయడమే కాకుండా లైట్ కమర్షియల్ వాహనాల తయారీ ఆలోచనలను పక్కన పెట్టింది. ఆ తర్వాత బెకీ ఫోటాన్ మోటార్స్ పుణె సమీపంలోని చకాన్‌లో ట్రక్కులు, బస్సుల తయారీకి వీలుగా ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. తర్వాత ఈ దిశగా ముందడుగు పడలేదు. ఆశలు నెరవేరతాయా..? నాణ్యత, తక్కువ ధర. ఉత్తమ సేవలు... దేశీయ వినియోగదారులు ఎక్కువగా చూసేవి ఇవే. ఇక్కడి వినియోగదారుల అభిరుచులపై సరైన అవగాహన పెంచుకున్న సుజుకి, హ్యుందాయ్, హోండా, టయోటా, మహీంద్రా, టాటా మోటార్స్ కంపెనీలు వినూత్న ఉత్పత్తులతో మార్కెట్లో పటిష్టమైన స్థానం సంపాదించుకున్నాయి. ఈ దశలో ఇక్కడి మార్కెట్ అవకాశాలను సొంతం చేసుకోవాలంటే చైనా తయారీ దారులు తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. మంచి ఫీచర్లతో సరసమైన ధరలకు నాణ్యమైన ఉత్పత్తులను అందించాల్సి ఉంటుంది. పైగా చైనా ఉత్పత్తుల పట్ల ఇక్కడి ప్రజల్లో ఉన్న చిన్న చూపును అధిగమించడంపైనే వాటి విజయం ఆధారపడి ఉంది. ఏదేమైనప్పటికీ చైనా కార్ల కంపెనీల రాకతో ఇక్కడి కార్లమార్కెట్లో పోటీ మరింత వేడెక్కనుంది. దీంతో అంతిమంగా వినియోగదారులకు మరిన్ని కొనుగోలు అవకాశాలు అందివస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. భారత్‌లో కార్ల తయారీ కంపెనీలు 18 2015 నాటికి మారుతీ వాటా 47%; హ్యుందాయ్ 17.3 శాతం. చైనాలో టాప్ తయారీ కంపెనీలు.. ⇔ ఎస్ఏఐసీ... ⇔ డాంగ్‌ఫెంగ్ మోటార్ కంపెనీ ⇔ ఫా గ్రూపు కంపెనీ ⇔ చాంగ్కింగ్ చాంగాన్ ఆటోమొబైల్ కంపెనీ ⇔ బీఏఐసీ మోటార్ ⇔ గాంగ్జు ఆటోమొబైల్ గ్రూపు కంపెనీ ⇔ గ్రేట్‌వాల్ మోటార్ కంపెనీ -
వాడిన కారు.. మహా జోరు!
- పెరుగుతున్న సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్ - ప్రీ ఓన్డ్ డీలర్లుగా మారుతున్న కార్ల కంపెనీలు - రెండేళ్లలోపే కార్లు మార్చేస్తున్న యువత - ఏటా కొత్త కార్లతో సమానంగా అమ్మకాలు దేశీ కార్ల మార్కెట్లో వేగంగా మారుతున్న ట్రెండ్ ఇది. తొలిసారి కారు కొనే యువతలో మొదట సెకండ్ హ్యాండ్ కారును కొనడానికే మొగు ్గచూపుతున్న వారి సంఖ్య చాలా వేగంగా పెరుగుతోంది. జేడీ పవర్ నివేదిక ప్రకారం మొదటిసారి కారు కొనేవారిలో సెకండ్ హ్యాండ్ కారు కొనేవారి సంఖ్య 2011లో 4 శాతంగా ఉంటే ఇప్పుడది 17 శాతానికి చేరింది. అంతేకాదు! రెండు మూడేళ్ళకు కార్లను మార్చేస్తున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. గడిచిన ఏడాది కాలంగా కొత్త కార్ల అమ్మకాలు కొంత తగ్గుతున్నా... సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాలు గణనీయంగా పెరుగుతుండటమే దీనికి నిదర్శనం. ఒక అంచనా ప్రకారం గతేడాది దేశంలో 25 లక్షల కొత్త కార్ల అమ్మకాలు జరిగితే అదే స్థాయిలో పాత కార్లు కూడా చేతులు మారాయట. ఇలా సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్ వేగంగా విస్తరిస్తుండటంతో పెద్ద పెద్ద కార్ల తయారీ కంపెనీలన్నీ పాత కార్ల వ్యాపారంలోకి కూడా అడుగుపెడుతున్నాయి. ఇక స్థానికంగా కూడా సెకండ్ హ్యాండ్ కార్లను విక్రయించే డీలర్ల సంఖ్య బాగా పెరుగుతోంది. కార్ల కంపెనీలు దీనికోసం పలు షోరూమ్‌లను ప్రత్యేకంగా తెరుస్తుండగా... పలుచోట్ల కొత్త కార్లు అమ్ముతున్న డీలర్లు పాత కార్లను కూడా సొంతంగా విక్రయిస్తుండటం గమనార్హం. ఆన్లైన్లో ఎన్నెన్నో... ఆన్లైన్లో సెకండ్ హ్యాండ్ వస్తువుల విక్రయానికి చిరునామాలుగా మారిన క్వికర్, ఓఎల్ఎక్స్లతో పాటు పలు వెబ్సైట్లు కూడా సెకండ్ హ్యాండ్ కార్ల అగ్రిగేటింగ్ సేవల్ని అందిస్తున్నాయి. అమ్మేవారిని, కొనేవారిని కలపటమే వీటి పని. పెపైచ్చు వీటిలో పలు కార్లను ఎంపిక చేసుకుని వాటిని పోల్చుకోవటంతో పాటు ఫైనాన్స్ ఆప్షన్లు కూడా లభిస్తున్నాయి. బ్యాంకులు సైతం వాడేసిన కార్ల మార్కెట్ ప్రాధాన్యాన్ని గుర్తించి దాదాపు 80 నుంచి 90 శాతం వరకూ ఫైనాన్స్ ఇస్తుండటంతో ఈ కార్ల విక్రయాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. కొనేటపుడు ఏం చూడాలి? సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్ అత్యధికంగా అసంఘటిత రంగంలోనే ఉంది. అంటే ఎక్కడికక్కడ డీలర్లు సొంత గ్యారేజ్‌లు పెట్టుకుని, వాటిద్వారా క్రయవిక్రయాలు చేస్తుండటమే అధికంగా ఉంది. మెల్లమెల్లగా ఈ రంగంలోకి వస్తున్న కార్ల తయారీ కంపెనీలు, ఆన్లైన్ సంస్థల సంఖ్య కూడా పెరుగుతూనే వస్తోంది. అయితే కారు కొనటానికి వీటిలో ఏదో ఒకదాన్ని ఎంచుకుంటాం కనక... తగిన బడ్జెట్లో ఉండే కారును ఎంచుకున్నాక... ఆ కారు వివరాలు, ఫొటోగ్రాఫ్స్‌తో అమ్మేవాళ్లు ఇచ్చిన రివ్యూలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మిగిలిన వాటితో పోలిస్తే ఇలా డీలర్లు, వ్యవస్థీకృత సంస్థల ద్వారా కార్లను ఎంచుకోవటమనేది పారదర్శకంగా ఉంటుంది. ఆ వాహనం మంచిదేనా? ఓనర్ నిజమైన వ్యక్తేనా? ఇలాంటివన్నీ డీలర్లు చూసుకుంటారు కనక ఇబ్బంది ఉండదు. టెస్ట్ డ్రైవ్ చేయాల్సిందే... ఒక కారును ఎంచుకున్నాక ఆ కారు మోడల్, రానున్న కాలంలో ఆ మోడల్ విలువ తగ్గే అవకాశం ఉందా? మైలేజ్ ఎంత ఇస్తోంది? వంటి అంశాలన్నీ పరిశీలించాలి. కేవలం ఆన్లైన్లో చూడటం కాకుండా టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలి. ఆ కారు ఇప్పటి దాకా ఎన్ని కిలోమీటర్లు తిరిగింది? ఎన్ని సంవత్సరాలయింది? వంటి విషయాలు కూడా ముఖ్యమైనవే. కారు రిజిస్ట్రేషన్, కారుపై ఏమైనా రుణం ఉందా? ఉంటే దాన్ని తీర్చేశారా, హైపొతికేషన్ ఎవరు పేరిట ఉంది? చెల్లించిన పన్నుల కాగితాలున్నాయా? వంటివన్నీ చూడాలి. కారు టెస్ట్ డ్రైవింగ్ చేసేటప్పుడు సాధ్యమైనంత వరకు కారు మెకానిక్ మీ పక్కన ఉండేలా చూసుకోండి. దీనివల్ల గేర్లు, క్లచ్, బ్రేక్ యాక్సిలేటర్, స్టీరింగ్, టైర్లు, హెడ్‌ల్యాంప్స్, విండోస్, హారన్లు, వైపర్లు ఇలా అన్నీ సరిగా పనిచేస్తున్నాయా లేదా అన్న విషయాన్ని మెకానిక్ పసిగట్ట గలడు. లోన్ కావాలా? మీరు ఎంపిక చేసుకున్న కారు కాగితాలన్నీ సక్రమంగా ఉండి, కారు కండీషన్ సరిగా ఉంటే రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు ముందుకొస్తున్నాయి. సాధారణంగా కారు ధరలో 80 శాతం వరకు రుణం లభిస్తుంది. గరిష్టంగా 5 ఏళ్ల వరకు రుణాన్ని ఇస్తాయి. ఫ్లోటింగ్, ఫిక్స్డ్ రేట్లలో ఒకదాన్ని ఎంపిక చేసుకోవచ్చు. ప్రాసెసింగ్ ఫీజు, ప్రీ-పేమెంట్ చార్జీలు వంటి విషయాలన్నీ కొత్త కార్లను తీసుకునేటప్పుడు పాటించే వాటినే పాటిస్తున్నాయి. సునీల్‌కి మొదటి నుంచీ కార్లంటే మహాపిచ్చి. పెద్ద ఉద్యోగం సంపాదించుకొని లగ్జరీ కార్లలో తిరగాలన్నది కోరిక. దానికి తగ్గట్టుగానే మంచి మల్టీ నేషనల్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. నెలకు లక్షల్లో జీతం. ఇక తన కార్ల కలను నెరవేర్చుకోవాలనుకున్నాడు. ‘లగ్జరీ కార్ల రేటు తక్కువేమీ ఉండదు!! మరి ఒక కారు కొంటే దాంతోనే సరిపెట్టుకోవాలి. ఎలా? ఒకవేళ ఏ ఆరు నెలలకో, ఏడాదికో మార్చాలంటే కష్టం కదా! అందుకే బాగా ఆలోచించి ఓ నిర్ణయం తీసుకున్నాడు. సెకండ్ హ్యాండ్ కార్లమ్మే డీలర్ దగ్గరకు వెళ్లాడు. మంచి బీఎండబ్ల్యూ కారు ఎంచుకున్నాడు. కొత్త కారుతో పోలిస్తే సగం ధరకే వస్తోంది. పెపైచ్చు ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఉంది. ఇంకేమీ ఆలోచించకుండా తీసుకున్నాడు. ఆరు నెలలు గడిచేసరికి కారు మార్చాలనిపించింది. అదే డీలర్ దగ్గరకు వెళ్లి మరో కారు ఎంచుకున్నాడు. తన కారు అమ్మితే ఎంత వస్తుందో అడిగాడు. డీలర్ చెప్పిన ధర విని... కొత్త కారుకు, పాత కారుకు మధ్య తేడా ధరను చెల్లించి కొత్త కారు తీసుకొచ్చేశాడు. అలా... సునీల్ కార్లు మారుస్తూనే ఉన్నాడు. గడిచిన నాలుగేళ్లలో తను మొత్తం నష్టపోయింది ఒక కొత్త కారు ధరలో 60 శాతమంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఒకవేళ సునీల్ కొత్త కారు కొని ఉన్నా... ఈ నాలుగేళ్లలో దాని ధర 60 శాతం ఈజీగా తగ్గిపోతుంది. దానికి బదులు తను ఇప్పటికే ఐదారు కార్లు వాడాడు. అదీ సునీల్ లెక్క. అందుకే ఇపుడు ఆ డీలర్ దగ్గరకు కొత్త లగ్జరీ కారు వచ్చిందంటే మొదట ఫోన్ చేసేది సునీల్కే. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన గోపాల్‌కి సొంత కారు కొనుక్కోవాలన్నది కోరిక. బ్యాంకులో ఉద్యోగం రావడంతో కారు కొనే ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అయితే డ్రైవింగ్‌లో పూర్తిస్థాయి అనుభవం లేకపోవటంతో ముందు సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కుని... ఆ తర్వాత కొత్త కారుకు మారదామనుకున్నాడు. ఆలస్యం చేయకుండా మారుతీ ట్రూ వాల్యూకి వెళ్ళి ఆల్టో సెకండ్ హ్యాండ్ కారు కొన్నాడు. ఏడాది గడిచిన తరవాత పాత కారు ఇచ్చేసి కొత్త వేగనార్ కొనుకున్నాడు. ఈ మొత్తం మీద తను నష్టపోయింది కేవలం రూ.40వేలు. కానీ ఆ 40వేలకు తను ఏడాదిపాటు కారును వాడుకున్నాడన్న సంగతి గుర్తుంచుకోవాలి. సెకండ్ హ్యాండ్ కారే ఎందుకంటే? పది లక్షలు పెట్టి కొత్త కారు కొంటే షోరూం దాటి బయటకు వచ్చిన వెంటనే దాని విలువ సుమారు లక్ష రూపాయలు తగ్గిపోతుంది. అదే రూ. 5 లక్షల లోపు కారైతే రూ. 50,000 వరకు తగ్గిపోతుంది. ఆ పైన కారు తిరుగుతున్న కొద్దీ విలువ వేగంగా తగ్గిపోతుంటుంది. అదే సెకండ్ హ్యాండ్ కారు విషయానికొస్తే తక్కువ ధరలో రావడమే కాకుండా కారు ధర వెంటనే తగ్గిపోదు. రెండేళ్ళలో కారు ధర సగటున 15 నుంచి 20 శాతం మాత్రమే తగ్గుతుందట. అంతేకాదు! మిగిలిన కార్లతో పోలిస్తే సిల్వర్, వైట్ కలర్ కార్లకు రీ-సేల్ వాల్యూ అధికంగా ఉంటుంది. ఇప్పుడు డీలర్లు సెకండ్ హ్యాండ్ కార్లకు కూడా వారంటీ, ఉచిత సర్వీసులు అందిస్తున్నారు. -
హోండా 4 లక్షల లోపు కారు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా చిన్న కార్ల మార్కెట్‌పై ఆసక్తి కనబరుస్తోంది. మాస్ మార్కెట్ లక్ష్యంగా రూ.4 లక్షల లోపు ఖరీదు చేసే కారును తీసుకొచ్చే పనిలో ఉంది. ప్రస్తుతమీ కారు అభివృద్ధి దశలో ఉంది. దేశంలో అమ్ముడవుతున్న మొత్తం ప్యాసింజర్ వాహనాల్లో రూ.4 లక్షల లోపు ఖరీదు చేసే కార్ల వాటా 35-40 శాతముంటుంది. చిన్న కారు రావడానికి కొంత సమయం పడుతుందని హోండా కార్స్ ఇండియా సేల్స్, మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ షిగేరు యమజకి తెలిపారు. మల్టీపర్పస్ వెహికల్ ‘మొబీలియో’ను విడుదల చేసేందుకు సోమవారం హైదరాబాద్ వచ్చిన ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. కాగా, హోండా ఇప్పటికే ‘బ్రియో’ హ్యాచ్‌బ్యాక్‌ను విక్రయిస్తోంది. దీని ధర హైదరాబాద్ ఎక్స్ షోరూంలో రూ.4.10 లక్షల నుంచి ప్రారంభం. ఆందోళన కలిగిస్తున్నా..: మందగమనం నుంచి ఇప్పుడిప్పుడే భారత కార్ల మార్కెట్ పుంజుకుంటోందని యమజకి అన్నారు. ఈ ఏడాది మంచి వృద్ధి ఉంటుందనడానికి సంకేతాలు కనిపిస్తున్నాయని, దీర్ఘకాలంలో మార్కెట్ అద్భుతంగా ఉంటుందని చెప్పారు. ఇంధన ధరలు పెరుగుతున్నాయి. వడ్డీ రేట్లు అధికంగానే ఉన్నాయి. ఈ అంశాలు ఆందోళన కలిగి స్తున్నాయన్నారు. కాగా, ఎంపీవీ మార్కెట్లో మొబీ లియో కొత్త విభాగాన్ని సృష్టిస్తుందని కంపెనీ జనరల్ అఫైర్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రమణ్‌కుమార్ శర్మ తెలిపారు. ఇప్పటికే 10 వేలకుపైగా బుకింగ్స్ నమోదయ్యాయని చెప్పారు. మొబీలియో స్పందననుబట్టి రాజస్థాన్ ప్లాంటులో రెండో షిఫ్ట్ ప్రారంభిస్తామని వివరించారు. మొబీలియో ధర హైదరాబాద్ ఎక్స్‌షోరూంలో పెట్రోలు వర్షన్ రూ.6.8 లక్షలు, డీజిల్ వర్షన్ రూ.8.2 లక్షల నుంచి ప్రారంభం. మొత్తం 60 లక్షల కార్లు.. ప్రపంచవ్యాప్తంగా 2017 నాటికి 60 లక్షల కార్లను విక్రయించాలని హోండా కార్స్ లక్ష్యంగా చేసుకుంది. 12 లక్షల యూనిట్లు ఆసియా దేశాల నుంచి కాగా, ఇందులో 3 లక్షలు భారత్‌లో అమ్మాలని లక్ష్యం విధిం చుకుంది. లక్ష్యానికి చేరువయ్యేందుకు విదేశాల్లో అందుబాటులో ఉన్న మోడళ్లను దశలవారీగా ఇక్కడ పరిచయం చేయనుంది. కాంపాక్ట్ సెడాన్, మిడ్ సైజ్ సెడాన్, ఎంపీవీ విభాగాల్లో కంపెనీ ప్రత్యేక దృష్టి సారించనుంది. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ జాజ్ వచ్చే ఏడాది ప్రారంభంలో భారత్‌లో విడుదల కానుంది. -
అధిక మైలేజీ ఇచ్చే కారే కావాలి..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కార్ల మార్కెట్ క్లిష్ట పరిస్థితిలో ఉంది. 2012తో పోలిస్తే ఈ ఏడాది జనవరి-జూలై కాలంలో అమ్మకాలు 12 శాతం పడిపోయాయి. మరోవైపు ఇంధన ధరలు అంతకంతకూ దూసుకెళ్తున్నాయి. దీంతో కస్టమర్లు అధిక మైలేజీనిచ్చే కార్లను కోరుకుంటున్నారని హుందాయ్ మోటార్ ఇండియా మార్కెటింగ్, సేల్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (ఎస్వీపీ)రాకేశ్ శ్రీవాస్తవ తెలిపారు. మైలేజీయే ఇప్పుడు అత్యంత ప్రాధాన్యమున్న అంశమైందని చెప్పారు. రీసేల్ వాల్యూ (కారు విక్రయిస్తే వచ్చే మొత్తం) కూడా ఎక్కువగా ఉండాలన్నదే కస్టమర్ల అభిమతమని చెప్పారు. గ్రాండ్ ఐ10 కారును మంగళవారమిక్కడ ఆవిష్కరించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. గ్రాండ్ ఐ10 డీజిల్ వర్షన్ 24 కిలోమీటర్ల మైలేజీతో కాంపాక్ట్ హై ఎంట్రీ విభాగంలో నూతన ప్రమాణంగా నిలిచిందని చెప్పారు. భారతీయ మార్కెట్‌కు అనుగుణంగా ఈ మోడల్‌ను తీర్చిదిద్దడంలో హైదరాబాద్‌లోని హుందాయ్ ఆర్‌అండ్‌డీకి చెందిన 100 మంది ఇంజనీర్లు పాలుపంచుకున్నారు. భవిష్యత్‌లో రాబోయే మోడళ్లకు కూడా ఈ కేంద్రం కీలకంగా వ్యవహరించనుంది. గ్రామాల్లోనూ డిమాండ్: పట్టణాలే కాదు అటు గ్రామీణ ప్రాంతాల్లోనూ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. ఈ ప్రాంతాల్లోని వారి ఆదాయం స్థిరంగా ఉంది. చాలా మంది తమ జీవితాల్లో మార్పు కోరుకుంటున్నారని శ్రీవాస్తవ పేర్కొన్నారు. గ్రామీణ మార్కెట్ల నుంచి హుందాయ్కి గతేడాది 15% అమ్మకాలు నమోదైతే ఈ ఏడాది ఇది 18 శాతానికి ఎగబాకిందని చెప్పారు. కంపెనీకి చెందిన 370 ఔట్లెట్లకుగాను 270 ఈ ప్రాంతాల్లోనే ఉన్నాయని వివరించారు. దేశీయ మార్కెట్‌ను పరిశీలిస్తే కొత్తగా కారును కొనేవారు తగ్గారని చెప్పారు. అదనపు కారు, పాత కారు కొనేవారే ఎక్కువయ్యారని వెల్లడించారు. ఈ విభాగాలపైనే: సెడాన్, స్పోర్ట్ యుటిలిటీ వెహికిల్, మల్టీ పర్పస్ వెహికిల్ విభాగాలపై ఎక్కువ దృష్టి పెడతామని హుందాయ్ మోటార్ ఇండియా తెలిపింది. భారతీయ కార్ల విపణిలో గతేడాది హుందాయ్ వాటా 18.5 శాతమని, ఈ ఏడాది జనవరి-జూలైలో ఇది 20.4 శాతానికి చేరిందని వివరించింది. ఆదరణ పొందుతున్న కార్లు, విస్తృతమైన డీలర్ నెట్‌వర్క్‌తో ఇది సాధ్యమైందని తెలిపింది. కంపెనీ 2012లో 6.41 లక్షల కార్లు విక్రయించింది. ఈ ఏడాది 6.45 లక్షల కార్లు విక్రయ లక్ష్యంగా పెట్టుకుంది.