అధిక మైలేజీ ఇచ్చే కారే కావాలి..
అధిక మైలేజీ ఇచ్చే కారే కావాలి..
Published Wed, Sep 11 2013 2:43 AM | Last Updated on Fri, Sep 1 2017 10:36 PM
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కార్ల మార్కెట్ క్లిష్ట పరిస్థితిలో ఉంది. 2012తో పోలిస్తే ఈ ఏడాది జనవరి-జూలై కాలంలో అమ్మకాలు 12 శాతం పడిపోయాయి. మరోవైపు ఇంధన ధరలు అంతకంతకూ దూసుకెళ్తున్నాయి. దీంతో కస్టమర్లు అధిక మైలేజీనిచ్చే కార్లను కోరుకుంటున్నారని హుందాయ్ మోటార్ ఇండియా మార్కెటింగ్, సేల్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (ఎస్‌వీపీ)రాకేశ్ శ్రీవాస్తవ తెలిపారు. మైలేజీయే ఇప్పుడు అత్యంత ప్రాధాన్యమున్న అంశమైందని చెప్పారు. రీసేల్ వాల్యూ (కారు విక్రయిస్తే వచ్చే మొత్తం) కూడా ఎక్కువగా ఉండాలన్నదే కస్టమర్ల అభిమతమని చెప్పారు. గ్రాండ్ ఐ10 కారును మంగళవారమిక్కడ ఆవిష్కరించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.
గ్రాండ్ ఐ10 డీజిల్ వర్షన్ 24 కిలోమీటర్ల మైలేజీతో కాంపాక్ట్ హై ఎంట్రీ విభాగంలో నూతన ప్రమాణంగా నిలిచిందని చెప్పారు. భారతీయ మార్కెట్‌కు అనుగుణంగా ఈ మోడల్‌ను తీర్చిదిద్దడంలో హైదరాబాద్‌లోని హుందాయ్ ఆర్‌అండ్‌డీకి చెందిన 100 మంది ఇంజనీర్లు పాలుపంచుకున్నారు. భవిష్యత్‌లో రాబోయే మోడళ్లకు కూడా ఈ కేంద్రం కీలకంగా వ్యవహరించనుంది.
గ్రామాల్లోనూ డిమాండ్: పట్టణాలే కాదు అటు గ్రామీణ ప్రాంతాల్లోనూ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. ఈ ప్రాంతాల్లోని వారి ఆదాయం స్థిరంగా ఉంది. చాలా మంది తమ జీవితాల్లో మార్పు కోరుకుంటున్నారని శ్రీవాస్తవ పేర్కొన్నారు. గ్రామీణ మార్కెట్ల నుంచి హుందాయ్‌కి గతేడాది 15% అమ్మకాలు నమోదైతే ఈ ఏడాది ఇది 18 శాతానికి ఎగబాకిందని చెప్పారు. కంపెనీకి చెందిన 370 ఔట్‌లెట్లకుగాను 270 ఈ ప్రాంతాల్లోనే ఉన్నాయని వివరించారు. దేశీయ మార్కెట్‌ను పరిశీలిస్తే కొత్తగా కారును కొనేవారు తగ్గారని చెప్పారు. అదనపు కారు, పాత కారు కొనేవారే ఎక్కువయ్యారని వెల్లడించారు.
ఈ విభాగాలపైనే: సెడాన్, స్పోర్ట్ యుటిలిటీ వెహికిల్, మల్టీ పర్పస్ వెహికిల్ విభాగాలపై ఎక్కువ దృష్టి పెడతామని హుందాయ్ మోటార్ ఇండియా తెలిపింది. భారతీయ కార్ల విపణిలో గతేడాది హుందాయ్ వాటా 18.5 శాతమని, ఈ ఏడాది జనవరి-జూలైలో ఇది 20.4 శాతానికి చేరిందని వివరించింది. ఆదరణ పొందుతున్న కార్లు, విస్తృతమైన డీలర్ నెట్‌వర్క్‌తో ఇది సాధ్యమైందని తెలిపింది. కంపెనీ 2012లో 6.41 లక్షల కార్లు విక్రయించింది. ఈ ఏడాది 6.45 లక్షల కార్లు విక్రయ లక్ష్యంగా పెట్టుకుంది.
Advertisement
Advertisement