చైనా కార్ల కంపెనీల ‘మేక్ ఇన్ ఇండియా’!
• భారత్‌లో ప్లాంట్ల ఏర్పాటుకు రెడీ
• ‘క్యూ’లో ఎస్‌ఏఐసీ, చాంగన్
• ఆటోమొబైల్స్ గ్రేట్ వాల్ మోటార్
బీజింగ్: భారత కార్ల మార్కెట్... ఇప్పుడు చైనా కంపెనీలను కుదురుగా ఉండనీయడం లేదు. అమెరికా, జపాన్, చైనా మార్కెట్లలో అమ్మకాలు నీరసించిన పరిస్థితుల్లోనూ... గతేడాది భారత కార్ల మార్కెట్లో అమ్మకాలు సుమారు 8 శాతం వృద్ధి నమోదు చేశాయి. దీంతో ఇక్కడి మార్కెట్ అవకాశాలు చైనా కార్ల ఆటోమొబైల్ కంపెనీలను తెగ ఊరించేస్తున్నాయి. దీంతో ప్లాంట్ల ఏర్పాటుకు ‘డ్రాగన్’ కంపెనీలు ప్రణాళికలు వేసుకుంటున్నాయి.
పరుగులు తీస్తున్న దేశీయ కార్ల మార్కెట్‌లో వృద్ధి అవకాశాలను సొంతం చేసుకునేందుకు చైనా కార్ల తయారీదారులు ఆసక్తిగా ఉన్నారు. చాంగన్ ఆటోమొబైల్స్ భారత్‌లో కార్ల ప్లాంటు ఏర్పాటు అవకాశాలను పరిశీలిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో ఏదో ఒక చోట ప్లాంట్ స్థాపనకు ఉన్న అవకాశాలపై ఆరా తీస్తోంది. అలాగే, ఎస్‌ఏఐసీ మోటార్ సైతం ఇక్కడి మార్కెట్లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటోంది. కొత్త తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. గుజరాత్‌లోని హలోల్‌లో జనరల్ మోటార్స్ ప్లాంట్ కొనుగోలు ప్రయత్నాల నుంచి తప్పుకున్న ఈ సంస్థ...
తాజాగా తయారీ కేంద్రం ఏర్పాటును పరిశీలిస్తోంది. ఎస్‌ఏఐసీతో కలసి కొత్త శ్రేణి షెవెర్లే వాహనాలు తయారీకి గాను 5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు జీఎం మోటార్స్ ఏడాది క్రితం ప్రకటించిన విషయం గమనార్హం. తద్వారా భారత్‌తోపాటు బ్రెజిల్, మెక్సికోల్లో అవకాశాలను సొంతం చేసుకోవాలన్నది ఈ కంపెనీల ఆశ. గ్రేట్‌వాల్ మోటార్ కంపెనీ సైతం దేశీ వాహన మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్టు సమాచారం.
ఆసక్తికి కారణాలేంటి..?
ప్రపంచంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్ చైనా కాగా, అక్కడి కంపెనీలు ఇక్కడ తయారీ కేంద్రాల స్థాపనకు ఆసక్తి చూపడానికి పలు కారణాలు కనిపిస్తున్నాయి. ఇన్నాళ్లూ ఒక ఊపు ఊపిన చైనా కార్ల మార్కెట్లో అమ్మకాల వృద్ధి తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుత ఏడాది అక్కడ 5 శాతం అమ్మకాల వృద్ధి ఉంటుందని అంచనా వేస్తున్నారు. 2.5కోట్ల అమ్మకాలు జరుగుతాయని ఆశిస్తున్నారు. అయితే, పరిమిత అవకాశాల పరిధిలోనే ఉండిపోకుండా విదేశీ మార్కెట్లలోకి దూసుకుపోవడం ద్వారా అమ్మకాలు పెంచుకోవాలని చైనా కార్ల తయారీదారులు భావిస్తున్నారు. అలాగే, తమ బ్రాండ్లను మరిన్ని దేశాల్లో విస్తరించాలన్న కాంక్ష కూడా భారత మార్కెట్ అవకాశాల పరిశీలనకు ఓ కారణంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఈ దశాబ్దం చివరికి ప్రపంచంలో భారత్ మూడో అతిపెద్ద కార్ల తయారీ మార్కెట్‌గా అవతరించనుండడమే. ఇక్కడ పాదం మోపడం ద్వారా ఇండో నేసియా, మలేసియా, థాయ్‌లాండ్, తైవాన్ మార్కెట్ అవకాశాలను సైతం అందుకుకోవాలన్న ఆకాంక్ష వాటిని క్యూ కట్టిస్తోంది.
ఇదే మొదటి సారి కాదు...
భారతీయ ఆటోమొబైల్ మార్కెట్ పట్ల చైనా కంపెనీల ఆసక్తి కొత్తేమీ కాదు. కార్లు, పికప్ వాహనాల తయారీకి వీలుగా ఎస్‌ఏఐసీ 2009లో జీఎం మోటార్స్‌తో 50:50 జాయింట్ వెంచర్ కంపెనీ ఏర్పాటుకు ఒప్పందం చేసుకుంది. కానీ, ఆ తర్వాత ఎస్‌ఏఐసీ వాటాల్లో అధిక శాతం జీఎం మోటార్స్ కొనుగోలు చేయడమే కాకుండా లైట్ కమర్షియల్ వాహనాల తయారీ ఆలోచనలను పక్కన పెట్టింది. ఆ తర్వాత బెకీ ఫోటాన్ మోటార్స్ పుణె సమీపంలోని చకాన్‌లో ట్రక్కులు, బస్సుల తయారీకి వీలుగా ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. తర్వాత ఈ దిశగా ముందడుగు పడలేదు.
ఆశలు నెరవేరతాయా..?
నాణ్యత, తక్కువ ధర. ఉత్తమ సేవలు... దేశీయ వినియోగదారులు ఎక్కువగా చూసేవి ఇవే. ఇక్కడి వినియోగదారుల అభిరుచులపై సరైన అవగాహన పెంచుకున్న సుజుకి, హ్యుందాయ్, హోండా, టయోటా, మహీంద్రా, టాటా మోటార్స్ కంపెనీలు వినూత్న ఉత్పత్తులతో మార్కెట్లో పటిష్టమైన స్థానం సంపాదించుకున్నాయి. ఈ దశలో ఇక్కడి మార్కెట్ అవకాశాలను సొంతం చేసుకోవాలంటే చైనా తయారీ దారులు తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. మంచి ఫీచర్లతో సరసమైన ధరలకు నాణ్యమైన ఉత్పత్తులను అందించాల్సి ఉంటుంది.
పైగా చైనా ఉత్పత్తుల పట్ల ఇక్కడి ప్రజల్లో ఉన్న చిన్న చూపును అధిగమించడంపైనే వాటి విజయం ఆధారపడి ఉంది. ఏదేమైనప్పటికీ చైనా కార్ల కంపెనీల రాకతో ఇక్కడి కార్లమార్కెట్లో పోటీ మరింత వేడెక్కనుంది. దీంతో అంతిమంగా వినియోగదారులకు మరిన్ని కొనుగోలు అవకాశాలు అందివస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు.
భారత్‌లో కార్ల తయారీ కంపెనీలు 18
2015 నాటికి మారుతీ వాటా 47%; హ్యుందాయ్ 17.3 శాతం.
చైనాలో టాప్ తయారీ కంపెనీలు..
⇔ ఎస్‌ఏఐసీ...
⇔ డాంగ్‌ఫెంగ్ మోటార్ కంపెనీ
⇔ ఫా గ్రూపు కంపెనీ
⇔ చాంగ్‌కింగ్ చాంగాన్ ఆటోమొబైల్ కంపెనీ
⇔ బీఏఐసీ మోటార్
⇔ గాంగ్‌జు ఆటోమొబైల్ గ్రూపు కంపెనీ
⇔ గ్రేట్‌వాల్ మోటార్ కంపెనీ