సాక్షి, ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ఉత్సాహంగా ముగిసాయి. అంతేకాదు వరుసగా రెండో రోజు సెన్సెక్స్ సరికొత్త రికార్డును నెలకొల్పింది. మార్కెట్ చరిత్రలో తొలిసారి 39వేల పాయింట్ల మైలు రాయికి ఎగువన ముగిసింది. అటు నిఫ్టీ కూడా 11700కు పైన ముగియడం విశేషం.
సెన్సెక్స్ 185 పాయింట్లు ఎగసి 39,057 వద్ద, నిఫ్టీ సైతం 44 పాయింట్లు జమ చేసుకుని 11,713 వద్ద ముగిసింది. కొత్త ఆర్థిక సంవత్సరం తొలి రోజే సోమవారం రికార్డుల బోణీ కొట్టిన కీలక సూచీలు ఈ రోజు ట్రేడింగ్ ఆరంభంలో కొంత బలహీనంగా ఉన్నా చివరికి లాభాలతో ముగిశాయి.
దాదాపు అన్ని రంగాలూ లాభాల నార్జించాయి. ముఖ్యంగా రియల్టీ 2.3 శాతం పుంజుకోగా, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆటో, ఐటీ ఒక శాతం చొప్పున ఎగశాయి. అయితే మీడియా, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ, మెటల్ 0.9-0.4 శాతం మధ్య క్షీణించాయి.
టాటా మోటార్స్ దాదాపు 9 శాతం జంప్‌చేయగా, ఎయిర్‌టెల్, ఐషర్, ఎస్‌బీఐ, బజాజ్ ఫైనాన్స్, టీసీఎస్, పవర్‌గ్రిడ్, యస్ బ్యాంక్, గెయిల్, హెచ్‌డీఎఫ్‌సీ టాప్ విన్నర్స్‌గా ఉన్నాయి. మరోవైపు జీ, బీపీసీఎల్, బజాజ్ ఆటో, బ్రిటానియా, సన్ ఫార్మా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, గ్రాసిమ్, అల్ట్రాటెక్, యూపీఎల్, హెచ్‌సీఎల్ టెక్ 3-0.8 శాతం మధ్య నష్టపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment