
లాభాల స్వీకరణతో మార్కెట్ పతనం
రాజ్యసభలో జీఎస్‌టీ బిల్లుపై చర్చ జరుగుతుండటంతో ఇన్వెస్టర్లు ఆచి తూచి వ్యవహరించారు.
♦ బలహీనంగా అంతర్జాతీయ సంకేతాలు
♦ 284 పాయింట్ల నష్టంతో 27,698కు సెన్సెక్స్
♦ 78 పాయింట్ల నష్టంతో 8,545కు నిఫ్టీ
రాజ్యసభలో జీఎస్‌టీ బిల్లుపై చర్చ జరుగుతుండటంతో ఇన్వెస్టర్లు ఆచి తూచి వ్యవహరించారు. అంతర్జాతీయ సంకేతాలు కూడా సానుకూలంగా లేకపోవడంతో బుధవారం స్టాక్ మార్కెట్ నష్టపోయింది. ఇటీవల బాగా పెరిగిన షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో వరుసగా నాలుగో ట్రేడింగ్ సెషన్‌లోనూ స్టాక్ సూచీలు నష్టాలపాలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 27,700 పాయింట్లు, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 8,600 పాయింట్ల దిగువకు పడిపోయాయి. సెన్సెక్స్ 284 పాయింట్లు నష్టపోయి 27,698 పాయింట్ల వద్ద, నిఫ్టీ 78 పాయింట్లు నష్టపోయి 8,545 పాయింట్ల వద్ద ముగిశాయి. రియల్టీ, ఎఫ్‌ఎంసీజీ, వాహన షేర్లు నష్టపోయాయి.
భవిష్యత్తులో మరింత పతనం..!!
సెన్సెక్స్ లాభాల్లో ప్రారంభమైనప్పటికీ, పావుగంటలోనే నష్టాల్లోకి జారిపోయింది. జీఎస్‌టీ బిల్లు రాజ్యసభ ఆమోదం పొందగలదన్న విషయాన్ని స్టాక్ మార్కెట్ ఇప్పటికే డిస్కౌంట్ చేసుకుందని పలువురు విశ్లేషకులు అంటున్నారు. ఈ ఏడాది మార్చి నుంచి సెన్సెక్స్ 22% లాభపడటంతో సమీప భవిష్యత్తులో కొంత కరెక్షన్ ఉంటుందని వారు అంచనా వేస్తున్నారు.
ఐటీసీ 3 శాతం డౌన్: ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం ఐటీసీ 3% క్షీణించి రూ.253 వద్ద ముగిసింది. కంపెనీ ఆదాయంలో 60% సిగరెట్ల నుంచే వస్తోంది. జీఎస్‌టీ కారణంగా సిగరెట్లపై అధిక పన్నులు విధించే అవకాశముందన్న అంచనాల కారణంగా ఈ షేర్ క్షీణించింది. సెన్సెక్స్‌లో బాగా పతనమైన షేర్ ఇదే. సిప్లా, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్ షేర్లు 1-2% రేంజ్‌లో పెరిగాయి.
జీఎస్‌టీ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలపడంతో బుధవారం నాడు ఎస్‌జీఎక్స్ నిఫ్టీ 50 పాయింట్లకు పైగా ట్రేడయింది. రేపు కూడా ఈ ఎస్‌జీఎక్స్ నిఫ్టీ బాగానే లాభపడుతుందని అంచనా. దీంతో నేడు స్టాక్ సూచీలు భారీ గ్యాపప్‌తో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే లాభాల స్వీకరణ కారణంగా నష్టాలు వచ్చే అవకాశాలూ ఉన్నాయని, ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని నిపుణులంటున్నారు.