
15 నెలల గరిష్ట స్థాయికి నిఫ్టీ
జీఎస్‌టీ బిల్లు రాజ్యసభ ఆమోదం పొందుతుందన్న అంచనాలతో గురువారం భారత్ స్టాక్ సూచీలు వరుసగా రెండోరోజు ర్యాలీ జరిపాయి.
♦ సెన్సెక్స్ 184 పాయింట్లు అప్
♦ నిఫ్టీ 50 పాయింట్ల ర్యాలీ
♦ జీఎస్‌టీ బిల్లు ఆమోదం
♦ పొందుతుందన్న అంచనాలు
ముంబై : జీఎస్‌టీ బిల్లు రాజ్యసభ ఆమోదం పొందుతుందన్న అంచనాలతో గురువారం భారత్ స్టాక్ సూచీలు వరుసగా రెండోరోజు ర్యాలీ జరిపాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 184 పాయింట్ల పెరుగుదలతో దాదాపు ఏడాది గరిష్టస్థాయి వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 50 పాయింట్లకుపైగా పెరిగి 15 నెలల గరిష్టస్థాయి 8,666 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. గతేడాది ఏప్రిల్ 16 తర్వాత నిఫ్టీ ఈ స్థాయిలో ముగియడం ఇదే ప్రధమం. జులై డెరివేటివ్ కాంట్రాక్టులకు గురువారం చివరిరోజుకావడంతో ట్రేడర్లు వారి షార్ట్ పొజిషన్లను కవర్ చేసుకోవడం కూడా మార్కెట్ పెరగడానికి దోహదపడింది.
వచ్చేవారం రాజ్యసభలో జీఎస్‌టీ బిల్లు చర్చకు రానున్న సందర్భంగా షార్ట్ కవరింగ్ జరిగిందని బ్రోకింగ్ వర్గాలు తెలిపాయి. అయితే వచ్చే నెలకు ఎఫ్ అండ్ ఓ రోలోవర్స్ తక్కువగా జరిగాయని, ఇటీవల ఈక్విటీలు జోరుగా పెరగడం, వచ్చే పక్షం రోజుల్లోగా రిజర్వుబ్యాంక్ పరపతి సమీక్ష, జీఎస్‌టీ బిల్లుపై చర్చలు వుండటంతో ఆగస్టు నెలకు రోలోవర్స్ జోరు లేదని జియోజిత్ బీఎన్‌పీ పారిబాస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ ఆనంద్ జేమ్స్ చెప్పారు.
మారుతి స్పీడు...: ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాల్ని వెల్లడించడంతో క్రితం రోజు 1.5 శాతం పెరిగిన మారుతి సుజుకి తాజాగా మరో 4.47 శాతం ఎగిసి రూ. 4,763 వద్ద ముగిసింది. అలాగే మంచి ఫలితాలతో ఇన్వెస్టర్లను ఆకట్టుకున్న ఆసియన్ పెయింట్స్ 6 శాతంపైగా ర్యాలీ జరిపి రికార్డుస్థాయి రూ. 1,127 వద్ద క్లోజయ్యింది. ఐటీసీ 2.5 శాతం, సన్ ఫార్మా 2 శాతం, పవర్‌గ్రిడ్ 1.7 శాతం, టీసీఎస్ 1.5 శాతం, రిలయన్స్ ఇండస్ట్రీస్ 1.3 శాతం, కోల్ ఇండియా, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీలు 1 శాతం చొప్పున పెరిగాయి.