స్టాక్ మార్కెట్ వరుసగా మూడో రోజూ లాభపడింది. బ్యాంక్, ఆర్థిక రంగ, ఐటీ షేర్ల దన్నుతో బుధవారం సెన్సెక్స్, నిఫ్టీలు మంచి లాభాలు సాధించాయి. సెన్సెక్స్ 32,500 పాయింట్లపైకి, నిఫ్టీ 9,500 పాయింట్లపైకి ఎగబాకాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 52 పైసలు పుంజుకోవడం, మరొక్క రోజులో ఏప్రిల్ నెల ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్టులు ముగియనుండటంతో షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు చోటు చేసుకోవడం, త్వరలోనే భారీ ప్యాకేజీని కేంద్రం ప్రకటించనున్నదన్న ఆశలు, లాక్‌డౌన్‌ను దశలవారీగా తొలగిస్తారన్న వార్తలు, అంతర్జాతీయ సంకేతాలు అనుకూలంగా ఉండటం.. సానుకూల ప్రభావం చూపించాయి. ఇంట్రాడేలో 783 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ చివరకు 606 పాయింట్ల లాభంతో 32,720 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 172 పాయింట్లు ఎగసి 9,553 పాయింట్ల వద్దకు చేరింది.
రోజంతా లాభాలు....
పలు దేశాలు లాక్‌డౌన్‌ను సడలించాయి. మరోవైపు వడ్డీరేట్లపై కీలక నిర్ణయాన్ని నేడు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వెల్లడించనున్నది. సానుకూల నిర్ణయం వెలువడుతుందన్న అంచనాలతో ఆసియా మార్కెట్లు లాభాలతో ఆరంభమయ్యాయి. ఈ జోరుతో మన మార్కెట్ కూడా లాభాల్లోనే ఆరంభమైంది. రోజంతా లాభాలు కొనసాగాయి. బ్యాంక్, ఆర్థిక రంగ, ఐటీ, లోహ, వాహన రంగ షేర్లు లాభపడ్డాయి. ఇక ఆసియా మార్కెట్లు 1 శాతం రేంజ్‌లో, యూరప్ మార్కెట్లు 2 నుంచి 3 శాతం రేంజ్ లాభాల్లో ముగిశాయి.
హెచ్‌డీఎఫ్‌సీ జోడీ జోరు....
హెచ్‌డీఎఫ్‌సీ షేర్ 7 శాతం లాభంతో రూ.1,837 వద్దకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్ 5 శాతం లాభంతో రూ.977 వద్ద ముగిశాయి. సెన్సెక్స్‌లో అత్యధికంగా లాభపడిన మొదటి రెండు షేర్లు ఇవే. ఈ షేర్లలో వేల్యూ బయింగ్ చోటు చేసుకుందని నిపుణులంటున్నారు. కాగా మొత్తం సెన్సెక్స్ 606 పాయింట్ల లాభంలో ఈ రెండు షేర్ల వాటాయే సగానికి పైగా ఉండటం విశేషం. సెన్సెక్స్ లాభాల్లో హెచ్‌డీఎఫ్‌సీ వాటా 198 పాయింట్లుగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వాటా 183 పాయింట్లుగా ఉన్నాయి.
► స్టాక్ మార్కెట్ భారీ లాభాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.2 లక్షల కోట్ల మేర పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.2.09 లక్షల కోట్లు పెరిగి రూ.126.22 లక్షల కోట్లకు చేరింది.
► గత క్యూ4లో రూ.1,388 కోట్ల నికర నష్టాలు రావడంతో యాక్సిస్ బ్యాంక్ షేర్ 4 శాతం నష్టంతో రూ.439 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే.
► దాదాపు 200కు పైగా షేర్లు అప్పర్ సర్క్యూట్లను తాకాయి. హెచ్‌ఈజీ, క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ్, ఆవాస్ ఫైనాన్షియర్స్, లక్ష్మీ విలాస్ బ్యాంక్, తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.
భారీ లాభాల్లో అమెరికా మార్కెట్
అమెరికాకు చెందిన గిలీడ్ సైన్సెస్ కంపెనీ ఔషధం, రెమ్‌డీసివిర్... కరోనా వైరస్ చికిత్సలో సత్ఫలితాలు ఇస్తోందన్న వార్తలతో అమెరికా స్టాక్ మార్కెట్ భారీ లాభాల్లో ట్రేడవుతోంది. రాత్రి గం.11.30 ని.లకు నాస్‌డాక్, డోజోన్స్, ఎస్ అండ్ పీ 500 సూచీలు 2–3 శాతం రేంజ్ లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఒక్క డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఏడీఆర్ మినహా మిగిలిన అన్ని ఏడీఆర్‌లు(హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా మోటార్స్ డీవీఆర్, ఇన్ఫోసిస్, విప్రో)3–15% రేంజ్ లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఈ ప్రభావంతో మన మార్కెట్ గురువారం భారీ గ్యాపప్‌తో మొదలవుతుందని అంచనా.
9,500 పాయింట్ల పైకి నిఫ్టీ
Published Thu, Apr 30 2020 5:02 AM | Last Updated on Thu, Apr 30 2020 5:02 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment