ఉవ్వెత్తున ఎగిసి.. చివరికి ఫ్లాట్
ముంబై : రికార్డు స్థాయిలో ఎగిసిన స్టాక్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్ చివరికి ఫ్లాట్‌గా ముగిశాయి. దేశీ, విదేశీ సానుకూల సంకేతాలతో సెన్సెక్స్, నిఫ్టీలు ఇంట్రాడేలో ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిలను తాకినప్పటికీ, జూలై నెల ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్ట్‌ల గడువుకి నేడు ఆఖరి రోజు కావడంతో, చివరి గంట ట్రేడింగ్‌లో తీవ్ర అనిశ్చిత ఏర్పడింది. ఈ అనిశ్చితితో రికార్డు వర్షం కురిపించిన ఈక్విటీ బెంచ్‌మార్కు సూచీలు వెనక్కి తగ్గాయి. ముందస్తు గడించిన అన్ని లాభాలను బెంచ్‌మార్కు సూచీలు కోల్పోయి, ఆఖరికి ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్ 0.84 పాయింట్ల లాభంలో 32,383.30 వద్ద, నిఫ్టీ 0.10 పాయింట్ల నష్టంలో 10020.55 వద్ద క్లోజయ్యాయి.
నేటి ట్రేడింగ్ ప్రారంభంలో సెన్సెక్స్, నిఫ్టీ బుల్ జోరుతో దూసుకొచ్చాయి. రెండు సూచీలు ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిలను తాకాయి. సెన్సెక్స్ 291 పాయింట్ల లాభంతో 32,673 పాయింట్ల గరిష్ట స్థాయిని, నిఫ్టీ 94 పాయింట్ల లాభంతో 10,115 పాయింట్ల గరిష్ట స్థాయిని నమోదుచేశాయి. కానీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో చివరి గంటల్లో అమ్మకాలు పోటెత్తాయి. దీంతో మార్కెట్‌లు ఒడిదుడుకులకు లోనయ్యాయి. నేటి సెషన్‌లో టాప్ గెయినర్లుగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ, యస్ బ్యాంకు లాభాలు పండించగా.. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, టాటా మోటార్స్, టాటా మోటార్స్ డీవీఆర్‌లు నష్టాలు పాలయ్యాయి.
అందరి అంచనాలకనుగుణంగానే అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్లను పెంచకపోవడం, బీహార్‌లో నితీశ్ కుమార్ బీజేపీతో జట్టుకట్టడంతో వచ్చే ఎన్నికల్లో ఎన్‌డీఏ విజయావకాశాలు మరింత మెరుగుపడడం, కంపెనీల క్యూ1 ఫలితాలు ఆశావహంగా ఉండడం, జూలై సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు నేపథ్యంలో కొన్ని షేర్లలో షార్ట్ కవరింగ్ జరగడం, తదితర అంశాలు సానుకూల ప్రభావం చూపాయి.