
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో కీలక సూచీలు రెండూ రికార్డును నమోదు చేసాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 490688 స్థాయిని టచ్ చేయగా, ముగింపులో కూడా రికార్డును క్రియేట్ చేసింది. అటునిఫ్టీ కూడా 12 వేల ఎగువన ముగిసింది. దాదాపు అయిదు నెలల తరువాత నిఫ్టీ ఈ స్థాయికి చేరింది. ఈ ఏడాది జూన్ 4వ తేదీ తర్వాత నిఫ్టీ మరోసారి 12వేల మార్క్ ను టచ్ చేసింది. మిడ్ సెషన్ తరువాత మరింత జోరందుకున్న సెన్సెక్స్ ఒకదశలో 200పాయింట్లుకుపైగా ఎగిసింది. చివరికి సెన్సెక్స్ 184 పాయింట్లు లాభపడి 40,654వద్ద, నిఫ్టీ 46 పాయింట్లు పుంజుకుని 12,012 వద్ద ముగిసింది.
దాదాపు అన్ని రంగాలు లాభపడ్డాయి. ప్రదానంగా నిర్మలా సీతారామన్ ప్రకటించిన రియల్టీ పెట్టుబడుల పథకంతో రియల్టీ షేర్లు భారీగా పుంజుకున్నాయి. మెటల్, బ్యాంకింగ్ షేర్లు కూడా లాభపడ్డాయి. హెచ్‌డీఎఫ్‌సీ, ఐటీసీ, ఇన్ఫోసిస్,ఇండస్ ఇండ్, సన్‌ఫార్మా,వేదాంతా, ఏషియన్ పెయింట్స్ లాభపడ్డాయి. మరోవైపు యూపీఎల్, గెయిల్, ఎస్ బ్యాంకు, బీపీసీఎల్, హెచ్‌యూఎల్, సిప్లా, ఓఎన్‌జీసీ, టాటా మోటార్స్ నష్టపోయాయి.