మూడు వారాల కనిష్టం
- 185 పాయింట్లు డౌన్
- 22,324కు దిగిన సెన్సెక్స్
- ఆరు వారాల కనిష్టానికి నిఫ్టీ
- ఐటీ ఇండెక్స్ 2.6% పతనం
ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఎన్‌డీఏకు తగిన మెజారిటీ రాకపోవచ్చునన్న అంచనాలు మరోసారి స్టాక్ మార్కెట్లను పడగొట్టాయి. దీనికితోడు విదేశీ మార్కెట్ల నష్టాలు కూడా సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి. వెరసి సెన్సెక్స్ నష్టాలతో మొదలైంది. ఒక దశలో 222 పాయింట్లు పతనమై 22,300 దిగువకు చేరింది. చివరికి 185 పాయింట్లు పోగొట్టుకుని 22,324 వద్ద ముగిసింది. ఇది మూడు వారాల కనిష్టంకాగా నిఫ్టీ 63 పాయింట్లు కోల్పోయి 6,653 వద్ద నిలిచింది. ఇది ఆరు వారాల కనిష్టం కావడం గమనార్హం.
ఇంతక్రితం మార్చి 27న ఈ స్థాయిలో ముగిసింది. సాఫ్ట్‌వేర్ దిగ్గజాలు హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, ఎంఫసిస్, ఒరాకిల్, విప్రో, టీసీఎస్ 4.5-1.5% మధ్య నష్టపోవడంతో ఐటీ ఇండెక్స్ అత్యధికంగా 2.6% నష్టపోయింది. ప్రధానంగా టార్గెట్ ధరను 32%మేర తగ్గిస్తూ ఇన్ఫోసిస్ షేరును యూబీఎస్ డౌన్‌గ్రేడ్ చేయడం ప్రతికూల ప్రభావాన్ని చూపినట్లు నిపుణులు తెలిపారు.
రియల్టీ డీలా
ఎఫ్‌ఐఐలు రూ. 119 కోట్లు ఇన్వెస్ట్ చేయగా, దేశీ ఫండ్స్ రూ. 259 కోట్ల విలువైన షేర్లను విక్రయించాయి. కాగా, సెన్సెక్స్‌లో ఎన్‌టీపీసీ, ఎస్‌బీఐ, సన్ ఫార్మా మాత్రమే (1%) లాభపడ్డాయి. ఇక హెచ్‌డీఎఫ్‌సీ, హిందాల్కో, సిప్లా, బజాజ్ ఆటో, మారుతీ, భారతీ 3-1.5% మధ్య తిరోగమించాయి. ట్రేడైన షేర్లలో 1,493 నష్టపోగా, 1,234 లాభపడ్డాయి. రియల్టీ షేర్లు డీబీ, హెచ్‌డీఐఎల్, యూనిటెక్, మహీంద్రా లైఫ్, గోద్రెజ్ ప్రాపర్టీస్ 4-2% మధ్య నీరసించగా, మిడ్ క్యాప్స్‌లో అలహాబాద్, సిండికేట్, యునెటైడ్ బ్యాంక్‌లతోపాటు, రెయిన్ ఇండస్ట్రీస్, దీపక్ ఫెర్టిలైజర్స్, పిపావవ్ డిఫెన్స్, డెల్టా కార్ప్, సోలార్ ఇండస్ట్రీస్, గ్రీన్‌ప్లై 9-4% మధ్య పతనమయ్యాయి.