ముంబై: ఐటీ రంగ షేర్లలో అమ్మకాలతో ఈక్విటీ మార్కెట్లు వరుసగా రెండో రోజు శుక్రవారం కూడా నష్టాల్లోనే ముగిశాయి. వ్యాల్యూషన్లు గరిష్ట స్థాయిల్లో ఉండటంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపించారు. దీంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ 216 పాయింట్లు నష్టపోయి (0.53 శాతం) 40,359 వద్ద క్లోజయింది. అలాగే, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా 54 పాయింట్లు కోల్పోయి (0.45 శాతం) 11,914 వద్ద ముగిసింది. ప్రారంభం నుంచి ప్రధాన సూచీలు నష్టాల్లోనే కొనసాగాయి.
ఇక వారం మొత్తం మీద సెన్సెక్స్ నికరంగా 2.72 పాయింట్లు పెరగ్గా, నిఫ్టీ 19 పాయింట్లు లాభపడింది. సూచీలోని ఐటీ రంగ షేర్లలో ఇన్ఫోసిస్ అత్యధికంగా 3 శాతం నష్టపోయింది. టీసీఎస్, ఏషియన్ పెయింట్స్, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్లు కూడా నష్టాల పాలయ్యాయి. అమెరికా ఉద్యోగుల ప్రయోజనాల పరిరక్షణ కోసం ఉద్యోగ వీసా అర్హతల్లో అమెరికా మార్పులు చేయనుందన్న వార్తలు ఐటీ రంగ షేర్లపై ప్రతికూల ప్రభావం చూపించాయి. సూచీల్లో టాటా స్టీల్ గరిష్టంగా 4 శాతం వరకు పెరిగింది. ఎన్‌టీపీసీ, వేదాంత, ఓఎన్‌జీసీ సైతం 2–3 శాతం
మధ్య లాభపడ్డాయి.
జీడీపీ డేటాపై దృష్టి...: ‘‘బ్లూచిప్ స్టాక్స్ అధిక వ్యాల్యూషన్ కారణంగా మార్కెట్ అంచుకు చేరింది. ట్రెయిలింగ్ (గత 12 నెలల కాలం) పీఈ 26 రెట్ల వద్ద ట్రేడ్ అవుతుండటంతో ప్రధాన సూచీలు మరింత ముందుకు వెళ్లేందుకు బలం చాలడం లేదు. రానున్న వారంలో ఎటువంటి ప్రధాన సానుకూలాంశం లేకపోవడంతో ప్రభుత్వం ప్రకటించే జీడీపీ డేటాపై దృష్టి సారించొచ్చు. ఇది మార్కెట్‌పై ప్రభావం చూపిస్తుంది. ఈ డేటా ఆధారంగా ఆర్‌బీఐ ఒకవేళ తన సర్దుబాటు ధోరణిని తటస్థానికి మార్చుకుంటే అది మార్కెట్ ర్యాలీకి విఘాతం కలిగిస్తుంది.
యూఎస్ హెచ్1–బీ వీసా నిబంధనల కఠినతరంపై తాజా ఆందోళనలు ప్రధాన ఐటీ షేర్లను నష్టపోయేలా చేశాయి’’అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అన్నారు. రంగాల వారీగా చూస్తే ఐటీ, టెక్నాలజీ, టెలికం, క్యాపిటల్ గూడ్స్, బ్యాంకెక్స్, ఇండస్ట్రియల్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ సూచీలు గరిష్టంగా 2.21 శాతం వరకు నష్టపోగా, మెటల్, పవర్, యుటిలిటీలు, బేసిక్ మెటీరియల్స్, ఆటో, ఇంధన రంగ సూచీలు 2.08 శాతం వరకు లాభపడ్డాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 0.14 శాతం వరకు నష్టపోయాయి. ఆసియా మార్కెట్లలో హాంగ్‌కాంగ్, టోక్యో, సియోల్ లాభపడగా, షాంఘై నష్టపోయింది. యూరోప్ మార్కెట్లు సానుకూలంగా ట్రేడయ్యాయి.
సెన్సెక్స్‌లోకి నెస్లే, టైటాన్, అల్ట్రాటెక్
బీఎస్‌ఈ ప్రధాన సూచీ సెన్సెక్స్ సూచీలోకి కొత్తగా నెస్లే, టైటాన్, అల్ట్రాటెక్ సిమెంట్ అడుగు పెట్టనున్నాయి. ప్రస్తుతం సూచీలో ఉన్న వేదాంత, యస్ బ్యాంకు, టాటా మోటార్స్, టాటా మోటార్స్ డీవీఆర్, బయటకు వెళ్లిపోనున్నాయి. డిసెంబర్ 23 నుంచి ఈ మార్పులు అమల్లోకి వస్తాయని స్టాక్ ఎక్సేంజ్ ప్రకటించింది. ఎస్‌అండ్‌పీ డోజోన్స్, బీఎస్‌ఈ జాయింట్ వెంచర్‌లో ఎస్‌అండ్‌పీ బీఎస్‌ఈ సెన్సెక్స్ సూచీ నిర్వహణ కొనసాగుతోంది. సెన్సెక్స్50, నెక్స్ట్50, బీఎస్‌ఈ 100, 200, 500 సూచీల్లోనూ మార్పులు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment