ఫ్లాట్ గా ముగిసిన మార్కెట్లు
Published Thu, Jun 1 2017 4:01 PM | Last Updated on Tue, Sep 5 2017 12:34 PM
ఈక్విటీ బెంచ్ మార్కు సూచీలు గురువారం ఫ్లాట్ గా ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 8.21 పాయింట్ల నష్టంలో 31,137.59 వద్ద, నిఫ్టీ 5.15 పాయింట్లు పడిపోయి 9,616.10 వద్ద క్లోజయ్యాయి. నేటి ట్రేడింగ్ లో ఓన్జీసీ, ఐసీఐసీఐ బ్యాంకు, ఇండియన్ ఆయిల్, ఇండియా బుల్స్ హౌజింగ్ ఫైనాన్స్ ఎక్కువగా నష్టపోగా.. హెచ్యూఎల్, అదానీ పోర్ట్స్, అరో ఫార్మాలు టాప్ గెయినర్లుగా నిలిచాయి. నిన్న ప్రకటించిన జీడీపీ డేటా నేటి మార్కెట్లపై కొంత ప్రభావం చూపింది. అయితే ఎకానమీ కోలుకుంటుందని ఇన్వెస్టర్లు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. అంచనావేసిన కంటే కూడా ఆర్థిక వృద్ధి పడిపోయినప్పటికీ, బాండ్లు స్వల్పంగా పెరిగాయి.
వచ్చే వారంలో జరుగుబోయే ఆర్బీఐ పాలసీపై ఇన్వెస్టర్లు ఎక్కువగా దృష్టిసారిస్తున్నారు. వచ్చే క్వార్టర్ మంచిగా ఉంటుందని మార్కెట్లు భావిస్తున్నాయని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. ఒకవేళ వచ్చే వారంలో ఆర్బీఐ రేట్ల కోత విధిస్తే అది మార్కెట్లకు అతిపెద్ద సర్ ప్రైజ్ అవుతుందన్నారు. నేటి మార్కెట్లో మెటల్ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. నిఫ్టీ మెటల్ సబ్-ఇండెక్స్ 1.18 శాతం మేర పడిపోయింది. అటు డాలర్ తో రూపాయి మారకం విలువ 64.47గా ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు 163 రూపాయలు నష్టపోయి 28,680గా నమోదయ్యాయి.
Advertisement