చివరి నిమిషాల ట్రేడింగ్‌లో నెలకొన్న అమ్మకాల ఒత్తిడితో దలాల్ స్ట్రీట్ ఒడిదుడుకులకు లోనైంది.
ముంబై : చివరి నిమిషాల ట్రేడింగ్‌లో నెలకొన్న అమ్మకాల ఒత్తిడితో దలాల్ స్ట్రీట్ ఒడిదుడుకులకు లోనైంది. ప్రారంభం నుంచి ఆర్జించిన లాభాలను చివర్లో కోల్పోయింది. 100 పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్ చివరికి ఫ్లాట్‌గా సెన్సెక్స్ 24.57 పాయింట్ల లాభంలో 31,795 వద్ద క్లోజైంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ తన కీలకమైన మార్కు 9900ని నిలుపుకుని, 6.85 పాయింట్ల లాభంలో 9,904 వద్ద ముగిసింది. చివరి నిమిషాల్లో అమ్మకాలు నెలకొన్నప్పటికీ, వరుసగా మూడో రోజూ మార్కెట్లు లాభాల్లో ముగియడం గమనార్హం. ఈ పతనం బ్యాంకు, ఆటో, ఫార్మాస్యూటికల్స్, ఎఫ్‌ఎంసీజీ రంగాల స్టాక్స్‌లో నెలకొంది. ఐటీతో పాటు మిగతా రంగాల షేర్లు లాభాలను ఆర్జించాయి.
టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ శనివారం షేరు బైబ్యాక్‌పై ప్రకటన చేయనున్న నేపథ్యంలో ఈ కంపెనీ షేర్లు ఇంట్రాడేలో దూసుకుపోయాయి. ఉత్తర కొరియా, అమెరికాల మధ్య ఆందోళనకర పరిస్థితులు చల్లబడటంతో ఆసియన్ షేర్లూ పైకి ఎగిశాయి. రెండు సూచీల్లోనూ ఇన్ఫోసిస్, కోల్ ఇండియాలు టాప్ గెయినర్లుగా నిలవగా.. సిప్లా, కొటక్ మహింద్రా బ్యాంకు, ఏసీసీ నష్టాలు గడించాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 2 పైసలు బలహీనపడి 64.14గా ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్‌లో బంగారం ధరలు 189 రూపాయలు లాభపడి 29,141గా నమోదయ్యాయి.