విదేశీ అంశాల దెబ్బ
అంతర్జాతీయ అంశాలు దేశీయ స్టాక్ మార్కెట్లను దెబ్బతీశాయి. క్యూ2 జీడీపీ క్షీణించడం ద్వారా ఇటలీ మాంద్యంలోకి జారుకోగా, జర్మనీ తయారీ రంగం బలహీనపడింది. మరోవైపు ఉక్రెయిన్-రష్యాల మధ్య ఆందోళనలు మళ్లీ పెరగడంతో ఆసియా, యూరప్ మార్కెట్లు నష్టపోయాయి. వెరసి దేశీయంగానూ ఇన్వెస్టర్లు అమ్మకాలకే కట్టుబడ్డారు. తొలి నుంచీ నష్టాలలో కదిలిన సెన్సెక్స్ మిడ్ సెషన్ నుంచీ మరింత బలహీనపడింది. చివరి గంటలో పెరిగిన అమ్మకాలతో 243 పాయింట్లు నష్టపోయింది. 25,665 వద్ద ముగిసింది.
దీంతో గత రెండు రోజుల లాభాలకు బ్రేక్ పడింది. సెన్సెక్స్ రెండు రోజుల్లో 427 పాయింట్లు పుంజుకున్న సంగతి తెలిసిందే. ఇక నిఫ్టీ కూడా 75 పాయింట్లు పతనమై 7,672 వద్ద నిలిచింది. విదేశీ అంశాలకుతోడు డాలరుతో మారకంలో రూపాయి 5 నెలల కనిష్టానికి పడటం కూడా సెంటిమెంట్‌ను దెబ్బతీసిందని నిపుణులు పేర్కొన్నారు. రూపాయి 65 పైసలు కోల్పోయి 61.50కు చేరింది.
ఇన్ఫోసిస్ అండ
మిగులు నిధులతో షేర్ల బైబ్యాక్ చేపట్టాలని కంపెనీ మాజీ ఎగ్జిక్యూటివ్‌లు కోరిన నేపథ్యంలో ఇన్ఫోసిస్ మరో 2% ఎగసింది. ఈ బాటలో భెల్, ఎంఅండ్‌ఎం కూడా నిలిచాయి.