ఒడిదుడుకుల మధ్య లాభాలు
వారాంతం రోజున ఒడిదుడుకుల మధ్య కదిలిన మార్కెట్లు చివరికి స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 45 పాయింట్లు పెరిగి 20,758 వద్ద ముగియగా, నిఫ్టీ 3 పాయింట్లు మాత్రమే జమ చేసుకుని 6,171 వద్ద స్థిరపడింది. క్యూ3లో పనితీరుతోపాటు, ప్రోత్సాహకర ఆదాయ అంచనాలను ప్రకటించిన ఇన్ఫోసిస్ సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చింది. దీంతో ఒక దశలో సెన్సెక్స్ 258 పాయింట్లు ఎగసి 20,971ను తాకింది. అయితే డిసెంబర్ నెల ఎగుమతుల గణాంకాలు నిరుత్సాహపరచడంతో మిడ్ సెషన్‌లో అమ్మకాలు మొదలయ్యాయి. వెరసి సెన్సెక్స్ లాభాలు అడుగంటాయి. ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ 2.8-1.7% మధ్య పుంజుకోవడంతో ఐటీ ఇండెక్స్ 2% పురోగమించింది. ఐటీసీ 2.2% ఎగసింది. కాగా, ఐసీఐసీఐ, ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్ 2.7-1.6% మధ్య నష్టపోవడంతో బ్యాంకెక్స్ 1.5% డీలాపడింది. ఎఫ్‌ఐఐలు రూ. 68 కోట్లు, దేశీయ ఫండ్స్ రూ. 82 కోట్లు చొప్పున ఇన్వెస్ట్‌చేశాయి.
నిఫ్టీ ఫ్యూచర్లో బుల్ ఆఫ్‌లోడింగ్.: నిఫ్టీ ఫ్యూచర్లో బుల్స్ వారి లాంగ్ పొజిషన్లను క్రమేపీ ఆఫ్‌లోడ్ చేస్తున్నట్లు డెరివేటివ్ డేటా వెల్లడిస్తున్నది. ఫలితంగా ఈ నెల ప్రారంభం నుంచి నిఫ్టీ ఫ్యూచర్ నుంచి ఇప్పటివరకూ 28 లక్షల షేర్లు కట్ అయ్యాయి. నెలారంభంలో 1.98 కోట్ల షేర్లవరకూ వున్న ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) తాజాగా 1.70 కోట్ల షేర్లకు పడిపోయింది. లాంగ్ ఆఫ్‌లోడింగ్‌ను సూచిస్తూ స్పాట్‌తో పోలిస్తే నిఫ్టీ ప్రీమియం 57 పాయింట్ల నుంచి 7 పాయింట్లకు పడిపోయింది. శుక్రవారంనాటి ట్రేడింగ్‌లో ఈ ప్రక్రియ మరింత స్పష్టంగా కనపడింది. ఇన్ఫోసిస్ ఫలితాల సందర్భంగా స్పాట్ నిఫ్టీ 6,239 పాయింట్ల గరిష్టస్థాయికి పెరిగినపుడు 20 పాయింట్లు వున్న ప్రీమియం కాస్తా ముగింపు సమయంలో 7 పాయింట్లకు తగ్గిపోయింది. ఐటీ, ఆయిల్, బ్యాంకింగ్ స్టాక్ ఫ్యూచర్లతో సహా ప్రధాన స్టాక్ ఫ్యూచర్ల ప్రీమియంలు పడిపోవడంతో సహజంగానే నిఫ్టీ ప్రీమియం కూడా తగ్గింది. పీఎస్‌యూ షేర్లు కోల్ ఇండియా, బీహెచ్‌ఈఎల్‌లు త్వరలో డివిడెండు ప్రకటించే అవకాశం వున్నందున, స్పాట్ ధరతో పోలిస్తే ఆ ఫ్యూచర్లు రూ. 14, రూ. 4 చొప్పున డిస్కౌంట్‌తో ట్రేడ్‌కావడం నిఫ్టీ ప్రీమియం క్రాష్‌కు కారణం.