ఆరు వారాల గరిష్టం
330 పాయింట్ల హైజంప్
27,702కు చేరిన సెన్సెక్స్
ఆటో, బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసీజీ అండ
చివరి గంటలో కొనుగోళ్ల వెల్లువ
విదేశీ అంశాల జోష్‌తో దేశీ స్టాక్ మార్కెట్లు రివ్వున పెకైగశాయి. చమురు ధరలతోపాటు, రష్యా రూబుల్ బలపడటం, ఆసియా, యూరప్ మార్కెట్లు లాభాలు ఆర్జించడం ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిచ్చాయి. వెరసి సెన్సెక్స్ 330 పాయింట్ల హైజంప్ చేసింది. 27,702 వద్ద నిలిచింది. ఇది ఆరు వారాల గరిష్టంకాగా, నిఫ్టీ 99 పాయింట్లు పురోగమించి 8,300 కీలక స్థాయిని అధిగమించింది. 8,324 వద్ద ముగిసింది. ప్రధానంగా ఆటో, బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసీజీ, పవర్, మెటల్ రంగాలు 1.5% స్థాయిలో లాభపడటం ద్వారా మార్కెట్లకు అండగా నిలిచాయి.
3 రోజుల్లో 992 ప్లస్
తొలుత స్వల్ప లాభాలతో మొదలైన సెన్సెక్స్ చివరి గంటలో వెల్లువెత్తిన కొనుగోళ్లతో ఒక్కసారిగా ఊపందుకుంది. ఒక దశలో గరిష్టంగా 27,725ను సైతం తాకింది. కాగా, వరుసగా మూడు రోజులు లాభపడటం ద్వారా మొత్తం 992 పాయింట్లు జమ చేసుకుంది. బీఎస్‌ఈలో అన్ని రంగాలూ లాభపడగా, సెన్సెక్స్ దిగ్గజాలలో 4 షేర్లు మాత్రమే అది కూడా నామమాత్రంగా నష్టపోయాయి.
ఇతర విశేషాలివీ...
వచ్చే ఏడాది 6% వృద్ధిని అందుకుంటామ న్న ఆర్థిక మంత్రి వ్యాఖ్యలు సెంటిమెంట్ కు బలాన్నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇక ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో జీఎస్‌టీ, బీమా బిల్లులు ఆమోదం పొందవచ్చునన్న అంచనాలు కూడా ఇందుకు జత కలిసినట్లు తెలిపారు.
సురేష్ ప్రభు అధ్యక్షతన ఏర్పాటైన సలహా సంఘం విద్యుత్, బొగ్గు రంగాల అభివృద్ధిపై తుది నివేదిక సిద్ధం చేయడంతో మరిన్ని సంస్కరణలపై ఇన్వెస్టర్లలో ఆశలు పెరిగినట్లు విశ్లేషకులు తెలిపారు.
బ్లూచిప్స్‌లో కోల్ ఇండియా, ఎంఅండ్‌ఎం, హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం, భెల్, గెయిల్, ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీ, భారతీ ఎయిర్‌టెల్ 3.5-2% మధ్య లాభపడ్డాయి.
బీఎస్‌ఈ-500లో బీఎఫ్ యుటిలిటీస్ 20% దూసుకెళ్లగా, సుజ్లాన్, ఐఐఎఫ్‌ఎల్, గీతాంజలి, వక్రంగీ, ఇండియా సిమెంట్, ఫ్యూచర్ రిటైల్, జిందాల్ స్టీల్, ఒబెరాయ్ రియల్టీ, నెస్కో, మణప్పురం, బజాజ్ హోల్డింగ్స్, ఐవీఆర్‌సీఎల్ 8-5% మధ్య పుంజుకున్నాయి.