మళ్లీ 10,900 పైకి నిఫ్టీ | Sensex surges 548 points to close at 37,020 | Sakshi
Sakshi News home page

మళ్లీ 10,900 పైకి నిఫ్టీ

Published Sat, Jul 18 2020 5:55 AM | Last Updated on Sat, Jul 18 2020 5:55 AM

Sensex surges 548 points to close at 37,020 - Sakshi

కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నా, కంపెనీల క్యూ1 ఫలితాలు అంచనాలను మించుతుండటంతో శుక్రవారం స్టాక్‌ మార్కెట్‌ భారీగా లాభపడింది.  సెన్సెక్స్‌ 37,000 పాయింట్లు, నిఫ్టీ 10,900 పాయింట్లపైకి ఎగబాకాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 16 పైసలు పుంజుకొని 75.02కు చేరడం, కరోనా వ్యాక్సిన్‌పై ఆశలు పెరగడం... సానుకూల ప్రభావం చూపించాయి.  ప్రపంచ మార్కెట్లు అంతంత మాత్రంగానే ఉన్నా, మన మార్కెట్‌ దూసుకుపోయింది. సెన్సెక్స్‌ 548 పాయింట్ల లాభంతో 37,020 పాయింట్ల వద్ద, నిఫ్టీ 162 పాయింట్లు పెరిగి 10,902 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీలు నాలుగు నెలల గరిష్ట స్థాయికి చేరాయి. వరుసగా మూడో రోజూ స్టాక్‌ సూచీలు లాభపడ్డాయి. వారం పరంగా చూస్తే, సెన్సెక్స్‌ 426 పాయింట్లు, నిఫ్టీ 134 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. స్టాక్‌ మార్కెట్‌ వరుసగా ఐదో వారమూ పెరిగింది.  

కరోనా కల్లోలం...  
ఒక్క శుక్రవారం రోజే కరోనా కేసులు 36 వేలకు పైగా మించాయి. మొత్తం కేసులు పది లక్షలను దాటాయి. కేవలం మూడు రోజుల్లోనే కేసుల సంఖ్య 9 లక్షల నుంచి పది లక్షలకు చేరడం విశేషం. ఆసియా మార్కెట్లు బలహీనంగా ఉన్నా, మన మార్కెట్‌ లాభాల్లోనే మొదలైంది. చివరి గంట వరకూ పరిమిత శ్రేణిలోనే కదలాడింది.  చివరి గంటలో కొనుగోళ్లు జోరుగా సాగాయి. దేశంలో వివిధ ప్రాంతాల్లో మళ్లీ లాక్‌డౌన్‌ ఉండొచ్చన్న ఆందోళనను మార్కెట్‌ పట్టించుకోలేదు. ఐటీ కంపెనీలతో పాటు బ్రిటానియాఆర్థిక ఫలితాలు అంచనాలను మించడం సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చింది. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా, యూరప్‌ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగిశాయి.  

► ఓఎన్‌జీసీ 5.5% లాభంతో రూ. 80 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్‌ ఇదే.  
►30 సెన్సెక్స్‌ షేర్లలో ఐదు షేర్లు–టీసీఎస్, నెస్లే ఇండియా, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్‌ టెక్, యాక్సిస్‌ బ్యాంక్‌లు మాత్రమే నష్టపోయాయి. మిగిలిన 25 షేర్లు పెరిగాయి.  
►స్టాక్‌ మార్కెట్‌ భారీ లాభాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.2.07 లక్షల కోట్లు ఎగసింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ రూ.2.07 లక్షల కోట్లు పెరిగి రూ.144.88 లక్షల కోట్లకు చేరింది.  
►ప్రైవేటీకరణ వార్తల జోరుతో ప్రభుత్వ రంగ షేర్లు లాభపడ్డాయి. బీపీసీఎల్‌ 13 శాతం, హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్, హెచ్‌పీసీఎల్, ఐఓసీ షేర్లు 3–12 శాతం రేంజ్‌లో లాభపడ్డాయి.


95 శాతం సబ్‌స్క్రైబయిన యస్‌బ్యాంక్‌ ఎఫ్‌పీఓ  
యస్‌ బ్యాంక్‌ ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌(ఎఫ్‌పీఓ) 95శాతం సబ్‌స్క్రైబయింది. రూ.12–13 ఫ్లోర్‌ప్రైస్‌తో వచ్చిన ఎఫ్‌పీఓ ద్వారా యస్‌ బ్యాంక్‌ రూ.15,000 కోట్లు సమీకరించనున్నది.   

భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌... 3 రెట్లకుపైగా సబ్‌స్క్రిప్షన్‌
రెండో విడత భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌ 3 రెట్లకు పైగా సబ్‌స్క్రైబ్‌ అయ్యింది. అన్ని వర్గాల నుంచీ విశేష స్పందన లభించడంతో దాదాపు రూ.10,000 కోట్ల సమీకరణ జరిగినట్లు అంచనా.  14వ తేదీన ప్రారంభమైన ఈటీఎఫ్‌ శుక్రవారంతో ముగిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement