రికార్డుకి చేరువలో...
లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతోపాటు విదేశీ మార్కెట్లు సానుకూలంగా ఉండటంతో దేశీయ స్టాక్ మార్కెట్లు మరోసారి బలపడ్డాయి. సెన్సెక్స్ 67 పాయింట్లు లాభపడి 21,277 వద్ద ముగియగా, 31 పాయింట్లు జమ చేసుకున్న నిఫ్టీ 6,329 వద్ద నిలిచింది. వెరసి సూచీలు రెండూ చరిత్రాత్మక గరిష్ట స్థాయిలకు చేరువయ్యాయి. ఇంతక్రితం జనవరి 21న సెన్సెక్స్ 21,374 వద్ద కొత్త గరిష్టాన్ని తాకగా, ఇంట్రాడేలో 2013 డిసెంబర్ 9న 21,484కు చేరింది. ఇక నిఫ్టీ డిసెంబర్ 9న ఇంట్రాడేలో 6,394ను తాకి, 6,364 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్-రష్యా యుద్ధ ఆందోళనలు తొలగడం, ఈ ఏడాదికి చైనా విధించుకున్న 7.5% ఆర్థిక వృద్ధి లక్ష్యం వంటి అంశాలు సెంటిమెంట్‌ను మెరుగుపరచాయని విశ్లేషకులు పేర్కొన్నారు.
బ్యాంకింగ్ ర్యాలీ
అవసరమైన మూలధన పెట్టుబడులను సమకూర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందంటూ ఆర్థికమంత్రి చిదంబరం భరోసా ఇవ్వడం ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ షేర్లలో ర్యాలీకి కారణమైంది. మొండిబకాయిల సమస్యను సమర్థవంతంగా ఎదుర్కోవడంతోపాటు, ఇకపై లాభదాయకతపై దృష్టిపెట్టేందుకు వీలుగా బ్యాంకింగ్ రంగానికి అండగా నిలవనున్నట్లు మంత్రి ప్రకటించడం కూడా ర్యాలీకి బలాన్నిచ్చింది. వెరసి బీవోబీ, ఓబీసీ, పీఎన్‌బీ, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్‌బీఐ 6-1.5% మధ్య పుంజుకోగా, ప్రైవేట్ రంగ సంస్థలు ఐసీఐసీఐ, యస్ బ్యాంక్ సైతం 3% స్థాయిలో ఎగశాయి. మరోవైపు సెన్సెక్స్‌లో టాటా పవర్ అత్యధికంగా 3.2% క్షీణించగా, రియల్టీ షేర్లు ప్రెస్టేజ్, అనంత్‌రాజ్, డీఎల్‌ఎఫ్, డీబీ, ఇండియాబుల్స్, హెచ్‌డీఐఎల్ 7-2% మధ్య జంప్ చేశాయి. ఎఫ్‌ఐఐలు రూ. 737 కోట్లను ఇన్వెస్ట్‌చేయగా, దేశీ ఫండ్స్ రూ. 202 కోట్ల అమ్మకాలు చేపట్టాయి.