మళ్లీ కొత్త రికార్డులు
సార్వత్రిక ఎన్నికల ఫలితాల కోసం ఎదురుచూస్తున్న ఇన్వెస్టర్లు మరోసారి ఆచితూచి వ్యవహరించారు. దీంతో రోజంతా స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య కదలిన మార్కెట్లు చివరికి కొద్దిపాటి లాభాలను ఆర్జించాయి. వెరసి కొత్త గరిష్టాల వద్ద ముగిసి రికార్డు సృష్టించాయి. సెన్సెక్స్ 90 పాయింట్లు లాభపడి 23,906 వద్ద నిలవగా, 14 పాయింట్లు బలపడ్డ నిఫ్టీ 7,123 వద్ద స్ధిరపడింది. ఎన్‌డీఏకు మెజారిటీ లభిస్తుందంటూ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించడంతో మెరుగపడ్డ సెంటిమెంట్ కు టోకు ధరల ద్రవ్యోల్బణం 5.2%కు పరిమితంకావడం జత కలిసింది. దీంతో ఇన్వెస్టర్లకు ప్రోత్సాహం లభించిందని నిపుణులు తెలిపారు.
ఎఫ్‌ఐఐల పెట్టుబడులు ఓకే
సెన్సెక్స్ దిగ్గజాలలో బజాజ్ ఆటో 4%పైగా క్షీణించగా, హిందాల్కో, సెసాస్టెరిలైట్, విప్రో, డాక్టర్ రెడ్డీస్, ఎల్‌అండ్‌టీ 1.5% స్థాయిలో నీరసించాయి. మరోవైపు టాటా పవర్, ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీ 3% స్థాయిలో పుంజుకోగా, గెయిల్, హెచ్‌యూఎల్, టాటా స్టీల్, సన్ ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం, యాక్సిస్ 1.5%పైగా పురోగమించాయి. ఇటీవల పెట్టుబడులకే కట్టుబడుతున్న ఎఫ్‌ఐఐలు తాజాగా రూ. 935 కోట్లను ఇన్వెస్ట్‌చేయగా, దేశీ ఫండ్స్ రూ. 385 కోట్ల అమ్మకాలు నిర్వహించాయి.
చిన్న షేర్లు డీలా
ట్రెండ్‌కు విరుద్ధంగా చిన్న షేర్లు డీలాపడ్డాయి. మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు 1% స్థాయిలో నష్టపోగా, ట్రేడైన షేర్లలో 1,743 క్షీణించాయి. కేవలం 1,156 షేర్లు లాభపడ్డాయి.
గతేడాది బైబ్యాక్‌ల విలువ రూ. 4,426 కోట్లు
న్యూఢిల్లీ: గడిచిన ఏడాది(2013-14) సాధారణ వాటాదారుల నుంచి దేశీ కంపెనీలు రూ. 4,400 కోట్ల విలువైన షేర్లను తిరిగి కొనుగోలు(బైబ్యాక్) చేశాయి. ఇవి నిర్దేశించుకున్న లక్ష్యంలో 78%కు సమానం. 31 బైబ్యాక్ ఆఫర్ల ద్వారా మొత్తం రూ. 5,704 కోట్లను వెచ్చించేందుకు కంపెనీలు ప్రణాళికలు ప్రకటించాయి. ఈ వివరాలను ప్రైమ్ డేటాబేస్ నివేదిక వెల్లడించింది. వీటిలో ఎన్‌హెచ్‌పీసీ అత్యధికంగా రూ. 2,368 కోట్లను బైబ్యాక్‌కు వినియోగించింది. 31 ఆఫర్లలో 24 ఆఫర్లను స్టాక్ ఎక్స్ఛేంంజీల ద్వారా, మిగిలినవి టెండర్ మార్గంలో నిర్వహించాయి. కాగా, అంతక్రితం ఏడాది(2012-13) 26 బైబ్యాక్‌ల ద్వారా దేశీ కంపెనీలు రూ. 4,746 కోట్ల విలువైన సొంత షేర్లను కొనుగోలు చేశాయి.