
ఇదే చివరి అవకాశం.. గడువు పొడిగించం
♦ నల్లధనం వెల్లడిపై కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ
♦ వివరాలు గోప్యంగా ఉంచుతాం.. విచారణ ఉండదు
♦ వాణిజ్య సంఘాలు, సీఏలతో సమావేశం
న్యూఢిల్లీ: ప్రభుత్వం తీసుకొచ్చిన కార్యక్రమంలో భాగంగా తమ రహస్య ఆస్తులు వెల్లడించిన వారి సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని, ఇతర సంస్థలతో పంచుకోబోమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హామీ ఇచ్చారు. వాణిజ్య సంఘాలు, చార్టర్డ్ అకౌంటెంట్లు (సీఏలు), ఆదాయపన్ను వృత్తి నిపుణులతో మంగళవారం జైట్లీ ఢిల్లీలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం విషయంలో వారికున్న సందేహాలు తీర్చారు. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు తమ నల్లధనం గురించి ఆదాయపన్ను విభాగానికి తెలియజేసి పన్ను చెల్లించేందుకు కేంద్రం అవకాశం కల్పించిన విషయం తెలిసిందే.
అప్రకటిత ఆదాయం కలిగి ఉండి, ఆదాయపన్ను వ్యవస్థకు దూరంగా ఉన్న వారు... తమ ఆస్తులను చట్టబద్ధం చేసుకుని ప్రశాంతంగా నిద్రించేందుకు ఇదే చివరి అవకాశమని సమావేశం అనంతరం జైట్లీ మీడియాతో అన్నారు. ఆదాయ వెల్లడి (ఐడీఎస్) పథకాన్ని పొడిగించేది లేదని స్పష్టం చేశారు. ఆస్తుల విషయంలో ఇంకా గోప్యంగానే ఉంటే తదనంతర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ‘పన్నులను విడతల వారీగా చెల్లించే అవకాశం కల్పించాలని వాణిజ్య సంఘాలు సూచించాయి.
దీన్ని తప్పకుండా పరిశీలిస్తాం. ఈ మేరకు తదుపరి విడత సందేహాలను నివృత్తి చేస్తూ ఆదాయపన్ను శాఖ ప్రకటన జారీ చేస్తుంది’ అని జైట్లీ చెప్పారు. ఈ పథకానికి మరింత ప్రాచుర్యం కల్పించేందుకు ఐటీ శాఖ మంగళవారం నిర్వహించిన సమావేశంలో వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్, మంత్రులు పీయూష్‌గోయెల్, ధర్మేంద్ర ప్రదాన్, జితేందర్ సింగ్ పాల్గొన్నారు.
వివరాలు గోప్యం: ‘తమ రహస్య ఆస్తుల వివరాలు వెల్లడించి వాటి విలువపై పన్నులు, జరిమానా రూపంలో 45% చెల్లించాల్సి ఉంటుంది. తమ ఆస్తులు, ఆదాయ వివరాలను బయటపెట్టిన వారి సమాచారాన్ని గోప్యంగా ఉంచుతాం. ఎవరితోనూ పంచుకోం. ఏ చట్టం కింద కూడా విచారణ చేపట్టేది లేదు. ఆదాయం ఏ రూపంలో వచ్చిందో కూడా అడగబోము’ అని జైట్లీ స్పష్టతనిచ్చారు.
నల్లధనంపై పోరాటం కష్టమే: రాహుల్‌బజాజ్
అణు సరఫరాదారుల బృందంలో భారత్‌కు సభ్యత్వం కల్పించే విషయంలో మద్దతిచ్చేందుకు స్విట్జర్లాండ్ వెనకడుగు వేసిన నేపథ్యంలో... నల్లధనం వెలికితీత అంశంలో ప్రభుత్వం ఏ విధంగా ప్రగతి సాధించగలదని బజాజ్ గ్రూప్ చైర్మన్ రాహుల్ బజాజ్ సందేహం వ్యక్తం చేశారు. విదేశాల నుంచి నల్లధనాన్ని వెనక్కి రప్పిస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తప్పిదంగా అభివర్ణించారు. ‘బిలియన్ల కొద్దీ డాలర్లను తీసుకురాలేరు. అక్కడే ఏమీ లేవు’ అని అన్నారు.