
నేడు(శుక్రవారం) దేశీ స్టాక్ మార్కెట్లు ప్రతికూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ఉదయం 8.40 ప్రాంతంలో 46 పాయింట్లు క్షీణించి 9,020 వద్ద ట్రేడవుతోంది. గురువారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ మే నెల ఫ్యూచర్స్ 9,066 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్ కదలికలను ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. బుధవారం రెండు నెలల గరిష్టాన్ని తాకిన యూఎస్ మార్కెట్లు గురువారం 0.4-1 శాతం మధ్య నీరసించాయి. చైనాతో మళ్లీ వాణిజ్య వివాదాలు చెలరేగనున్న ఆందోళనలు ఇన్వెస్టర్లను అమ్మకాలవైపు మళ్లించినట్లు నిపుణులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆసియాలోనూ అమ్మకాలదే పైచేయిగా కనిపిస్తోంది. మార్కెట్లు నేలచూపులతో కదులుతున్నాయి. దీంతో నేడు దేశీ స్టాక్ మార్కెట్లు సైతం బలహీనంగా ప్రారంభంకావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. తదుపరి యథాప్రకారం ఆటుపోట్లను చవిచూడవచ్చని భావిస్తున్నారు.
లాభాల్లో ముగిసిన మార్కెట్లు
ప్రపంచ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలతో గురువారం ఉత్సాహంగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు చివరికి ప్రస్తావించదగ్గ లాభాలతో నిలిచాయి. సెన్సెక్స్ 114 పాయింట్లు పుంజుకుని 30,933 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 40 పాయింట్లు బలపడి 9,106 వద్ద స్థిరపడింది. అమెరికా, యూరోపియన్ మార్కెట్ల ప్రోత్సాహంతో మిడ్‌సెషన్‌కల్లా సెన్సెక్స్ 370 పాయింట్లు ఎగసింది. 31,189కు చేరింది. తదుపరి కొనుగోళ్ల జోరు తగ్గడంతో 30,765వరకూ వెనకడుగు వేసింది.
నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 9,049 పాయింట్ల వద్ద, తదుపరి 8,991 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు జోరందుకుంటే..నిఫ్టీకి తొలుత 9,171 పాయింట్ల వద్ద, ఆపై 9,236 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి తొలుత 17,510 పాయింట్ల వద్ద, తదుపరి 17380 వద్దపోర్ట్ లభించవచ్చని అంచనా వేశారు.ఒకవేళ పుంజుకుంటే తొలుత 18040 పాయింట్ల వద్ద, తదుపరి 18290 స్థాయిలో రెసిస్టెన్స్ ఎదురుకావచ్చని భావిస్తున్నారు.
విక్రయాల బాటలోనే..
నగదు విభాగంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) గురువారం దాదాపు రూ. 259 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించగా.. దేశీ ఫండ్స్ (డీఐఐలు) రూ. 402 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి. బుధవారం ఎఫ్‌పీఐలు దాదాపు రూ. 1467 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు రూ. 2373 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 1328 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు రూ. 1660 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.