జీఎంఆర్ కు షాక్!
హైదరాబాద్ విమానాశ్రయంలో యూడీఎఫ్ రద్దు
ఏప్రిల్ 1 నుంచి 2016 మార్చి 31 దాకా అమలు
ఎయిర్‌పోర్ట్స్ ఎకనమిక్ రెగ్యులేటరీ అథారిటీ నిర్ణయం
ఏటా రూ. 630 కోట్ల మేర నష్టం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పారిశ్రామిక దిగ్గజం జీఎంఆర్ గ్రూప్‌నకు విమానాశ్రయాల నియంత్రణ సంస్థ ఏఈఆర్‌ఏ షాకిచ్చింది. గ్రూప్ సారథ్యంలోని హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో యూజర్ డెవలప్‌మెంట్ ఫీజులు (యూడీఎఫ్) రద్దు చేయాలని నిర్ణయించింది. ఏరోనాటికల్ టారిఫ్‌లపై సంబంధిత వర్గాలతో సంప్రదింపుల అనంతరం ఏఈఆర్‌ఏ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు ఏప్రిల్ 1 నుంచి 2016 మార్చి 31 దాకా అమల్లో ఉంటాయి. ప్రస్తుతం ఈ విమానాశ్రయం నుంచి దేశీ రూట్లలో చేసే ప్రయాణాలకు రూ. 430, విదేశీ ప్రయాణాలకు రూ. 1,700 చొప్పున ప్రయాణికుల నుంచి జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (జీహెచ్‌ఐఏఎల్) యూడీఎఫ్ కింద వసూలు చేస్తోంది. ఈ చార్జీలకు పన్నులు కూడా కలిపితే రూ. 484/1,910 దాకా అవుతోంది.
ఎయిర్‌పోర్టును అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించాలంటే ఈ ఫీజులు వసూలు చేయడం తప్పనిసరని కంపెనీ చెబుతున్నప్పటికీ.. ఈ భారీ ఫీజులపై వివిధ వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే యూడీఎఫ్‌ను ‘సున్నా’ స్థాయికి తగ్గించాలన్న ఏఈఆర్‌ఏ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు, ఏఈఆర్‌ఏ ఆదేశాలను అధ్యయనం చేస్తున్నామని, దీనిపై ప్రస్తుతం వ్యాఖ్యానించలేమని జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (జీహెచ్‌ఐఏఎల్) వర్గాలు తెలిపాయి. విమానాశ్రయాల అభివృద్ధికి చేసిన పెట్టుబడులను, నిర్వహణ వ్యయాలను రాబట్టుకునేందుకు ఎయిర్‌పోర్టు ఆపరేటింగ్ సంస్థలు.. ప్రయాణికుల నుంచి యూడీఎఫ్ వసూలు చేస్తుంటాయి. హైదరాబాద్ విమానాశ్రయంలో దిగే ప్రయాణికుల నుంచి కూడా చార్జీలు వసూలు చేయాలని కూడా జీఎంఆర్ గ్రూప్ గతంలోప్రతిపాదించినా అది సాధ్యపడలేదు.
జీహెచ్‌ఐఏఎల్‌లో జీఎంఆర్ గ్రూప్‌నకు 63%, కేంద్ర..రాష్ట్ర ప్రభుత్వాలకు చెరి 13%, మలేషియా ఎయిర్‌పోర్ట్స్ హోల్డింగ్స్‌కి 11% వాటాలు ఉన్నాయి. 2008 మార్చిలో హైదరాబాద్‌లోని శంషాబాద్‌లో ప్రారంభమైన అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 2012-13లో సుమారు 63 లక్షల మంది దేశీయ ప్రయాణికులు, 21లక్షల మంది అంతర్జాతీయ ప్రయాణికులు ప్రయాణించారు. ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో 32 లక్షల మంది దేశీ, 12 లక్షల మంది అంతర్జాతీయ ప్రయాణికులు ప్రయాణించారు. 2012-13లో యూడీఎఫ్‌ల ద్వారా సంస్థకు రూ.630 కోట్ల ఆదాయం లభించింది.