సాఫ్ట్‌బ్యాంక్‌తో భారతీ జట్టు
ఫాక్స్‌కాన్‌తో కూడా కలిసి జేవీ ఏర్పాటు సౌర విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణంపై దృష్టి
న్యూఢిల్లీ: దేశీయంగా భారీ ఎత్తున సౌర విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేసే దిశగా టెలికం దిగ్గజం భారతీ ఎంటర్‌ప్రైజెస్, జపాన్‌కి చెందిన సాఫ్ట్‌బ్యాంక్ కార్పొరేషన్, తైవాన్ సంస్థ ఫాక్స్‌కాన్‌తో చేతులు కలిపింది. ఈ జాయింట్ వెంచర్ సంస్థ ఎస్‌బీజీ క్లీన్‌టెక్ ...సౌర విద్యుత్ రంగంలో దాదాపు 20 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనుంది. భారత్‌లో 20 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులను నిర్మించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందులో సాఫ్ట్‌బ్యాంక్‌కు మెజారిటీ వాటాలు ఉంటాయి. భారతీ ఎంటర్‌ప్రైజెస్, ఫాక్స్‌కాన్ సంస్థలకు మైనారిటీ వాటాలు ఉంటాయి. సౌర ప్రాజెక్టులకు అవసరమైన యంత్రపరికరాల తయారీలో ఫాక్స్‌కాన్ సహకారం అందిస్తుందని సాఫ్ట్‌బ్యాంక్ సీఈవో మసయోషి సన్ తెలిపారు.
భారత్‌లోనే వీటి తయారీ చేపట్టాలని యోచిస్తున్నట్లు ఆయన వివరించారు. జపాన్‌తో పోలిస్తే భారత్‌లో రెండింతల సూర్య రశ్మి ఉంటుందని, సోలార్ పార్క్ ఏర్పాటు వ్యయాలు దాదాపు సగమే ఉంటాయని ఆయన తెలిపారు. జాయింట్ వెంచర్ కంపెనీకి మనోజ్ కొహ్లి ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గాను, రామన్ నందా సీఈవోగాను వ్యవహరిస్తారని భారతీ ఎంటర్‌ప్రైజెస్ చైర్మన్ సునీల్ మిట్టల్ తెలిపారు. మరోవైపు, మసయోషి సన్, సునీల్ మిట్టల్‌తో కలిసి జపాన్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ సీనియర్ ఎండీ తదాషి మెయిడా .. ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. భారత్‌లో పునరుత్పాదక విద్యుత్ రంగంలో ఇన్వెస్ట్ చేయడంపై వారు చర్చించినట్లు ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.