స్టీవ్ జాబ్స్‌తో మా జాబులు గల్లంతు...
స్టాక్‌హోం: ఆపిల్ వ్యవస్థాపకుడు దివంగత స్టీవ్ జాబ్స్‌పై ఫిన్లాండ్ ప్రధాని అలెగ్జాండర్ స్టబ్ అక్కసు వెళ్లగక్కారు. స్టీవ్ జాబ్స్ కొత్త టెక్నాలజీలను అభివృద్ధి చేసి విక్రయించడం వల్లే తమ దేశంలో పలువురు ఉద్యోగాలు కోల్పోయారనీ, ఫిన్లాండ్ కంపెనీలు ఆత్మరక్షణలో పడిపోయాయనీ చెప్పారు. ‘మా ఆర్థిక వ్యవస్థ ఐటీ, పేపర్ అనే రెండు దిమ్మెలపై నిలబడి ఉండేది.
ఐఫోన్ రాకతో నోకియా (ఫిన్లాండ్ కంపెనీ) సంక్షోభంలో పడిపోయింది. ఐప్యాడ్ ప్రవేశంతో పేపరు వినియోగం క్షీణించింది..’ అని ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్టబ్ వ్యాఖ్యానించారు. మొబైల్ పరికరాల ఉత్పత్తిలో ఒకనాడు ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచిన నోకియా సంక్షోభంలో చిక్కుకోవడంతో ఫిన్లాండ్‌కు కష్టాలు మొదలయ్యాయి. హ్యాండ్‌సెట్ల వ్యాపారాన్ని నోకియా గత ఏప్రిల్‌లో అమెరికాకు చెందిన సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌కు విక్రయించింది. రెండేళ్లు పీడించిన ఆర్థిక మాంద్యం నుంచి గట్టెక్కేందుకు ఫిన్లాండ్ అష్టకష్టాలు పడుతోంది. ఈ నేపథ్యంలోనే స్టబ్ గత నెలాఖరులో ఆ దేశ ప్రధానమంత్రి అయ్యారు.
‘మార్పు ఇప్పుడే మొదలైంది. మా ఐటీ పరిశ్రమ గేమింగ్ వైపు మళ్లుతోంది.. అడవులు కాగితం ఉత్పత్తి కేంద్రాలుగా కాకుండా బయోఎనర్జీ సెంటర్లుగా ఆవిర్భవిస్తున్నాయి. దేశం వెంటనే ఆర్థికాభివృద్ధి సాధిస్తుందని నేను చెప్పలేను. జాతీయ స్థాయిలో సంస్థాగత సవరణలు, ఈయూ మార్కెట్ సరళీకరణ, ప్రపంచస్థాయిలో వ్యాపారాన్ని పెంచుకోవడం అనే మూడు చర్యలతో అభివృద్ధిని వేగవంతం చేయవచ్చు...’ అని ఆయన పేర్కొన్నారు.