భారీ నష్టాల పరంపరలో మంగళవారం స్టాక్ మార్కెట్‌కు ఒకింత ఊరట లభించింది. కోవిడ్–19 (కరోనా)వైరస్ కల్లోలానికి అతలాకుతలమవుతున్న ఆర్థిక వ్యవస్థను గాడిన పడేసేందుకు అమెరికా ఫెడరల్ రిజర్వ్ భారీ ప్యాకేజీని ప్రకటించడం ప్రపంచ మార్కెట్లను లాభాల బాట పట్టించింది. మన దేశంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఉద్దీపన చర్యలు చేపట్టగలదన్న ఆశలతో సెన్సెక్స్, నిఫ్టీలు లాభపడ్డాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 26 పైసలు మేర పుంజుకోవడం (ఇంట్రాడేలో) సానుకూల ప్రభావం చూపించింది. అయితే ట్రేడింగ్ ఆద్యంతం ఒడిదుడుకులమయంగానే సాగింది. ఉద్దీపన ప్యాకేజీ కసరత్తు దశలోనే ఉందని ఆర్థిక మంత్రి వెల్లడించడంతో లాభాలు కొంతమేర తగ్గాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 693 పాయింట్ల లాభంతో 26,674 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 191 పాయింట్లు పెరిగి 7,801 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్ 2.67 శాతం, నిఫ్టీ 2.51 శాతం చొప్పున లాభపడ్డాయి.
ఫెడ్ ‘అపరిమిత’ ప్యాకేజీ...
కోవిడ్–19 (కరోనా)వైరస్ ధాటికి విలవిల్లాడుతున్న ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు భారీ ప్యాకేజీని అమెరికా ఫెడరల్ రిజర్వ్ ప్రకటించింది. ఎలాంటి పరిమితులు లేకుండా బాండ్లను, సెక్యూరిటీలను కొనుగోళ్లు చేయడం, కంపెనీలకు నేరుగా రుణాలివ్వడం తదితర చర్యలను ఫెడ్ తీసుకోనున్నది. దీంతో ఆసియా మార్కెట్లు పెరిగాయి. ఈ జోష్‌తో మన మార్కెట్ కూడా భారీ లాభాలతోనే ఆరంభమైంది. సెన్సెక్స్ 1,075 పాయింట్లు, నిఫ్టీ 238 పాయింట్ల లాభాలతో ఆరంభమయ్యాయి.
ఇంట్రాడేలో సెన్సెక్స్ 1,482 పాయింట్లు, నిఫ్టీ 427 పాయింట్ల మేర లాభపడ్డాయి. మరో దశలో సెన్సెక్స్ 342 పాయింట్లు, నిఫ్టీ 99 పాయింట్ల మేర నష్టపోయాయి. మొత్తం మీద సెన్సెక్స్ 1,824 పాయింట్లు, నిఫ్టీ 526 పాయింట్ల రేంజ్‌లో కదలాడాయి. ఉద్దీపన చర్యలు ఇంకా కసరత్తు దశలోనే ఉన్నాయని ఆర్థిక మంత్రి ప్రకటించడంతో ఆరంభ లాభాలు చివరి కంటా కొనసాగలేదు.
►ప్రజా వేగు కేసు విషయంలో ఇన్ఫోసిస్ కంపెనీకి అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్చంజెస్ కమిషన్ (ఎస్‌ఈసీ) క్లీన్ చిట్ ఇచ్చింది. దీంతో ఈ షేర్ 12.6% లాభంతో రూ.594 వద్ద ముగిసింది. గత ఏడేళ్లలో ఈ షేర్ ఒక్క రోజులో ఈ స్థాయిలో లాభపడటం ఇదే మొదటిసారి. కాగా సెన్సెక్స్ లాభంలో ఈ షేర్ వాటా మూడో వంతు ఉండటం విశేషం. మొత్తం 693 పాయింట్ల సెన్సెక్స్ లాభం లో ఈ షేర్ వాటా 237 పాయింట్ల మేర ఉంది.
►దేశీయంగా విమాన సర్వీసులను ఈ నెల 25 వరకూ రద్దు చేయడంతో విమానయాన కంపెనీల షేర్లు మిశ్రమంగా ముగిశాయి. ఇంట్రాడేలో 10 శాతం మేర నష్టపోయిన ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ (ఇండిగో) చివరకు 8 శాతం లాభంతో రూ.919 వద్ద ముగిసింది. ఇక స్పైస్‌జెట్ షేర్ 3 శాతం నష్టంతో రూ.32 వద్దకు చేరింది.
►స్టాక్ మార్కెట్ లాభపడినప్పటికీ, వెయ్యికి పైగా షేర్లు ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. బజాజ్ ఫిన్‌సర్వ్, మారుతీ సుజుకీ, టీటీకే ప్రెస్టీజ్, బాష్, వాబ్‌కో ఇండియా, ఎమ్‌ఆర్‌ఎఫ్, పేజ్ ఇండస్ట్రీస్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.
►450కు పైగా షేర్లు లోయర్ సర్క్యూట్లను తాకాయి. ఫ్యూచర్ రిటైల్, పీఎన్‌బీ హౌసింగ్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, క్వెస్ కార్ప్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.
►ఐఆర్‌సీటీసీ షేర్ వరుసగా ఏడో రోజూ నష్టపోయింది. మంగళవారం ఈ షేర్ 5 శాతం నష్టంతో రూ.858.50 వద్దకు చేరింది.
ఒడిదుడుకులు తప్పవు...
కేంద్రం ఉద్దీపన చర్యలను ప్రకటించేదాకా, ఆర్‌బీఐ రేట్లను తగ్గించేదాకా మార్కెట్లో ఒడిదుడుకులు తప్పవని నిపుణులంటున్నారు. ఇక భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 500కు, మరణాల సంఖ్య 10కి చేరాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 3.80,000కు, మరణాలు 16,500కు పెరిగాయి. ఇక ఆసియా మార్కెట్లు 1–9 శాతం రేంజ్‌లో, యూరప్ మార్కెట్లు 5–8 శాతం రేంజ్‌లో లాభపడ్డాయి.
రూ.1.82 లక్షల కోట్లు
పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
స్టాక్ మార్కెట్ లాభపడటంతో ఇన్వెస్టర్ల సంపద రూ.1.82 లక్షల కోట్లు పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,82,770 కోట్లు పెరిగి రూ.103.69 లక్షల కోట్లకు పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment