కరోనా వైరస్ కల్లోలం స్టాక్ మార్కెట్‌ను అతలాకుతలం చేసింది. ఈ ఏడాది మార్చిలో సెన్సెక్స్, నిఫ్టీలే కాకుండా పలు బ్లూచిప్ షేర్లు కూడా పాతాళానికి పడిపోయాయి. అయితే లాక్‌డౌన్‌ను దశలవారీగా తొలగిస్తుండటంతో ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా పుంజుకుంటున్నాయి. అంతకంటే వేగంగా స్టాక్ మార్కెట్ రికవరీ అవుతోంది. వాస్తవ ఆర్థిక స్థితిగతులు ఏమంత మెరుగుపడకపోయినా, ప్రపంచవ్యాప్తంగా నిధుల వరద పారుతుండటం వల్ల కూడా స్టాక్ మార్కెట్ పెరుగుతోంది. దీంతో పలు కంపెనీలు రైట్స్ ఇష్యూలు, క్యూఐపీల ద్వారా నిధులను సమీకరిస్తున్నాయి. అయితే ప్రైమరీ మార్కెట్లో సెంటిమెంట్ సరిగ్గా లేకపోవడంతో కంపెనీలు ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు వచ్చే ధైర్యం సెప్టెంబర్ వరకూ చేయలేకపోయాయి.
ఈ నెలలో ఇప్పటివరకూ రెండు కంపెనీలు–హ్యాప్పియెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్, రూట్ మొబైల్స్ ఐపీఓ వచ్చాయి. వీటికి మంచి స్పందన లభించింది. హ్యాప్పియెస్ట్ మైండ్స్ ఇష్యూ 151 రెట్లు, రూట్ మొబైల్స్ ఇష్యూ 74 రెట్ల మేర ఓవర్ సబ్‌స్క్రైబయ్యాయి. ఇక వచ్చే వారం మరో రెండు కంపెనీలు–కంప్యూటర్ ఏజ్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ (క్యామ్స్), కెమ్‌కాన్ స్పెషాల్టీ కెమికల్స్ ఐపీఓలు రానున్నాయి. వీటి గ్రే మార్కెట్ ›ప్రీమియమ్ ఇప్పటికే 20 శాతానికి మించి ఉండటంతో వీటికి కూడా మంచి స్పందనే లభించగలదని నిపుణులు భావిస్తున్నారు.
గత ఏడాది 11... ఈ ఏడాది 5 మాత్రమే...
ఈ ఏడాది ఇప్పటివరకూ కేవలం ఐదు ఐపీఓలు మాత్రమే వచ్చాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాది మార్చిలో ఎస్‌బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్, ఆ తర్వాత రోసారి బయో టెక్‌లు ఐపీఓకు రాగా, జూలైలో మైండ్‌స్పేస్ పార్క్స్ రీట్ ఐపీఓ ద్వారా రూ.4,500 కోట్లు సమీకరించింది. హ్యాప్పియెస్ట్ మైండ్స్, రూట్ మొబైల్స్ ఐపీఓలు ఇటీవలే పూర్తయ్యాయి. కాగా గత ఏడాది ఇదే కాలానికి 11 కంపెనీలు ఐపీఓకు వచ్చాయి. ఇక ఈ ఏడాది కనీసం మరో ఐదు కంపెనీలు ఐపీఓకు వస్తాయని, రూ.10,000–24,000 కోట్ల రేంజ్‌లో నిధులు సమీకరిస్తాయని అంచనా. పరిస్థితులు బాగా ఉంటే ఈ ఐదు కాక లోధా డెవలపర్స్, బార్బిక్యూ నేషన్, బర్గర్ కింగ్, నేషనల్ కమోడిటీ అండ్ డెరివేటివ్స్ ఎక్సే్చంజ్(ఎన్‌సీడీఈఎక్స్), మాంటేకార్లో, హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ కంపెనీ, ఈజ్ మై ట్రిప్, బజాజ్ ఎనర్జీ త దితర కంపెనీల ఐపీఓలు కూడా వచ్చే అవకాశాలున్నాయి.
ఆకర్షణ కొనసాగుతుంది..
ఐపీఓల ఆకర్షణ కొనసాగుతుందని క్యాపిటల్ వయా గ్లోబల్ రీసెర్చ్ అనలిస్ట్ గౌరవ్ గార్గ్ అంచనా వేస్తున్నారు. ఇటీవల ఐపీఓలకు మంచి స్పందన లభిస్తోందని, కరోనా వైరస్ కల్లోలం అనంతరం సెంటిమెంట్ ఇప్పుడిప్పుడే మెరుగుపడుతోందని, మార్కెట్ పుంజుకుంటోందని పేర్కొన్నారు. కాగా మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నుంచి ఇప్పటికే దాదాపు 30–34 కంపెనీలు ఐపీఓలకు అనుమతులు పొందాయని, ఈ ఐపీఓల విలువ రూ.35,000 కోట్ల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా. మార్కెట్ జోరు కొనసాగుతున్నా, లేదా నిలకడగా ఉన్నా, ఐపీఓల జోరు పెరుగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఏ ఐపీఓలకు డిమాండ్ ఉంటుందంటే..!
రిటైల్, ఐటీ, ఫార్మా, స్పెషాల్టీ కెమికల్, ఫిన్‌టెక్, కన్సూమర్ టెక్నాలజీ రంగాల్లో కంపెనీల ఐపీఓలకు మంచి డిమాండ్ ఉందని నిపుణులంటున్నారు. లాభదాయకత మంచిగా ఉన్న కంపెనీలకు, పటిష్టమైన ఆర్థిక మూలాలు, మంచి బ్రాండ్ వేల్యూ ఉన్న కంపెనీల ఐపీఓలకు కూడా మంచి డిమాండ్ ఉందని వారంటున్నారు. సరైన ధర, వేల్యుయేషన్‌లు ఉన్న కంపెనీల ఐపీఓలకు దరఖాస్తు చేయడానికి కొత్త ఇన్వెస్టర్లు కూడా సిద్ధంగా ఉన్నారని విశ్లేషకుల అంచనా. లిస్టింగ్ లాభాల కోసం ఏ ఐపీఓ వస్తే, ఆ ఐపీఓకు అప్లయి చేస్తున్నారని, అలా కాకుండా ఫండమెంటల్స్ పటిష్టంగా ఉన్న ఐపీఓలకే దరఖాస్తు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
వచ్చే వారం రెండు ఐపీఓలు
కంప్యూటర్ ఏజ్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ (క్యామ్స్) కంపెనీ ఐపీఓ ఈ నెల 21న ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. అదే రోజు ఫార్మా కెమికల్స్ తయారు చేసే కెమ్‌కాన్ స్పెషాల్టీ కెమికల్స్ ఐపీఓ కూడా వస్తుందని సమాచారం. ఈ రెండు ఐపీఓలు ఈ నెల 23న ముగుస్తాయి. ఈ నెలలో ఇప్పటికే రెండు ఐపీఓలు (హ్యాప్పియెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్, రూట్ మొబైల్)రాగా, వచ్చే వారంలో ఈ రెండు ఐపీఓలు రానున్నాయి. మర్చంట్ బ్యాంకర్ల సమాచారం ప్రకారం..
క్యామ్స్ ఐపీఓ ఎట్ రూ. 2,250 కోట్లు
ఐపీఓలో భాగంగా 1.82 కోట్ల ఈక్విటీ షేర్లను ఆఫర్–ఫర్–సేల్(ఓఎఫ్‌ఎస్) మార్గంలో విక్రయిస్తారు. ఇష్యూ సైజు రూ.2,250 కోట్ల రేంజ్‌లో ఉండొచ్చు. ఈ ఐపీఓకు ప్రైస్‌బ్యాండ్ రూ.1,245–1,250 రేంజ్‌లో ఉండే అవకాశాలున్నాయి. కనీసం 12 షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అక్టోబర్ 1న ఈ షేర్లు స్టాక్ మార్కెట్లో లిస్టవుతాయి.
కెమ్‌కాన్ స్పెషాల్టీ కెమికల్స్
రూ.175 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయనున్నది. ఓఎఫ్‌ఎస్ మార్గంలో మరో 43 లక్షల షేర్లను విక్రయిస్తారు. మొత్తం మీద ఇష్యూ సైజు రూ. 300 కోట్ల రేంజ్‌లో ఉండొచ్చు. ప్రైస్‌బ్యాండ్ రూ.295–300 రేంజ్‌లో ఉండే అవకాశాలున్నాయి. కనీసం 50 షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఈ షేర్లు కూడా అక్టోబర్ 1వ తేదీనే స్టాక్ మార్కెట్లో లిస్టవుతాయి.
Comments
Please login to add a commentAdd a comment