ఒడిదుడుకుల వారం | stock market up and downs this week for derivatives contract closed | Sakshi
Sakshi News home page

ఒడిదుడుకుల వారం

Published Mon, Dec 26 2016 1:27 AM | Last Updated on Mon, Sep 4 2017 11:35 PM

ఒడిదుడుకుల వారం

ఒడిదుడుకుల వారం

ఈవారంలోనే డెరివేటివ్స్‌ కాంట్రాక్టుల ముగింపు
సెలవుల కారణంగా స్వల్పంగా విదేశీ ఇన్వెస్టర్ల లావాదేవీలు
రేంజ్‌బౌండ్‌లోనే స్టాక్‌ సూచీలు
నిపుణుల అంచనాలు


న్యూఢిల్లీ: డిసెంబర్‌ సిరీస్‌ డెరివేటివ్‌ కాంట్రాక్టులు ఈ వారమే ముగియనున్నందున ఈ వారం స్టాక్‌ మార్కెట్‌ ఒడిదుడుకులమయంగా ఉంటుందని నిపుణుల అంచనా. అంతర్జాతీయ స్టాక్‌ మార్కెట్ల పోకడలు, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల గమనం, డాలర్‌తో రూపాయి మారకం కదలికలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల పోకడలు, జీఎస్‌టీకి అవరోధాలు తొలగించడానికి ప్రభుత్వం తీసుకునే చర్యలు...తదితర అంశాల ప్రభావం కూడా స్టాక్‌ మార్కెట్‌పై ఉంటుందని వారంటున్నారు.

కొంత రికవరీ.
అంతర్జాతీయంగా, దేశీయంగా ప్రధాన ఆర్థిక సంఘటనలేమీ లేకపోవడం వల్ల స్టాక్‌ మార్కెట్‌ స్వల్పకదలికలకే పరిమితం కానున్నదని మార్కెట్‌ విశ్లేషకులంటున్నారు. ఈ నెల 31 తర్వాత నగదు కొరత కొంత తగ్గే అవకాశాలున్నాయని, అందుకని స్వల్పకాలంలో ఈక్విటీ మార్కెట్లు రికవరీ కావచ్చని కొందరు నిపుణులు భావిస్తున్నారు. కొత్త సంవత్సర సెలవుల సందర్భంగా విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల ఒత్తిడి ఒకింత తగ్గవచ్చని అమ్రపాలి ఆధ్య ట్రేడింగ్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ డైరెక్టర్‌ అభ్నిష్‌ కుమార్‌ సుధాంశు అంచనా వేస్తున్నారు. అమెరికా నిరుద్యోగ గణాంకాలు, ముడిచమురు నిల్వల గణాంకాలు ఈ వారమే విడుదలవుతాయని, ఈ గణాంకాలు మన మార్కెట్‌ గమనానికి కీలకం కానున్నాయని క్యాపిటల్‌వయా గ్లోబల్‌ రీసెర్చ్‌ సీఈఓ రోహిత్‌ గాడియా పేర్కొన్నారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కీలకమైన 8,000 పాయింట్ల పైకి రావడానికి కష్టపడుతోందని, 8,000 పాయింట్లను మించలేకపోతే, మరింత పతనం తప్పదని పేర్కొన్నారు. ప్రస్తుతానికైతే ఇన్వెస్టర్లు ట్రేడింగ్‌కు ఒకింత దూరంగా ఉండడమే మంచిదని ఏంజెల్‌ బ్రోకింగ్‌ సంస్థ పేర్కొంది.

షార్ట్‌ కవరింగ్‌..
సంవత్సరాంతం సందర్బంగా మిడ్‌క్యాప్‌ షేర్లలో కదలికలు ఉంటాయని కోటక్‌ సెక్యూరిటీస్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ దీపేన్‌  షా పేర్కొన్నారు. స్వల్పకాలంలో కొంత స్తబ్దత ఉన్నా, మధ్య కాలానికి, దీర్ఘకాలానికి భారత స్టాక్‌ మార్కెట్‌ ఆశావహంగానే ఉందని ఎస్‌ఎంసీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ అండ్‌ అడ్వైజర్స్‌ సీఎండీ డి.కె. అగర్వాల్‌ చెప్పారు. అందుకని దీర్ఘకాలం లక్ష్యంగా ఇన్వెస్ట్‌చేసే ఇన్వెస్టర్లు భవిష్యత్తులో మంచి వృద్ధి సాధించే రంగాల్లోని కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేయవచ్చని ఆయన సూచిస్తున్నారు. దిగువ స్థాయిల్లో షార్ట్‌ కవరింగ్‌  కారణంగా స్టాక్‌ మార్కెట్లో ఒడిదుడుకులు ఉంటాయని ట్రేడ్‌బుల్స్‌ సీఓఓ ధ్రువ్‌  దేశాయ్‌ చెప్పారు.

జోరుగా ‘విదేశీ’ నిధులు వెనక్కి...
అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ రేట్ల పెంపు నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు ఈ నెలలో మన క్యాపిటల్‌ మార్కెట్‌నుంచి 350 కోట్ల డాలర్ల మేరకు పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. వీటిల్లో అధిక భాగం డెట్‌మార్కెట్‌ నుంచి ఉపసంహరించుకున్న పెట్టుబడులు ఉన్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు ఇప్పటిదాకా ఈ నెలలో ఈక్విటీ మార్కెట్ల నుంచి రూ.3,744 కోట్లు, డెట్‌ మార్కెట్‌నుంచి రూ.19,027 కోట్ల చొప్పున తమ పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. వెరశి ఈ నెలలో మన క్యాపిటల్‌ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు రూ.22,771 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. కాగా ఈ ఏడాది ఇప్పటిదాకా విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీల్లో నికరంగా రూ.24,998 కోట్లు పెట్టుబడులు పెట్టగా, డెట్‌  మార్కెట్‌ నుంచి రూ.43,737 కోట్లు వెనక్కి తీసుకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement