సాక్షి, ముంబై: రిజర్వ్ బ్యాంక్ పాలసీ రివ్యూతో మార్కెట్లు పాజిటివ్‌గా స్పందిస్తున్నాయి. ఆరంభంనుంచీ పాజిటివ్‌గా కీలక సూచీలు కీలక వడ్డీరేట్లను యథాతథంగాఉంచడంతో మరింత పుంజుకున్నాయి. సెన్సెక్స్ 552 పాయింట్లకు పైగా పుంజుకోని 33,571 వద్ద, నిఫ్టీ 180 పాయింట్లు ఎగిసి 10,308 వద్ద ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. దాదాపు అన్ని రంగాలు లాభాల్లోనే. ముఖ్యంగా ప్రభుత్వ, ప్రయివేటు రంగ బ్యాంకుల షేర్లలో జోష్ నెలకొంది. నిఫ్టీ బ్యాంకు కూడా 500పాయింట్లకు పైగా ఎగిసింది. ఇంకా మెటల్, రియల్టీ, ఆటో లాభాల్లో కొనసాగుతున్నాయి. టాటా మోటార్స్, టాటా స్టీల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసిఐసిఐ బ్యాంక్, హీరో మోటో కార్ప్ టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. అటు అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు కూడా బలాన్నిచ్చాయి.
కాగా ఆర్‌బీఐగవర్నర్ ఊర్జిత్ పటేల్ అధ్యక్షతన రెండు రోజులపాటు పరపతి విధానాలను సమీక్షించిన మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) యథాతథ విధానాల అమలుకే ఓటు వేసింది. దీంతో వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటు 6 శాతంగా కొనసాగనుంది. అలాగే ఆర్‌బీఐ వద్ద బ్యాంకులు చేసే డిపాజిట్లపై లభించే వడ్డీ రేటు రివర్స్ రెపో సైతం 5.75 శాతంగా ఉంది. కాగా.. బ్యాంక్ రేటు 6.25 శాతంగా ఉంది. దీంతోపాటు తొలి క్వార్టర్‌లో వినియోగ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) 4.4 శాతం నుంచి 5.1 శాతానికి పుంజుకుంటుందని ఆర్‌బీఐ అంచనా వేసింది. కాగా.. 2018-19లో రియల్ జీడీపీ వృద్ధి 7.4 శాతంగా నమోదుకావచ్చని విశ్లేషించింది.
Comments
Please login to add a commentAdd a comment