బుల్.. ధనాధన్! | Stocks hit new record. Happy Halloween! | Sakshi
Sakshi News home page

బుల్.. ధనాధన్!

Published Sat, Nov 1 2014 12:54 AM | Last Updated on Thu, Apr 4 2019 3:49 PM

బుల్.. ధనాధన్! - Sakshi

బుల్.. ధనాధన్!

స్టాక్ మార్కెట్ విలువ రూ. 97 లక్షల కోట్లు
ఒక్క రోజులో రూ. 1.5 లక్షల కోట్లు ప్లస్
అమెరికా ఆర్థిక పురోభివృద్ధి, జపాన్ సహాయక ప్యాకేజీ పెంపు, నరేంద్ర మోదీ సంస్కరణలు ఉన్నట్టుండి మార్కెట్లను లాభాల దౌడు తీయించాయి. దీంతో ఇటీవలలేని విధంగా సెన్సెక్స్ 520 పాయింట్లు జంప్ చేసింది. 27,866 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ సైతం 153 పాయింట్లు ఎగసి 8,322 వద్ద నిలిచింది. ఇవి మార్కెట్ చరిత్రలో సరికొత్త గరిష్టాలుకాగా,
 ఒక్క రోజులో ఇన్వెస్టర్ల సంపద రూ. 1.5 లక్షల కోట్లమేర ఎగసింది.

 
కొత్త ఆల్‌టైమ్ గరిష్టానికి స్టాక్ మార్కెట్
* సెన్సెక్స్ 519 పాయింట్ల హైజంప్.. 27,866 వద్ద క్లోజ్
* 153 పాయింట్లు ఎగసిన నిఫ్టీ.. 8,322 వద్ద ముగింపు
* అమెరికా ఆర్థిక రికవరీతో ఐటీ షేర్లు కళకళ...

ప్రపంచ స్టాక్ మార్కెట్ల ర్యాలీకితోడు, మోదీ ప్రభుత్వం మరిన్ని సంస్కరణలు ప్రవేశపెడుతుందన్న అంచనాలు సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చాయి. ఈ ఏడాది ద్వితీయార్థంలో దేశ ఆర్థిక వ్యవస్థ మరింత పుంజుకుంటుందన్న ఆశలు ఇందుకు జత కలిశాయి. మరోవైపు చమురు ధరలు మరింత దిగిరావడంతో ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుందని, దీంతో రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్ల తగ్గింపువైపు దృష్టిపెట్టే అవకాశముందన్న అంచనాలు బలపడ్డాయి. వీటికితోడు గత నెలలో నెమ్మదించిన విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్‌ఐఐలు) మళ్లీ పెట్టుబడులకు దిగుతుండటం కూడా ట్రేడర్లకు ప్రోత్సాహాన్నిచ్చింది. దీంతో ఇంట్రాడేలో సెన్సెక్స్ 27,894, నిఫ్టీ 8,331కు చేరాయి. బీఎస్‌ఈలో వినియోగ వస్తు రంగం మినహా అన్ని రంగాలూ 0.5-2.7% మధ్య పురోగమించాయి.  
 
ఏం జరిగింది?
అమెరికా ఫెడరల్ రిజర్వ్ సహాయక ప్యాకేజీలను నిలిపివేసినప్పటికీ వడ్డీ రేట్లను మరికొంతకాలం నామమాత్ర స్థాయిలోనే కొనసాగించేందుకు నిర్ణయించడం వర్ధమాన మార్కెట్లకు ఊపునిచ్చింది. అమెరికా జీడీపీ సెప్టెంబర్‌తో ముగిసిన క్యూ3లో అంచనాలను మించుతూ 3.5% జంప్‌చేయడం దీనికి జత కలిసింది. మరోపక్క ఇప్పటికే అమలు చేస్తున్న సహాయక ప్యాకేజీని మరింత పెంచేందుకు నిర్ణయించడం ద్వారా జపాన్ ప్రభుత్వం మరింత సానుకూలతకు మార్గం వేసింది. మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థకు దన్నుగా జపాన్ కేంద్ర బ్యాంకు బాండ్ల కొనుగోలు ద్వారా 50 లక్షల కోట్ల యెన్‌లను వ్యవస్థలోకి విడుదల చేస్తోంది. అయితే ఉన్నట్టుండి ఈ ప్యాకేజీని మరో 30 లక్షల కోట్లమేర పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

ఫలితంగా ఏడాదికి 80 లక్షల కోట్ల యెన్‌లను(725 బిలియన్ డాలర్లు) వ్యవస్థకు అందించనుంది. అంటే నెలకు 60 బిలియన్ డాలర్లకుపైగా(రూ. 3,60,000 కోట్లు) విడుదల చేయ నుంది. ఈ నిధులు ఇండియావంటి వర్ధమాన మార్కెట్లకు ప్రవహిస్తాయన్న అంచనాలు అటు ఆసియా, ఇటు ఇండియా మార్కెట్లకు ప్రోత్సాహాన్నిచ్చాయి. ఆసియా ఇండెక్స్‌లలో జపాన్ సూచీ అత్యధికంగా 5 శాతం జంప్‌చేయగా, దక్షిణ కొరియా, హాంకాంగ్, చైనా, తైవాన్, సింగపూర్ 0.5-1 శాతం మధ్య బలపడ్డాయి. ఇక యూరోపియన్ మార్కెట్లు యూకే, ఫ్రాన్స్, జర్మనీ సైతం 1.5% స్థాయిలో లాభపడ్డాయి.
   
మరిన్ని విశేషాలివీ...
బ్లూచిప్స్‌లో హెచ్‌డీఎఫ్‌సీ, గెయిల్, ఎల్‌అండ్‌టీ, టాటా పవర్, టాటా స్టీల్, మారుతి, సిప్లా, కోల్ ఇండియా, ఎస్‌బీఐ, ఓఎన్‌జీసీ, డాక్టర్ రెడ్డీస్, ఆర్‌ఐఎల్, యాక్సిస్ బ్యాంక్, సన్ ఫార్మా 4-2% మధ్య పుంజుకున్నాయి.
అమెరికాపై ఆశలతో ఐటీ దిగ్గజాలు పెర్సిస్టెంట్ సిస్టమ్స్, ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, ఒరాకిల్, టెక్ మహీంద్రా 4-1.5% మధ్య ఎగశాయి.
సెన్సెక్స్ దిగ్గజాలలో కేవలం భారతీ ఎయిర్‌టెల్ నష్టపోయింది. 2.3% క్షీణించి రూ. 398 వద్ద ముగిసింది.
బీఎస్‌ఈ-500లో కన్‌స్ట్రక్షన్ షేర్లు భారీగా ఎగశాయి. ఎన్‌సీసీ, హెచ్‌సీసీ, ఐవీఆర్‌సీఎల్ ఇన్‌ఫ్రా, జీవీకే పవర్, ఎన్‌బీసీసీ, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ట్రాన్స్‌పోర్ట్, రిలయన్స్ ఇన్‌ఫ్రా 13-7% మధ్య దూసుకెళ్లాయి.
గురువారం రూ. 1,257 కోట్లు ఇన్వెస్ట్‌చేసిన ఎఫ్‌ఐఐలు తాజాగా మరో రూ. 1,755 కోట్ల  షేర్లను కొన్నారు.
మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు 1% చొప్పున బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,788 పెరిగితే, 1,207 నష్టపోయాయి.
శుక్రవారం ఎన్‌ఎస్‌ఈ ప్రధాన సూచీ నిఫ్టీ తొలుత 8,200 పాయింట్ల మైలురాయిని చేరుకున్నాక మళ్లీ ఐదు గంటల్లోనే(ఒకే రోజులో) 8,300 పాయింట్ల కొత్త శిఖరాన్ని చేరడం విశేషం!
స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లో ఆన్‌మొబైల్, ఐఎఫ్‌బీ ఇండస్ట్రీస్, నహర్ స్పిన్నింగ్, వీఎస్‌టీ టిల్లర్స్, సింప్లెక్స్ ఇన్‌ఫ్రా, అతుల్ ఆటో, జ్యోతీ స్ట్రక్చర్స్, గ్యామన్ ఇన్‌ఫ్రా 19-8% మధ్య జంప్ చేశాయి.
వరుసగా నాలుగో రోజు మార్కెట్లు లాభపడ్డాయి. 4రోజుల్లో సెన్సెక్స్ 1,100 పాయింట్లకుపైగా ఎగసింది.!

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement