పవర్ గ్రిడ్ - కొనొచ్చు
బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్; ప్రస్తుత ధర: రూ.206; టార్గెట్ ధర: రూ.287
ఎందుకంటే: పవర్ గ్రిడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు దాదాపు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. నికర లాభం 5 శాతం వృద్ధితో రూ.2,000 కోట్లకు పెరిగింది. వేతనాల పెంపు, రూ.83 కోట్ల మేర కంపెనీ సామాజిక బాధ్యత(సీఎస్‌ఆర్) వ్యయాలు, రూ.66 కోట్ల మేర తుది టారిఫ్‌ల అడ్జెస్ట్‌మెంట్స్.. ఈ అంశాలన్నీ నికర లాభంపై ప్రతికూల ప్రభావం చూపాయి. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, గత ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 10 శాతం వృద్ధితో రూ.8,230 కోట్లకు పెరిగింది.
సర్‌చార్జీ ఆదాయం తక్కువగా ఉండటం, రూ.230 కోట్ల వేతన సవరణ భారం, తుది టారిఫ్‌ల అడ్జెస్ట్‌మెంట్ భారం రూ.200 కోట్ల మేర ఉండటంతో నికర లాభం అంచనాలను అందుకోలేకపోయింది. ఈ కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలో నికర లాభంలో 17 శాతం వృద్ధి సాధించగలదని అంచనా వేశాం. గత ఆర్థిక సంవత్సరంలో దీర్ఘకాలంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్ట్‌లను పూర్తి చేసింది. అంతే కాకుండా రూ.6,000–7,000 కోట్ల విలువైన 13 ప్రాజెక్ట్‌లను కూడా పూర్తి చేసింది.
ఈ రంగంలో ఉన్న ఇతర కంపెనీలతో పోల్చితే ఈ కంపెనీయే వేగంగా ప్రాజెక్ట్‌లను పూర్తి చేస్తోంది. టవర్లను టెలికం సర్వీస్‌లకు వినియోగించే ప్రయోగం విజయవంతమైంది. దీనిని పూర్తి స్థాయిలో అమలు చేయడానికి ప్రభుత్వం ఆమోదం కోసం ఎదురు చూస్తోంది. సిగ్నలింగ్ వర్క్ కోసం భారత రైల్వేలతో చర్చలు జరుపుతోంది. ఈ రంగంలో రూ.80,000 కోట్ల మేర వ్యాపార అవకాశాలను ఈ కంపెనీ అందిపుచ్చుకోగలదని అంచనా.
ఈ కంపెనీ 3–4 ఏళ్లలో పూర్తి చేయాల్సిన ప్రాజెక్ట్‌ల విలువ రూ.90,000 కోట్ల మేర ఉంటుంది. ఇవన్నీ పూర్తయితే, రెండేళ్లలో కంపెనీ ఈపీఎస్(షేర్ వారీ ఆర్జన) 13 శాతం మేర చక్రగతిన వృద్ధి చెందుతుందని అంచనా. వచ్చే ఆర్థిక సంవత్సరం పుస్తక విలువకు ఒకటిన్నర రెట్ల ధరకు ప్రస్తుతం ఈ షేర్ ట్రేడవుతోంది. ఇది ఆకర్షణీయమైన ధర.
అపోలో హాస్పిటల్స్ - కొనొచ్చు
బ్రోకరేజ్ సంస్థ: ఎడిల్‌వీజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్; ప్రస్తుత ధర: రూ.935; టార్గెట్ ధర: రూ.1,700
ఎందుకంటే: భారత్‌లో తొలి కార్పొరేట్ హాస్పిటల్ ఇది. 150 పడకల ఆసుపత్రిగా 1983లో ఆరంభమైన ఈ సంస్థ, ప్రస్తుతం 6,800 పడకలతో 61 ఆసుపత్రులను నిర్వహిస్తోంది. ఈ రంగానికే సంబంధించిన ఫార్మసీ, కన్సల్టెన్సీ, బీమా, డయాగ్నస్టిక్ క్లినిక్స్, టెలీ మెడిసిన్ సెంటర్స్, మెడికల్ ఎడ్యుకేషన్ సెంటర్స్, రీసెర్చ్ తదితర రంగాలకూ కూడా విస్తరించింది. కొత్త హాస్పిటళ్ల ఏర్పాటు, ఉన్న హాస్పిటళ్ల విస్తరణ కారణంగా ఆరోగ్య సంరక్షణ విభాగం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో 10% వృద్దిని సాధించింది. అపోలో ఫార్మసీ విభాగం 20% వృద్ధి చెందింది.
ఈ ఏడాది మార్చి నాటికి కంపెనీ రుణ భారం రూ.2,700 కోట్లుగా ఉంది. ఈ కంపెనీ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను మించినప్పటికీ, ఫలితాలు వెల్లడైన రోజు ఈ షేర్ 4% వరకూ పతనమైంది. గత మూడు నెలల్లో 20% క్షీణించింది. పెద్ద కరెన్సీ నోట్ల రద్దు, జీఎస్‌టీ అమలు, స్టెంట్‌లు, కీళ్ల మార్పిడికి సంబంధించిన ఇంప్లాంట్ల ధరలపై నియంత్రణ, కొన్ని రాష్ట్రాల్లో నర్సుల కనీస వేతనాలు పెంచడం.... ఈ అంశాలన్నీ హాస్పిటల్ రంగ షేర్లపై ప్రతికూల ఫ్రభావం చూపుతున్నాయి.
హాస్పిటల్ రంగంలోని సంస్థాగత సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వాలు పాప్యులిస్ట్ చర్యలు తీసుకుంటుండటంతో ఈ రంగంలోని కంపెనీలు కుదేలవుతున్నాయి. ప్రస్తుతం 8%గా ఉన్న ఈ కంపెనీ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ (ఆర్‌ఓసీఈ)మూడేళ్లలో 15%కి పెరుగుతుందని అంచనా. మూడేళ్లలో నిర్వహణ లాభం 21%, మార్జిన్‌లు 2.5% చొప్పున వృద్ధి చెందగలవని భావిస్తున్నాం. గత మూడేళ్లలో రూ. 2,590 కోట్ల మేర పెట్టుబడులు పెట్టింది.
ఈ పెట్టుబడుల ఫలాలు అందనున్నాయి. ప్రస్తుతం నష్టాల్లో ఉన్న అపోలో హెల్త్ అండ్ లైఫ్‌స్టైల్ లిమిటెడ్(ఏహెచ్‌ఎల్‌ఎల్) వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే లాభాల్లోకి వచ్చే అవకాశాలున్నాయి. హాస్పిటల్స్ విస్తరణపైననే ఈ కంపెనీ విజయం అధారపడి ఉంది. విస్తరణలో సమస్యలు, స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత, పెరుగుతున్న వ్యయాలు.. ఇవి ప్రతికూలాంశాలు.
గమనిక: ఈ కాలమ్‌లో షేర్లపై ఇచ్చిన సలహాలు, సూచనలు, వివిధ బ్రోకరేజి సంస్థలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే.
Comments
Please login to add a commentAdd a comment