
వాషింగ్టన్: అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) చీఫ్ ఎకనమిస్టుగా ప్రముఖ ప్రవాస భారతీయ ఆర్థికవేత్త గీతా గోపీనాథ్ (47) బాధ్యతలు చేపట్టారు. ఆమె ఈ పదవిలో నియమితులైన తొలి మహిళ కావడం విశేషం. అమెరికా పౌరసత్వం ఉన్న గీతా గోపీనాథ్.. హార్వర్డ్ వర్సిటీలో ఇంటర్నేషనల్ స్టడీస్ అండ్ ఎకనమిక్స్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. డిసెంబర్ 31న పదవీ విరమణ చేసిన ఐఎంఎఫ్ రీసెర్చ్ విభాగం ఎకనమిక్ కౌన్సిలర్, డైరెక్టర్ మారిస్ ఆబ్స్‌ఫెల్డ్ స్థానంలో ఆమె నియమితులయ్యారు. గతేడాది అక్టోబర్ 1న గీతా గోపీనాథ్ నియామకాన్ని ఐఎంఎఫ్ ఎండీ క్రిస్టీన్ లగార్డ్ ప్రకటించారు. గీతా గోపీనాథ్ ప్రపంచంలోనే అత్యుత్తమమైన ఆర్థికవేత్తల్లో ఒకరని లగార్డ్ కితాబిచ్చారు. బహుళజాతి సంస్థలు పెను సవాళ్లు ఎదుర్కొంటుండటం, ప్రపంచ దేశాలు గ్లోబలైజేషన్‌ను పక్కనపెట్టి దేశీయ అంశాలకే ప్రాధాన్యమిస్తుండటం వంటి ధోరణులు పెరుగుతున్న తరుణంలో ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్టుగా గీతా గోపీనాథ్ నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది.
ప్రపంచ దేశాలు గ్లోబలైజేషన్ నుంచి వెనక్కి తగ్గుతుండటాన్ని నివారించడం ఐఎంఎఫ్ ముందున్న పలు ప్రధాన సవాళ్లలో ఒకటని ది హార్వర్డ్ గెజిట్‌కిచ్చిన ఇంటర్వ్యూలో గీత తెలిపారు. ‘గ్లోబలైజేషన్‌లో భాగంగా గడిచిన 50–60 ఏళ్లలో ప్రపంచ దేశాలు టారిఫ్‌లు తగ్గించుకోవడం, వాణిజ్యం పెంచుకోవడం వంటివి చేశాయి. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా గ్లోబలైజేషన్ నుంచి ప్రస్తుతం వెనక్కి తగ్గుతున్నాయి. చైనా తదితర దేశాలపై అమెరికా టారిఫ్‌లు విధించడం, ఆయా దేశాలు కూడా అదే రీతిలో స్పందించడం కొన్ని నెలలుగా చూస్తున్నాం. దీంతో వాణిజ్య విధానాలపై అనిశ్చితి పెరుగుతోంది. ప్రపంచ దేశాల మధ్య వాణిజ్యం పెరగడం వల్ల అంతర్జాతీయంగా పేదరికం తగ్గినా.. దాని ప్రభావంతో అసమానతలు పెరిగిపోయాయన్న ఆందోళన ఉంది. ఇలాంటి సందేహాలను నివృత్తి చేసేందుకు తగు చర్యల అవసరం‘ అని ఆమె పేర్కొన్నారు. అమెరికా వడ్డీ రేట్లను పెంచుతుండటం వల్ల వర్ధమాన దేశాలపై పడుతున్న ప్రభావాలు, వాణిజ్యంలో డాలర్ ఆధిపత్య ప్రభావాలు మొదలైన వాటిపై అధ్యయనం చేయాల్సి ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment