
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ
పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్‌బీ) స్కామ్‌పై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తొలిసారి స్పందించారు. అక్రమాలను గుర్తించేందుకు వీలుగా ప్రవేశపెట్టాల్సిన నూతన వ్యవస్థలు ఏంటన్న దానిపై పర్యవేక్షణ సంస్థలు దృష్టి సారించాలని, భవిష్యత్తులో ఇటువంటివి పునరావృత్తం కాకుండా చూడాల్సి ఉందన్నారు. బ్యాంకుల్లో మోసాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలను సూచించేందుకు ఆర్‌బీఐ ఇప్పటికే వైహెచ్ మాలేగమ్ అధ్యక్షతన ఓ కమిటీని నియమించిన విషయం తెలిసిందే.
‘‘పన్ను చెల్లింపుదారులు బ్యాంకింగ్ వ్యవస్థలో అధికంగా ఇన్వెస్ట్ చేసి ఉన్నారు. ప్రధాని మోదీ చెప్పినట్టు ప్రభుత్వం బ్యాంకుల వాణిజ్య నిర్ణయాల్లో జోక్యం చేసుకోదు. బ్యాంకులు స్వతంత్రంగా పనిచేయాలని మేం కోరుకుంటున్నాం. మాలో ఎవరూ కూడా మీకు కాల్ చేయరు. మీరు సొంతంగా నిర్ణయాలు తీసుకోండి. మీకు ఇచ్చిన అధికారాన్ని సరైన విధంగా సమర్థవంతంగా వినియోగించుకోవాలి’’ అని జైట్లీ సూచించారు.