
వాషింగ్టన్ : ప్రపంచకప్ ఫైనల్‌లో ఆతిథ్య ఇంగ్లండ్, టీమిండియా జట్లు తలపడతాయని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ జోస్యం చెప్పారు. అయితే మెగా టోర్నీలో ఇండియానే గెలవాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. వాషింగ్టన్‌లో జరిగిన అమెరికా- ఇండియా వ్యాపార మండలి సదస్సుకు సుందర్ పిచాయ్ హాజరయ్యారు. అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో సహా పలువురు కార్పోరేట్ దిగ్గజాల సమక్షంలో ఆయన గ్లోబల్ లీడర్‌షిప్ అవార్డు అందుకున్నారు.
ఈ సందర్భంగా క్రీడలపై పట్ల తనకున్న మక్కువ గురించి పిచాయ్ మాట్లాడుతూ..‘ ఇక్కడికి(అమెరికా) వచ్చిన కొత్తలో బేస్‌బాల్ అంటే ఇంట్రస్ట్ ఉండేది. అది చాలెంజింగ్ గేమ్ అనిపించేది. మొదటి మ్యాచ్‌లోనే బాల్‌ను వెనక్కి బలంగా కొట్టేసా. నిజానికి అది క్రికెట్ మ్యాచ్ అయి ఉంటే గ్రేట్ షాట్ అయ్యి ఉండేది. కానీ బేస్‌బాల్ మ్యాచ్‌లో అలా ఆడినందుకు అందరూ వింతగా చూశారు. అందుకే బేస్‌బాల్ కాస్త కఠినంగా తోచింది. దీంతో క్రికెట్‌కు షిఫ్ట్ అయిపోయాను. ఇప్పుడు ప్రపంచకప్ అనే అద్భుతమైన టోర్నమెంట్ జరుగుతోంది కదా. మెన్ ఇన్ బ్లూ గెలవాలని ఆశిస్తున్నా. నాకు తెలిసి ఇంగ్లండ్, భారత్ ఫైనల్‌లో తలపడతాయి. ఇక న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలు మంచి జట్లు. వాటిని కూడా తక్కువగా అంచనా వేయలేం’ అని చెప్పుకొచ్చారు.