
సిండికేట్ బ్యాంక్ కు కేటాయింపుల భారం
న్యూఢిల్లీ: సిండికేట్ బ్యాంక్‌కు ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో రూ.120 కోట్ల నికర నష్టం వచ్చింది. పన్నులు, ఇతర కేటాయింపులు అధికంగా ఉండటంతో క్యూ3లో ఈ స్థాయిలో నష్టాలు వచ్చాయని బ్యాంక్ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.305 కోట్ల నికర లాభం ఆర్జించామని తెలియజేసింది.
గత క్యూ3లో రూ.5,922 కోట్లుగా ఉన్న నికర ఆదాయం ఈ క్యూ3లో రూ. 6,188 కోట్లుగా ఉంది. కేటాయింపులు రూ.290 కోట్ల నుంచి రూ.875 కోట్లకు పెరిగాయని, స్థూల మొండి బకాయిలు 3.6 శాతం నుంచి 4.61 శాతానికి, నికర మొండి బకాయిలు 2.38 శాతం నుంచి 3.04 శాతానికి పెరిగాయని వివరించింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో సిండికేట్ బ్యాంక్ షేర్ బీఎస్‌ఈలో 5.1 శాతం క్షీణించి రూ.70 వద్ద ముగిసింది.