మీడియా సమావేశంలో మాట్లాడుతున్న చౌబే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చిన్న నగరాలకు విమాన సర్వీసులు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉడాన్ స్కీమ్ విజయవంతమైందని పౌర విమానయాన శాఖ పేర్కొంది. మరిన్ని పట్టణాలను అనుసంధానించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అభ్యర్థనలు వెల్లువెత్తుతున్నాయని సివిల్ ఏవియేషన్ సెక్రటరీ ఆర్.ఎన్.చౌబే చెప్పారు. వింగ్స్ ఇండియా–2018లో భాగంగా గురువారమిక్కడ ఆయన వివిధ విమానయాన సంస్థల సీఈవోలతో సమావేశమైన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ‘‘మరిన్ని ఎయిర్‌పోర్టుల ఆధునీకరణ చేపట్టాల్సిందిగా విమానయాన సంస్థలు కోరాయి. పరిశ్రమకు అవసరమైన మానవ వనరులను అందించేందుకు చర్యలు చేపట్టాలని కంపెనీలు అభ్యర్థించాయి. దేశంలో 15 రోజులకు ఒక కొత్త ఎయిర్‌పోర్టు అందుబాటులోకి వస్తోంది’’ అని వివరించారు.
విదేశాలకు ఉడాన్ దన్ను..
ఉడాన్‌ను ఆసరాగా చేసుకుని భారత్ నుంచి ఆసియాన్ దేశాలకు విమాన సర్వీసులు విస్తరించేందుకు అస్సాం ప్రభుత్వం ముందుకు వచ్చిందని, మూడేళ్లపాటు వైమానిక సంస్థలకు ఏటా రూ.100 కోట్ల నిధులు సమకూర్చేందుకు అస్పాం ప్రభుత్వం ప్రతిపాదించిందని చౌబే తెలిపారు. ‘వచ్చే అయిదారేళ్లలో భారత్‌కు 8–10 వేల మంది పైలట్లు అవసరమవుతారు. మూడేళ్లుగా దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య 20 శాతం వృద్ధి చెందింది. ఈ ఏడాది ఇది 17 శాతం ఉంటుంది. విమానాశ్రయల విస్తరణకు వచ్చే నాలుగేళ్లలో రూ.18,000 కోట్లు వెచ్చించనున్నాం’ అని వెల్లడించారు. చేతి నిండా డబ్బులున్న సంస్థలు మాత్రమే ఈ రంగంలో నిలదొక్కుకుంటాయని ఎయిర్ కోస్టాను ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. నిధులుంటేనే విమానయాన రంగంలో ప్రవేశించాలని హితవు పలికారు.
వాటాల ఉపసంహరణ..
ఎయిర్ ఇండియాలో వాటాల ఉపసంహకరణకై కొద్ది రోజుల్లో ఆసక్తి వ్యక్తీకరణకు కంపెనీలను ఆహ్వానిస్తామని సివిల్ ఏవియేషన్ సెక్రటరీ వెల్లడించారు. అలాగే పవన్ హన్స్‌లో సైతం వాటా విక్రయిస్తున్నామని చెప్పారు. దీనికోసం ఆసక్తి వ్యక్తీకరణకు మరోసారి ఇన్వెస్టర్లను ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు. ఈ ప్రక్రియ త్వరగా పూర్తి చేసేందుకు కృతనిశ్చయంతో ఉన్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment