రెక్కలు విచ్చుకున్న ‘ఉడాన్’
సామాన్య ప్రజలకూ గగనతల ప్రయాణం: మోదీ
- హవాయి చెప్పులు ధరించిన వారూ విమానం ఎక్కాలి
- ఢిల్లీ–సిమ్లా మధ్య చవక విమాన ప్రయాణానికి శ్రీకారం
- విమాన టికెట్ ధర గంటకు రూ.2,500 మాత్రమే
సిమ్లా: సామాన్యులకు చవక ధరకే గగనతల ప్రయాణ సౌకర్యాన్ని కల్పించే ఉడాన్ (ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్)– (ప్రాంతీయ అనుసంధాన పథకం–ఆర్‌సీఎస్) పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా హిమాచల్‌ప్రదేశ్ రాజధాని సిమ్లా– ఢిల్లీ మధ్య మొట్టమొదటి విమాన సర్వీసును సిమ్లాలో జెండా ఊపి ప్రారంభించారు. అలాగే హైదరాబాద్–కడప, హైదరాబాద్– నాందేడ్ మధ్య విమాన సర్వీసులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. హవాయి చెప్పులు వేసుకున్న వారు కూడా విమానం (హవాయి జహాజ్)లో ప్రయాణిం చడం చూడాలనుకుంటున్నానని చెప్పారు.
ఈ పథకంలో తదుపరి ముంబై–నాందేడ్ మధ్య విమాన సర్వీసును ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఢిల్లీ–సిమ్లా విమాన సర్వీసులో టికెట్ ధర రూ.2,036 మాత్రమే అని, ఇది ట్యాక్సీ రైడ్ కంటే తక్కువ ధర అని చెప్పారు. గతంలో మనం విమాన ప్రయాణం అంటే రాజులు, మహారాజులకే పరిమితమని భావించేవారమని, కానీ ఈ ఆలోచనా విధానాన్ని మార్చాలని తాము ఉడాన్‌కు శ్రీకారం చుట్టామని చెప్పారు. సిమ్లా–ఢిల్లీ విమాన సర్వీసును ఎయిరిండియా అనుబంధ సంస్థ అలయన్స్ ఎయిర్ ఆపరేట్ చేస్తోంది. ఇందుకోసం 42 సీటింగ్ సామర్థ్యం కలిగిన ఏటీఆర్ విమానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే సిమ్లా నుంచి బయలు దేరే సమయంలో ఉష్ణోగ్రత, ఆల్టిట్యూడ్‌తో పాటు రన్‌వే పరిమాణం తదితర కారణాలను పరిగణనలోకి తీసుకుని 12 మంది ప్రయా ణికులను మాత్రమే అనుమతించారు. ‘ప్రతి ఒక్కరూ ప్రయాణించాలి.. ఏకమవ్వాలి’అనేది తమ నినాదమని మోదీ పేర్కొన్నారు.
70 ఏళ్లయినా.. 70 ఎయిర్‌పోర్టులే..
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు పూర్తయ్యిందని, అయితే ఇప్పటికీ 70–75 ఎయిర్‌పోర్టులే అందుబాటులో ఉన్నాయని, ఉడాన్ ద్వారా 30కిపైగా కొత్త ఎయిర్‌పోర్టుల్లో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ప్రధాని మోదీ చెప్పారు. ప్రాంతీయ విమానయాన కనెక్టివిటీ వల్ల టైర్–2, టైర్–3 నగరాలను అభివృద్ధి బాట పట్టించవచ్చని.. దేశానికి అవి ప్రగతి చక్రాలుగా పనిచేస్తాయని చెప్పారు. ఈ పథకం జాతీయ సమగ్రతకు దోహదం చేస్తుందని, విభిన్న సంస్కృతులు, సంప్రదా యాల కలయిక సాధ్యపడుతుందని అన్నారు. పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు, హిమాచల్ సీఎం వీరభద్రసింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
గంటకు చార్జీ రూ.2,500
ప్రభుత్వం ఆర్నెల్ల క్రితం ప్రకటించిన ఉడాన్ పథకాన్ని ఇప్పుడు ఆచరణలోకి తీసుకురా వడం గమనార్హం. ప్రాంతీయ విమానయా నాన్ని అభివృద్ధి చేసేందుకు ఉడాన్ పథకంలో భాగంగా స్వల్ప దూర ప్రయాణానికి విమాన చార్జీని గంటకు రూ.2,500గా నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ పథకానికి ఐదు విమానయాన సంస్థలను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ సంస్థలు తమ విమాన సర్వీసుల్లోని మొత్తం సీట్లలో 50 శాతాన్ని ప్రతిపాదిత సెక్టార్లలో గంటకు రూ.2,500 కంటే తక్కువకే అమ్మాలి. ఈ సంస్థలకు మొ త్తంగా 128 రూట్లను కేటాయించారు. ఇందు కు కేంద్రం ఆర్థిక సహకారాన్ని అంది స్తుంది. అలాగే నో ఎయిర్‌పోర్ట్ చార్జీలు.. ఆయా రూట్లలో మూడేళ్ల ప్రత్యేక గగనతల హక్కులు వంటి ప్రయోజనాలను కల్పిస్తుంది.
కడప–హైదరాబాద్ మధ్య ఉడాన్ సర్వీసు
సాక్షి, కడప సెవెన్‌రోడ్స్: కడప–హైదరాబాద్ మధ్య ఉడాన్ విమాన సర్వీసు ప్రారంభోత్సవాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కడప ఎయిర్‌పోర్టులో వీక్షించారు. ప్రతిరోజు కడప–హైదరాబాద్ మధ్య ట్రూజెట్ సంస్థకు చెందిన విమానం నడుస్తోందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి సి.ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ ఉడాన్‌తోపాటు కడప నుంచి విజయవాడ, విశాఖపట్టణం, చెన్నై, బెంగళూరుల మధ్య కూడా సర్వీసులు ప్రారంభిస్తే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్, బద్వే లు ఎమ్మెల్యే జయరాములు, పౌరసరఫరాల సంస్థ చైర్మన్ ఎం.లింగారెడ్డి, కలెక్టర్ బాబూరావు నాయుడు పాల్గొన్నారు.