న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా దేశంలోని అత్యంత ప్రముఖుల పర్యటనల కోసం ప్రత్యేకంగా రూపొందించిన రెండు బీ 777 విమానాలు ఈ సెప్టెంబర్‌లో ఎయిర్ ఇండియా సంస్థకు అందనున్నాయి. ఈ మేరకు బోయింగ్ సంస్థ నుంచి సమాచారం అందినట్లు సోమవారం అధికారులు తెలిపారు. నిజానికి ఆ విమానాల డెలివరీ జూలైలోనే జరగాల్సి ఉన్నా.. కరోనా కారణంగా జాప్యం చోటు చేసుకుందన్నారు. ఈ విమానాలను ఎయిర్ ఇండియా పైలట్లు కాకుండా, భారత వైమానిక దళానికి చెందిన పైలట్లు నడుపుతారు. ప్రస్తుతం రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని ప్రయాణాల కోసం ‘ఎయిర్ ఇండియా వన్’ పేరుతో ఉన్న బీ 747 విమానాలను వినియోగిస్తున్నారు.
ఈ విమానాలను ఎయిర్ ఇండియా పైలట్లే నడుపుతున్నారు. వీవీఐపీ ప్రయాణాలు లేని సమయాల్లో ఈ విమానాలు సాధారణ వాణిజ్య ప్రయాణాలకు కూడా వినియోగిస్తున్నారు. అయితే, ఈ బీ 777 విమానాల్లో ఇకపై వీవీఐపీలు మాత్రమే ప్రయాణిస్తారు. ఈ రెండు విమానాలు 2018లోనే కొన్ని నెలల పాటు ఎయిర్ ఇండియా వాణిజ్య ప్రయాణాల్లో భాగంగా ఉన్నాయి. తరువాత వాటిని వీవీఐపీ ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా మార్పులు చేయాలని కోరుతూ బోయింగ్ సంస్థకు తిరిగి పంపించారు. బీ 777 విమానాల్లో ‘లార్జ్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇన్‌ఫ్రారెడ్ కౌంటర్ మెజర్స్(ఎల్‌ఏఐఆర్‌సీఎం) పేరుతో అత్యాధునిక క్షిపణి నిరోధక వ్యవస్థ, సెల్ఫ్ ప్రొటెక్షన్ స్వీట్స్(ఎస్‌పీఎస్) ఉంటాయి. 19 కోట్ల డాలర్ల విలువైన ఈ రెండు రక్షణ వ్యవస్థలను భారత్‌కు అమ్మేందుకు అమెరికా ఈ ఫిబ్రవరిలో ఆంగీకరించింది.
Comments
Please login to add a commentAdd a comment