రుణ భారాలను తగ్గించుకోడానికి ఎయిర్ ఇండియా 2015 నుంచి 2021 జూలై నాటికి 115 ఆస్తులను విక్రయించిందని, తద్వారా రూ.738 కోట్లు సమకూర్చుకుందని పౌర విమానయాన శాఖమంత్రి వీకే సింగ్ లోక్‌సభకు తెలిపారు. లీజ్ రెంటల్ ఆదాయంగా ఎయిర్ ఇండియాకు వార్షికంగా రూ.100 కోట్లు అందుతున్నట్లు కూడా వెల్లడించారు.
ప్రాజెక్ట్ రాయల్
అప్పుల ఊబిలో ఉన్న ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిరిండియాను అమ్మేందుకు కేంద్రం సిద్ధమైన విషయం తెలిసిందే. 2019 మార్చి 31 నాటికి ఎయిరిండియా రూ.60,074 వేల కోట్ల అప్పుల్లో ఉంది. అయితే ఆ రుణ భారం నుంచి బయటపడేందుకు కేంద్రం ఎయిరిండియాను అమ్మేందుకు ఫైనాన్షియల్ బిడ్లను ఆహ్వానించింది. అందుకు 64రోజుల సమయం ఇచ్చినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్ పురి వెల్లడించారు. ఇదే సమయంలో 'ప్రాజెక్ట్ రాయల్' పేరుతో ఎయిర్ ఇండియా వ్యాల్యూ ఎంత ఉందనేది తెలుసుకుంటున్నారు. ఈ వ్యాల్యూషన్ అంతా నాలుగు పద్దతుల్లో జరుగుతుంది. ఇతర విమాన సంస్థలు వ్యాల్యూ ఎలా ఉంది? ఎయిరిండియా సర్వీసుల కోసం చేసిన ఖర్చు ఎంత? ఎయిరిండియాకు వచ్చిన మొత్తాన్ని ఏ పర్పస్ కింద ఖర్చు చేశారు? ఎన్ని ఆస్తులు ఉన్నాయి? నికర ఆస్తులు ఎంత? వాటి మొత్తం వ్యాల్యూ ఎంత అనే విషయాల్ని పరిగణలోకి తీసుకుంటున్నారు.
మరోవైపు ఎయిరిండియా అమ్మకాలతో ఆ సంస్థలో పనిచేస్తున్న పదివేల మంది ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం నష్టాల నుంచి బయటపడేలా భవిష్యత్ కార్యచరణ సిద్ధం చేయాలని కోరుతున్నారు. మరి ఎంతమేరకు సఫలం అవుతుందో చూడాల్సి ఉండగా.. ఎయిరిండియా ను సొంతం చేసుకునేందుకు టాటా, స్పైస్‌జెట్ ప్రమోటర్ అయిన అజయ్‌సింగ్ తో పాటు మరో నాలుగు సంస్థలు పోటీ పడుతున్నాయి.
ఏఏఐకు రూ.30,069 కోట్ల ఆదాయం
తన జాయింట్ వెంచర్ ఎయిర్‌పోర్టులు లేదా పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) ఎయిర్‌పోర్టుల నుంచి 2020–21 ఆర్థిక సంవత్సరం వరకూ ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) రూ.30,069 కోట్ల ఆదాయాన్ని పొందినట్లు పౌర విమానయాన శాఖ సహాయమంత్రి లోక్‌సభుకు ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు. హైదరాబాద్‌సహా ఢిల్లీ, బెంగళూరు, ముంబై, నాగపూర్‌లలో పీపీపీ నమూనాలో ఏఏఐ ఎయిర్‌పోర్టులను నిర్వహిస్తోంది. 2020–21లో ప్రభుత్వం హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ల నుంచి రూ.856 కోట్లను రాయితీ ఫీజుగా పొందిందనీ ఆయన తెలిపారు. ఏఏఐ పౌర విమానయాన శాఖ కింద పనిచేసే సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment