
మెర్సిడెస్ ‘ఏఎంజీ-43’ @77.5 లక్షలు
న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘మెర్సిడెస్’ తాజాగా ‘ఏఎంజీ ఎస్‌ఎల్‌సీ 43’ మోడల్‌ను భారత మార్కెట్‌లోకి తీసుకువ చ్చింది. దీని ధర రూ.77.5 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) ఉంది. ఈ టూ సీట్స్ టాప్‌లెస్ కారులో 3.0 లీటర్ 6 సిలిండర్ ట్విన్ టర్బో ఇంజిన్, 9 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, అత్యాధునిక ఇన్ఫోటైన్‌మెంట్ వ్యవస్థ, అదిరిపోయే డిజైన్ వంటి తదితర ప్రత్యేకతలు ఉన్నట్లు కంపెనీ వివరించింది.
ఈ కారు 0-100 కిలోమీటర్ల వేగాన్ని 4.7 సెకన్లలో అందుకుంటుందని పేర్కొంది. ఇక కారు గరిష్ట వేగం గంటకు 250 కిలోమీటర్లు. ‘ఎస్‌ఎల్‌కే 55 ఏఎంజీ’ స్థానంలో కంపెనీ దీన్ని ప్రవేశపెట్టింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో డీజిల్ (2000 సీసీపై సామర్థ్యమున్న) వెహికల్స్‌పై నిషేధం ఉండటంతో కంపెనీ దేశంలో విక్రయిస్తోన్న అన్ని మోడళ్లలకు సంబంధించిన పెట్రోల్ వెర్షన్లను సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది.