పదవీ విరమణ చేసిన ఆ జంటకు పెట్టుబడులపై మంచి అవగాహనే ఉంది. బాగానే ఇన్వెస్ట్ కూడా చేశారు. చాలామటుకు డబ్బును ఈక్విటీ ఫండ్స్‌లో పెట్టారు. వారికి బోలెడు ఆర్థిక అవసరాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం రోజువారీ ఇంటి ఖర్చులను సమకూర్చుకోవడం మొదటిది. అనుకోని పరిస్థితి ఏదైనా తలెత్తితే ఆదుకునే అత్యవసర నిధి రెండోది. రాబోయే రెండు, మూడేళ్లలో కుటుంబపరంగా తలెత్తబోయే భారీ ఖర్చులను తట్టుకునేందుకు తగినంత నిధి సమకూర్చుకోవడం మూడోది. ఇక, చిట్టచివరిగా .. నాలుగోది.. భవిష్యత్‌లో ఆర్థికంగా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా నిశ్చింతగా జీవితం గడిపేందుకు జాగ్రత్తపడటం. నిజానికి చాలా మందితో పోలిస్తే ఆ వృద్ధ జంట ఆర్థిక అవసరాలు అసాధారణమైనవేమీ కావు. ఇందుకోసం వారు ఎంచుకున్న ఫండ్స్ సరైనవే అయినప్పటికీ.. తాము సరైన దారిలోనే వెడుతున్నామా లేదా అన్నది వారి సందేహం. ఇందులో వారి తప్పేమీ లేదు. ఈ సమస్య వారొక్కరిదే కాదు.
ఏదైనా సాధనంలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు దానికంటూ ప్రత్యేక లక్ష్యాన్ని నిర్దేశించుకోకపోతే ఇలాంటి సందేహాలు, గందరగోళ పరిస్థితులే తలెత్తుతాయి. ఇందుకోసం ముందుగా మన అవసరాన్ని (లక్ష్యాన్ని) గుర్తెరగాలి. అది స్వల్పకాలికమా, మధ్య కాలికమా, దీర్ఘకాలికమా అన్నది చూసుకోవాలి. అప్పుడే సరైన సాధనాన్ని ఎంచుకోవడం వీలవుతుంది. అనేకానేక పెట్టుబడి సాధనాలు లేని కాలంలో అమ్మలు ఇంటి ఖర్చుల కోసం ఒక డిబ్బీ, పొదుపు కోసం ఒక డిబ్బీ, పిల్లల ఖర్చులు మొదలైన వాటి కోసం మరొకటి ఇలా ఒక్కో అవసరానికి ఒక్కో దానిలో డబ్బులు ఉంచేవారు.
ఇప్పటివారికి ఇది పాత చింతకాయ పచ్చడిలాంటిది అనిపించినా కూడా ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి ఈ సూత్రం ఇప్పుడు కూడా వర్తించేదే. డబ్బంతా కూడా ఒకే దాంట్లో ఇన్వెస్ట్ చేసేయకూడదు. అవసరాన్ని బట్టి, వ్యవధిని బట్టి తగిన సాధనాన్ని ఎంపిక చేసుకోవాలి. మధ్య మధ్యలో పోర్ట్‌ఫోలియోలో తగు మార్పులు, చేర్పులు చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మన అవసరాలకు అనుగుణమైన ఫలితాలను సదరు సాధనం నుంచి అందుకోవడం సాధ్యపడుతుంది.
హర్షేందు బిందాల్
ప్రెసిడెంట్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇన్వెస్ట్‌మెంట్స్ (ఇండియా)
లక్ష్యానికి తగ్గట్లే పెట్టుబడులు
Published Mon, Aug 17 2015 12:24 AM | Last Updated on Sun, Sep 3 2017 7:33 AM
Advertisement
Advertisement