టీ-హబ్‌లో టాటా క్యాపిటల్ పెట్టుబడులు!
సెప్టెంబర్‌లో టీ-హబ్ ప్రారంభోత్సవానికి రతన్ టాటా
♦ ఐటీ సెక్రటరీ జయేశ్ రంజన్ వెల్లడి
♦ 29, 30 తేదీల్లో ఆగస్ట్ ఫెస్ట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : స్టార్టప్స్ కంపెనీలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీ-హబ్ ఇన్నోవేషన్ ఫండ్‌లో టాటా క్యాపిటల్ పెట్టుబడి పెట్టనుంది. ఐటీ శాఖ సెక్రటరీ జయేశ్ రంజన్ శుక్రవారమిక్కడ జరిగిన కార్యక్రమంలో ఈ విషయం చెప్పారు. పెట్టుబడుల విలువ వెల్లడించలేమని.. పెట్టుబడి తో పాటు నిధుల నిర్వహణ కూడా టాటానే చేస్తుందని తెలియజేశారు. ఈ అంశంపై సమగ్రంగా చర్చించేందుకు ఈనెల 12న ముంబైలో టాటా క్యాపిటల్ పెద్దలతో సమావేశం కానున్నట్లు తెలియజేశారు. ఈనెల 29న జరిగే ఆగస్ట్ ఫెస్ట్ సదస్సు విశేషాలను ఈ సందర్భంగా ఆయన వివరించారు.
గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేషన్ సెంటర్‌ను 60 వేల చ.అ.ల్లో నిర్మిస్తున్నామని.. దీన్ని సెప్టెంబర్‌లో ప్రారంభిస్తామని తెలియజేశారు. టీ-హబ్ ప్రారంభానికి రతన్ టాటాను ఆహ్వానించినట్లు చెప్పారు. ‘‘100 మిలియన్ డాలర్లతో టీ-హబ్ ఇన్నోవేషన్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తున్నాం. ప్రాథమిక నిధుల కింద రూ.10 కోట్లను అందుబాటులో ఉంచాం. నిధుల సమీకరణ కోసం మరి కొందరితో చర్చిస్తున్నాం’’ అని తెలియజేశారు. టీ-హబ్‌లో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ), ట్రిపుల్ ఐటీ, నల్సార్ భాగస్వాములుగా ఉంటాయన్నారు. కార్యక్రమంలో ఐఎస్‌బీ అసోసియేట్ డెరైక్టర్ అరుణారెడ్డి, ఆగస్ట్ ఫెస్ట్ వ్యవస్థాపకుడు కిరణ్ పాల్గొన్నారు.
ఆగస్ట్ ఫెస్ట్‌కు 200 స్టార్టప్‌లు!
జూబ్లీహిల్స్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో ఈనెల 29, 30 తేదీల్లో అంతర్జాతీయ స్థాయిలో ఆగస్ట్ ఫెస్ట్ సదస్సు జరగనుంది. టీ-హబ్, ఐఎస్‌బీల సంయుక్త భాగస్వామ్యంలో జరిగే ఈ సదస్సులో 200 దేశీ స్టార్టప్ కంపెనీలు, సింగపూర్, అమెరికా, ఆఫ్రికా దేశాల నుంచి సుమారు 300లకు పైగా ఇన్వెస్టర్లు పాల్గొంటారు. 4 వేల మంది సందర్శకులొస్తారని అంచనా వేస్తున్నట్లు కిరణ్ చెప్పారు. ఏటా నిర్వహించే ఈ ఆగస్ట్ ఫెస్ట్‌ను... తొలి ఏడాది 500 మంది, రెండో ఏడాది 2,500 మంది సందర్శించారని చెప్పారు. ఆసక్తి గలవారు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.దిఆగస్ట్‌ఫెస్ట్.కామ్‌లో సంప్రదించవచ్చు.