
కొనుగోళ్లకు ఎప్పుడూ సిద్ధమే..
• వచ్చే 150 ఏళ్ల కోసం టాటా గ్రూపు నిర్మాణం: చైర్మన్ సైరస్ మిస్త్రీ
• వేగం, చురుకుదనంతోనే ముందుంటాం
• వృద్ధికి ఆవిష్కరణలు, టెక్నాలజీ కీలకం
• గ్రూపు ఆదాయంలో 70% విదేశాల నుంచేనని వెల్లడి
న్యూఢిల్లీ: టాటా గ్రూపు దేశీయంగా, విదేశాల్లో కంపెనీల కొనుగోళ్లకు ఎప్పుడూ ద్వారాలు తెరిచే ఉంచుతుందని గ్రూపు చైర్మన్ సైరస్ మిస్త్రీ అన్నారు. తమ వ్యాపారాలు కొన్ని సవాళ్లతో కూడిన పరిస్థితులను ఎదుర్కొన్నాయని చెప్పిన ఆయన, పోర్ట్‌ఫోలియో తగ్గించుకునే దిశగా కఠినమైన, బలమైన నిర్ణయాలకు పిలుపునివ్వాల్సిన అవసరాన్ని కల్పించాయన్నారు. క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేందుకు గ్రూపు కంపెనీలు వేగం, చురుకుదనంతో పనిచేయాలని తాను కోరుకుంటానని తెలిపారు. దేశంలోనే అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యమైన టాటా గ్రూపు చైర్మన్‌గా మిస్త్రీ... కంపెనీలు ఎదుర్కొంటున్న సవాళ్లు, టెక్నాలజీ ఆవశ్యకత, ఆవిష్కరణలు, వినియోగదారుల అవసరాల గురించి గ్రూపు అంతర్గత మేగజైన్‌కు వివరించారు. సామాజిక బాధ్యతకు టాటా కట్టుబడి ఉంటుందన్న ఆయన వచ్చే 150 ఏళ్ల కోసం టాటా గ్రూపును నిర్మించే పనిలో ఉన్నామన్నారు.
రెండు విధానాలు
సహజసిద్ధంగా ఎదుగుతూనే, కొనుగోళ్ల ద్వారా దేశీయంగా, విదేశాల్లో వృద్ధి అవకాశాలను అందుకునేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటాం. స్థిరమైన, లాభదాయకమైన వృద్ధి సాధించేందుకు గ్రూపులోని ప్రతి కంపెనీ తనదైన అభివృద్ధి విధానాన్ని రూపొందించుకుంది. గత దశాబ్ద కాలంలో రూ.4,15,000 కోట్ల రూపాయలను విస్తరణపై వెచ్చించాం. ఇందులో రూ.1.7 లక్షల కోట్లు గత మూడేళ్లలో ఖర్చు చేసిందే. 2016 మార్చి నాటికి గ్రూపు నికర రుణాలు 24.5 బిలియన్ డాలర్లు కాగా, నిర్వహణ ఆదాయాలు 9 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
గత మూడేళ్లలో గ్రూపు నిర్వహణ ఆదాయాలు వార్షిక చక్రగతిన (సీఏజీఆర్) 30 శాతం వృద్ధి నమోదు చేశాయి. అయితే, స్థూలంగా కాకుండా... విడిగా ప్రతీ కంపెనీ కూడా ఇదే స్థాయిలో వృద్ధి సాధించాలి. అందుకే విడిగా ప్రతీ కంపెనీపై ఫోకస్ పెట్టాం. టాటా గ్రూపు మొత్తం ఆదాయంలో అంతర్జాతీయ ఆదాయం 70 శాతంగా ఉంది. అందుకే గత మూడేళ్లలో మూల ధన వ్యయం ఎక్కువ భాగం విదేశాల్లోనే ఖర్చు పెట్టాం. 103 బిలియన్ డాలర్ల విలువైన జాయింట్ ప్రాజెక్టులపై టాటా గ్రూపు పరిధిలో అంతర్గత సహకారంపై దృష్టి సారించాం. మూలధన వ్యయం అనేది టాలెంట్, బ్రాండ్లు, టెక్నాలజీపై ఉండాలి. భవిష్యత్తులో అసలైన మార్పును తీసుకొచ్చేవి ఇవే. కొత్తగా ఇరాన్, మయన్మార్‌లోకి ప్రవేశించాం.
చురుగ్గా లేకుంటే వెనుకనే...
చురుగ్గా లేకుంటే వెనుకబడిపోతాం. సంస్థాగతమైన వేగం, చురుకుదనం, మార్పునకు సిద్ధంగా ఉండడం అవసరం. కల్లోల పరిస్థితులను ఎదుర్కొనేందుకు చురుకుదనం అనేది చాలా కీలకం అవుతుంది. మారుతున్న సమయాల్లోనూ వృద్ధి చెందేందుకు ఆవిష్కరణలు, టెక్నాలజీ దోహదపడతాయి. పరిశోధన, అభివృద్ధిపై తగినంత పెట్టబడులు పెట్టడంతోపాటు వినియోగదారుల అవసరాలను భిన్న విధాలుగా అర్థం చేసుకోవడం ద్వారా కొత్త పరిశ్రమలు, ఉత్పత్తులు, వ్యాపార అవకాశాలను గుర్తించవచ్చు.
అదే టాటా స్టీల్‌ను నిలబెట్టింది
భిన్న రకాల ఉత్పత్తులను టాటా స్టీల్ తక్కువ వ్యయానికే ఉత్పత్తి చేస్తోంది. పైగా బలమైన బ్రాండ్. ప్రపంచ వ్యాప్తంగా ఉక్కు రంగంలో ఎన్నో సంస్థలు మునిగినా టాటా స్టీల్ నిలదొక్కుకునేందుకు ఇవే కారణాలు. ‘టాటా మోటార్స్, టాటా స్టీల్ టర్న్ ఎరౌండ్ అవకాశాలు కనిపిస్తున్నాయి. గణనీయంగా వృద్ధి చెందేందుకు తగినంత సామర్థ్యం ఉంది. ప్యాసింజర్ కార్లు తదితర విభాగాల్లో సవాళ్లు కొనసాగుతాయి. కంపెనీకి సంబంధించి ఎనిమిది వ్యూహాత్మక విధానాలను గుర్తించాం. భిన్న స్థాయిల్లోని ఎగ్జిక్యూటివ్‌లతో 100 బృందాలను ఏర్పాటు చేశాం. ముఖ్యంగా యువ నాయకత్వానికి అవకాశం ఇవ్వడమే మా ఉద్దేశం. మా అసలు ప్రయాణం ఇప్పుడే మొదలైంది’ అని మిస్త్రీ చెప్పారు.
డిజిటల్ విప్లవం
డిజిటల్ రంగంలోని అవకాశాలను గుర్తించి టాటా మూడు కంపెనీలను ఏర్పాటు చేసింది. ఈ కామర్స్ రంగం కోసం టాటా క్లిక్, డేటా అనలటిక్స్ అవసరాల కోసం టాటా ఐక్యూ, ఆరోగ్య రంగం కోసం టాటా డిజిటల్ హెల్త్ ఏర్పడ్డాయి. మా అన్ని వ్యాపారాల్లోనూ కార్పొరేట్, కస్టమర్ వైపు నుంచి అంశాలను అర్థం చేసుకోవడంపై దృష్టి ఉంటుంది. ఏడువేల పెటెంట్లను అధిగమించాం.
నాయకత్వం గురించి...
నా మొట్టమొదటి విధానం ఎదుటి వారు చెప్పేది వినడం. దాంతో నాయకత్వ పరంగా శూన్యాన్ని భర్తీ చేయగలం. గ్రూప్‌ను విజయవంతంగా నడిపించడానికి చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లు, బోర్డ్ డెరైక్టర్లు, భాగస్వాముల విశ్వాసం, గౌరవాన్ని పొందడమే కారణం. సరైన కారణాలు ఉంటే కఠినమైన నిర్ణయాలకు వెనుకాడరాదు. టాటా గ్రూపును నడిపించేది క్రియాశీల పరివర్తనే.