
న్యూఢిల్లీ: విమానయాన రంగంలో ఇప్పటికే రెండు వెంచర్స్ ఉన్న టాటా గ్రూప్ తాజాగా ఎయిర్‌లైన్స్ కార్యకలాపాలను మరింతగా విస్తరించడానికి సిద్ధమయింది. ఇందులో భాగంగా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న జెట్ ఎయిర్‌వేస్‌పై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. పాక్షిక వాటాలు కాకుండా పూర్తి స్థాయిలో యాజమాన్య అధికారాలు ఉండేలా మొత్తం కంపెనీని లేదా ఎయిర్‌క్రాఫ్ట్ తదితర మౌలిక సదుపాయాలను కొనుగోలు చేయాలని భావిస్తోంది.
దీనికి సంబంధించి టాటా సన్స్, జెట్ ఎయిర్‌వేస్ మధ్య ప్రాథమిక స్థాయిలో చర్చలు జరిగినట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలియజేశాయి. టాటా గ్రూప్ కొంత వాటాలు కొనుగోలు చేసి, ప్రమోటర్ నరేష్ గోయల్ కుటుంబంతో సంయుక్తంగా నియంత్రణ అధికారాలు తీసుకునేలా జెట్ ఎయిర్‌వేస్ ప్రతినిధులు ఈ సమావేశంలో ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అయితే, టాటా గ్రూప్ ఈ ప్రతిపాదనను తోసిపుచ్చిందని, గోయల్ కుటుంబం పూర్తిగా ఎయిర్‌లైన్స్ నుంచి తప్పుకోవాలని, తమకు మొత్తం నియంత్రణ అధికారాలు ఇవ్వాలని స్పష్టం చేసినట్లు ఆ వర్గాలు వివరించాయి.
జెట్ ఎయిర్‌వేస్ వర్గాలు మాత్రం దీన్ని తోసిపుచ్చాయి. ఇవన్నీ పూర్తిగా ఊహాజనిత వార్తలేనని పేర్కొన్నాయి. తీవ్ర నిధుల సంక్షోభం ఎదుర్కొంటున్న జెట్ ఎయిర్‌వేస్ తమ సిబ్బందికి సకాలంలో జీతాలూ చెల్లించలేకపోతోంది. దీంతో కొంత మేర వాటాల విక్రయం కోసం ఇన్వెస్టర్లతో చర్చలు జరుపుతోంది. ఫ్రీక్వెంట్ ఫ్లయర్ వ్యాపార విభాగం జెట్ ప్రివిలేజ్‌ను విక్రయించే ప్రయత్నాల్లో ఉన్నట్లు ఇప్పటికే స్టాక్ ఎక్సే్చంజీలకు కూడా తెలియజేసింది.
జెట్ ప్రతిపాదన ఇదీ..
జెట్ ఎయిర్‌వేస్‌లో గోయల్, ఆయన భార్యకు 51 శాతం వాటాలు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కి చెందిన ఎతిహాద్ ఎయిర్‌వేస్‌కు మరో 24 శాతం వాటాలున్నాయి. టాటా గ్రూప్‌తో చర్చల సందర్భంగా 26 శాతం వాటా, వైస్ చైర్మన్ పదవి, బోర్డు స్థాయిలో కొందరిని నియమించే అధికారాలను జెట్ ప్రతినిధులు ఆఫర్ చేశారు. టాటా గ్రూప్ దీన్ని తిరస్కరించింది. ఇప్పటికే ఉన్న విమానయాన కార్యకలాపాల వ్యాపారాన్ని మరింతగా విస్తరించుకునే క్రమంలో చిన్నా చితకా వాటాల డీల్స్‌పై టాటా గ్రూప్‌నకు ఆసక్తి లేదని కంపెనీ వర్గాలు తెలిపాయి.
ఉక్కు రంగంలో మొత్తం కంపెనీలనే కొనేసినట్లు .. విమానయాన రంగంలో కూడా కొంటే పూర్తి కంపెనీనే కొనుగోలు చేయాలని, పాక్షికంగా వాటాలు తీసుకుంటే లాభం ఉండదని టాటా గ్రూప్ భావిస్తున్నట్లు వివరించాయి. టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్, జెట్ ఎయిర్‌వేస్ చైర్మన్ నరేష్ గోయల్ ఇప్పటికే ఒకసారి సమావేశమయ్యారు కూడా. ఒకవేళ టాటాలకు ఆమోదయోగ్యమైన మరో ప్రతిపాదన ఏదైనా తెరపైకి వస్తే.. చర్చలు ముందుకు సాగొచ్చని తెలుస్తోంది.
వ్యాపార పునర్‌వ్యవస్థీకరణ..
టాటా గ్రూప్ ప్రస్తుతం దేశీయంగా రెండు విమానయాన సంస్థల్లో భాగస్వామిగా ఉంది. సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో కలిసి విస్తార పేరిట ఫుల్ సర్వీస్ విమానయాన సంస్థను నిర్వహిస్తోంది. అలాగే మలేషియాకి చెందిన బడ్జెట్ ఎయిర్‌లైన్ ఎయిర్‌ఏషియాతో ఎయిర్‌ఏషియా ఇండియాను నడిపిస్తోంది. ఒకవేళ జెట్ ఎయిర్‌వేస్ కొనుగోలు చర్చలు గానీ ఫలప్రదమైతే దానికి అనుగుణంగా ప్రస్తుత ఏవియేషన్ కార్యకలాపాలన్నింటినీ పునర్‌వ్యవస్థీకరించాలని భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
జెట్‌కు టీపీజీ క్యాపిటల్ నో..
నిధుల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న జెట్ ఎయిర్‌వేస్ .. అమెరికాకు చెందిన ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం టీపీజీ క్యాపిటల్‌తో కూడా చర్చించింది. టాటా గ్రూప్ ముందుంచిన ప్రతిపాదన తరహా డీల్‌నే టీపీజీకి కూడా ఆఫర్ చేసింది. కానీ, దీన్ని టీపీజీ తిరస్కరించింది. ఇరు పక్షాల మధ్య రెండు విడతల చర్చలు జరిగాయి. కానీ యాజమాన్య అధికారాలు, వాటాల కొనుగోలు తర్వాత కూడా గోయల్ కుటుంబానికి కీలక హోదానిచ్చే అంశాలపై విభేదాల కారణంగా చర్చలు ముందుకు సాగలేదని సమాచారం.
షేరు 6% జంప్..
టాటా సన్స్‌తో చర్చల నేపథ్యంలో శుక్రవారం బీఎస్‌ఈలో జెట్ ఎయిర్‌వేస్ షేరు 6 శాతం ఎగిసి రూ. 229.30 వద్ద క్లోజయ్యింది. ఇంట్రాడేలో 8.18% పెరిగి రూ. 233.90 స్థాయిని కూడా తాకింది. బీఎస్‌ఈలో 13.24 లక్షల షేర్లు, ఎన్‌ఎస్‌ఈలో 1 కోటి పైగా షేర్లు చేతులు మారాయి. డీల్ విషయంపై వివరణనివ్వాలంటూ జెట్ ఎయిర్‌వేస్‌కు బీఎస్‌ఈ సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment