నెంబర్.1 టాటా.. నెంబర్.2 ఎవరో తెలుసా?
భారత్ లో అత్యంత విలువైన బ్రాండుల్లో అగ్రగామిగా టాటాల గ్రూప్ మరోసారి తన సత్తా చాటుకుంది. బ్రాండ్ వాల్యుయేషన్ సంస్థ బ్రాండు ఫైనాన్స్ రూపొందించిన వార్షిక అధ్యయన టాప్ 100 కంపెనీల జాబితాల్లో 13.1 బిలియన్ డాలర్ల(రూ.83,925కోట్లకుపైగా)తో టాటా గ్రూప్ తన స్థానాన్ని అలాగే నిలుపుకుంది. అయితే 2016లో కంటే 2017లో టాటా గ్రూప్ బ్రాండ్ విలువ 4 శాతం పడిపోయిందని ఈ అధ్యయనం తెలిపింది. 2016 లో టాటా గ్రూప్ విలువ 13.7 బిలియన్ డాలర్లు(రూ.87,786కోట్లు)గా ఉండేంది. టాటా గ్రూప్ తర్వాత స్థానం టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్ దక్కించుకుంది. 7.7 బిలియన్ డాలర్ల(రూ.49,339కోట్లకు పైగా)తో ఎయిర్ టెల్ ఈ స్థానంలో నిలిచింది. గతేడాది టాటా గ్రూప్ బోర్డు రూమ్ లో నెలకొన్న సైరస్ మిస్త్రీ వివాదమేని దీన్ని ప్రతిష్టను భంగ పరిచిందని తెలుస్తోంది. సైరస్ మిస్త్రీని అకస్మాత్తుగా బయటికి పంపేయడం బ్రాండు విలువను పడగొట్టిందని విశ్లేషకులంటున్నారు.
బ్రాండు విలువ పడిపోవడం, గ్రూప్ కు అంత మందచిదికాదని బ్రాండు ఫైనాన్స్ సీఈవో డేవిడ్ హై చెప్పారు. 2015-16 మధ్యకాలంలో ఈ గ్రూప్ బ్రాండు విలువ 11 శాతం పడిపోయింది. 2015లో ఈ గ్రూప్ బ్రాండు విలువ 15.3 బిలియన్ డాలర్లు(రూ.98,038కోట్లకుపైగా)గా ఉండేది. గత ఐదేళ్ల కాలంలో గ్రూప్ విలువ చాలా తక్కువకు పడిపోయిందని, దీనికంతటికీ కారణం బోర్డు రూం వారేనని విశ్లేషకులు చెబుతున్నారు.
టాటా గ్రూప్, ఎయిర్ టెల్ తర్వాత భారత్ లో అత్యంత విలువైన బ్రాండ్స్ గా ఎల్ఐసీ 3వ స్థానం, ఇన్ఫోసిస్ 4వ స్థానం, ఎస్బీఐ 5వ స్థానం, రిలయన్స్ 6వ స్థానం, ఎల్ అండ్ టీ 7వ స్థానం, ఇండియన్ ఆయిల్ 8వ స్థానం హెచ్సీఎల్ 9స్థానం, మహింద్రా 10వ స్థానాన్ని దక్కించుకుని, టాప్-10 లో నిలిచాయి. ఈ ర్యాంకింగ్స్ లో అతిపెద్ద మెరుగుదల, ఇండిగో ఎయిర్ లైన్స్ ర్యాంక్ 95 నుంచి 62కు పెరగడమేనని హై తెలిపారు. దేశంలోనే అతిపెద్ద ఎయిర్ లైన్ సంస్థ అయిన ఇండిగో ఇటీవలే 35 కొత్త రూట్లను ప్రకటించిందని చెప్పారు. టాటా గ్రూప్ లకు చెందిన తాజ్ హోటల్స్ కూడా 14 స్థానాలు పడిపోయి 93 స్థానంలో ఉన్నాయి.