న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పరమైన పరిణామాలతో దేశీయంగా టాప్ 100 కంపెనీల బ్రాండ్ విలువ గణనీయంగా దెబ్బతింటోంది. ఈ ఏడాది జనవరిలోని వేల్యుయేషన్‌తో పోలిస్తే ఏకంగా 25 బిలియన్ డాలర్ల మేర విలువ పడిపోయి ఉండొచ్చని ఓ నివేదిక చెబుతోంది. బ్రాండ్ ఫైనాన్స్ సంస్థ రూపొందించిన ఈ నివేదిక ప్రకారం అంతర్జాతీయంగా టాప్ 500 బ్రాండ్స్ విలువ జనవరితో పోలిస్తే 1 లక్ష కోట్ల డాలర్ల మేర పడిపోయింది.
టాప్ బ్రాండ్స్ ఇవే..: టాటా గ్రూప్ అత్యంత విలువైన బ్రాండ్‌గా కొనసాగుతోంది. విలువ కేవలం 2% పెరిగినప్పటికీ ఈ ఏడాది తొలిసారిగా 20 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్ మైలురాయిని అధిగమించింది. లగ్జరీ హోటల్ బ్రాండ్ తాజ్ దేశంలోనే అత్యంత పటిష్టమైన బ్రాండ్‌గా నిల్చింది. 100 పాయింట్ల సూచీలో 90.5 పాయింట్లు దక్కించుకుంది. ఇక, 8.1 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్‌తో ఎల్‌ఐసీ రెండో స్థానంలో, 7.9 బిలియన్ డాలర్లతో రిలయన్స్ మూడో స్థానంలో ఉంది. ఆ తర్వాత 4,5 స్థానాల్లో ఇన్ఫోసిస్ (7.08 బిలియన్ డాలర్లు), ఎస్‌బీఐ (6.4 బిలియన్ డాలర్లు) ఉన్నాయి.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఒక స్థానం ఎగబాకి ఆరో స్థానానికి చేరగా, మహీంద్రా ఒక స్థానం తగ్గి ఏడో ర్యాంక్‌కు పడిపోయింది. ఇండియన్ ఆయిల్ 15 ర్యాంకులు ఎగబాకి 8వ స్థానానికి చేరగా, హెచ్‌సీఎల్ ఒక ర్యాంకు తగ్గి తొమ్మిదో స్థానానికి పరిమితమైంది. ఎయిర్‌టెల్ 8 స్థానాలు పడిపోయి 10వ ర్యాంకులో నిల్చింది. కాగా, అంతర్జాతీయంగా 500 కంపెనీల్లోని టాప్ 100 జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ సంస్థ టాటా గ్రూప్ మాత్రమేనని బ్రాండ్ ఫైనాన్స్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment