టాటా మోటార్స్‌లో కీలక పరిణామాలు
ముంబై: ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటర్స్ లో రెండు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. టాటా మోటార్స్ (సీవీ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజీనామా చేశారు. మరొకటి కంపెనీ చేపట్టిన కీలక నియామకం. సతీస్ బోర్వాంకర్‌కి సీవోవోగా పదోన్నతి కల్పిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఎగ్జిక్యూటివ్‌ఎడిటర్‌గా ఉన్న సతీష్ పదవీకాలాన్ని మరో రెండేళ్లపాటు పొడిగించాలని నిర్ణయించినట్టు టాటా మోటార్స్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని మార్కెట్ ఫైలింగ్ లో పేర్కొంది.
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (వాణిజ్య వాహనాలు) రవీంద్ర పిషారో వ్యక్తిగత కారణాల రీత్యా కంపెనీని వీడుతున్నట్టు ప్రకటించారు. డైరెక్టర్ పదవితోపాటు, దాని సంబంధిత సంస్థల డైరెక్టర్ల పదవులకు రాజీనామా చేశారు. రవీంద్ర రాజీనామాను స్వాగతించిన టాటా మోటార్స్ తదుపరి నోటీసు వచ్చే వరకు ఆయన పదవీకాలం కొనసాగుతుందని తెలిపింది. కమర్షియల్ వాహనాల వ్యాపార వృద్ధికి ఆయన చేసిన కృషికి కృతజ్ఞతలు తెలియజేస్తూ తన భవిష్యత్ ప్రయత్నాల న్నిటికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని చెప్పింది. వెంటనే సంబంధిత నియమకాన్ని చేపడతామని తెలిపింది.
టాటా మోటర్స్ 2007 లో కమర్షియల్ వాహనాలు (సేల్స్ అండ్ మార్కెటింగ్) వైస్ ప్రెసిడెంట్ గా కంపెనీలో జాయిన్‌అయిన రవీంద్ర
2012 జూన్ 21 నుంచి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాధ్యతల్లో ఉన్నారు. అంతకుముందు ఆయన కాస్ట్రోల్ లిమిటెడ్, ఫిలిప్స్ ఇండియాకు పనిచేశారు.
కంపెనీ కమర్షియల్ వాహనాల విక్రయాలు 2016-17లో కేవలం 0.45 శాతం పెరిగి 3,05,620 యూనిట్లకు పెరిగ్గా, ఈ ఏడాది మే నెలలో కంపెనీ మొత్తం అమ్మకాలు 13శాతం తగ్గి 23,606 యూనిట్లుగా నమోదయ్యాయి. దేశీయ మార్కెట్లో టాటా మోటార్స్ తన వాణిజ్య వాహనాల అమ్మకాలు నెమ్మదించిన సందర్భంలో ఆయన రాజీనామా చేయడం గమనార్హం.