టాటా మోటార్స్ లాభం 25% డౌన్
క్యూ3లో రూ. 3,581 కోట్లు..
- దేశీ మార్కెట్లో మందగమనమే కారణం
ముంబై: దేశీ మార్కెట్లో అమ్మకాల మందగమనం కారణంగా వాహన దిగ్గజం టాటా మోటార్స్ నిరుత్సాహకరమైన ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం(2014-15, క్యూ3)లో కంపెనీ కన్సాలిడేటెడ్(అనుంబంధ కంపెనీలతో కలిపి) ప్రాతిపదికన రూ.3,581 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో రూ.4,805 కోట్లతో పోలిస్తే లాభం 25.47 శాతం దిగజారింది. అయితే, మొత్తం ఆదాయం రూ.63,513 కోట్ల నుంచి రూ.69,122 కోట్లకు పెరిగింది. 8.83 శాతం వృద్ధి నమోదైంది. ఇందులో బ్రిటిష్ అనుబంధ సంస్థ జాగ్వార్ ల్యాండ్‌రోవర్(జేఎల్‌ఆర్) క్యూ3 ఆదాయం రూ.58,550 కోట్లుగా ఉంది. అంతక్రితం ఏడాది క్యూ3లో రూ.53,893 కోట్లతో పోలిస్తే 8.64 శాతం వృద్ధి చెందింది.
భారత్ విషయానికొస్తే...
దేశీయంగా కార్యకలాపాలపై(స్టాండెలోన్) కంపెనీ నష్టాలు మరింత తీవ్రతరమయ్యాయి. ఈ డిసెంబర్ క్వార్టర్‌లో నికర నష్టం రూ.2,123 కోట్లకు పెరిగింది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్‌లో రూ.1,251 కోట్ల నష్టంతో పోలిస్తే... 70 శాతం అధికం కావడం గమనార్హం. కాగా, మొత్తం ఆదాయం రూ.7,671 కోట్ల నుంచి రూ.8,944 కోట్లకు పెరిగింది. క్యూ3లో దేశీయంగా వాహన విక్రయాలు 3.48 క్షీణించి వృద్ధితో 1,27,484 యూనిట్లుగా నమోదయ్యాయి.
టాటా మోటార్స్ షేరు ధర గురువారం బీఎస్‌ఈలో 0.39 శాతం నష్టపోయి రూ.590 వద్ద ముగిసింది. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ ముగిశాక కంపెనీ ఫలితాలు వెలువడ్డాయి.